...తగ్గడం తెలిస్తేనే గొప్ప! జనసేనాని ముందున్న సవాళ్లేంటి?

...తగ్గడం తెలిస్తేనే గొప్ప! జనసేనాని ముందున్న సవాళ్లేంటి?... what are major challenges facing janasena party for strengthen party

Update: 2023-03-13 19:15 GMT

పదో ఏడులోకి అడుగిడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ నిర్ణయాత్మక రాజకీయాలకు తెరతీయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు ఏడాదే వ్యవధి ఉన్న తరుణంలో.... నడకను అడ్డగిస్తున్న ఓ అరడజన్‌ రాజకీయ సవాళ్లను ఎలా ఎదుర్కోనున్నారు అనే దాన్ని బట్టి జనసేన మనుగడ, ఏపీ రాజకీయాలు ఆధారపడనున్నాయి. సంక్లిష్ట సమయంలోనే పరిణతిని చాటేందుకు పవన్‌ కల్యాణ్‌ ఒక సందర్భాన్ని వాడుకోజూస్తున్నారు. రాష్ట్ర విభజనకు నెలల ముందు ఏర్పడి, తొమ్మిదేళ్ల ప్రస్థానం పూర్తిచేసుకున్న జనసేన, నేటి వార్షికోత్సవంతో పదోయేడులోకి ప్రవేశిస్తోంది. అవిభక్త మద్రాసు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నాటి నుంచి ప్రస్తుత అవశేష ఏపీ వరకు... క్రియాశీల రాజకీయ క్షేత్రంగా ఉన్న కృష్ణాజిల్లా సముద్రతీరపు మచిలీపట్నంలో జరిగే బహిరంగసభ ద్వారా జనసేన భవిష్యత్‌ గమనంపై పవన్‌ స్పష్టమైన సంకేతాలిచ్చే అవకాశాలున్నాయి. ‘కాపుల పెద్దన్న పాత్ర’, రామ్‌ మనోహర్‌ లోహియా బాటలో ‘సోషల్‌ ఇంజనీరింగ్‌’ వంటి మాటలు ఆయన నోటి నుంచి వస్తున్నాయి. అవే నేడు తెలుగునాట చర్చనీయాంశాలవుతున్నాయి.

‘ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్ప’ అని, పవన్‌ కల్యాణ్‌కు పేరు తెచ్చిపెట్టిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలో, ఎమ్మెస్‌ నారాయణ నోట పలికిస్తారు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. పవన్‌కు సన్నిహిత మిత్రుడైన త్రివిక్రమ్‌ పరోక్షంగా ఈ మాట ఆయనకే చెప్పారా? దాని సారాన్ని పవన్‌ ఇప్పుడు రాజకీయ దృష్టికోణంలోనే తీసుకుంటున్నారా? ఇటీవలి కొన్ని పరిణామాలు, జనసేనాని వ్యవహరించిన తీరు, వ్యక్తపరచిన అభిప్రాయాలు, సన్నిహితులతో నుడివే మాటల్ని జాగ్రత్తగా విశ్లేషిస్తే అదే వెల్లడవుతోంది. రాజకీయాల్లో ముందు నిలదొక్కుకోవడం అవసరం! ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌కైతే, ‘నిలకడ లేని గాలివాటు నాయకుడు’ అనే ముద్ర తొలగించుకోవాల్సిన తక్షణ అవసరం ఉంది. దానికి తోడు, రాజకీయ సమీకరణాలు, పరిస్థితులు`ప్రజా స్పందన, రాగల పరిణామాలను ఒక వాస్తవిక దృక్పథంతో చూడాల్సిన సందర్భమిది. రాజకీయాల్లో హేతుబద్దమైన ఫలితం రాబట్టని ఆధిపత్యం వల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ లేదని, అంతిమంగా సామాజిక ప్రయోజనాలు రాబట్టడమే ముఖ్యమని ఆయన గ్రహించినట్టు స్పష్టమవుతోంది. అందుకే, సదస్సుకు ముందు వివిధ వర్గాల, సంఘాల వారు, విభిన్న సామాజికవర్గ ముఖ్యులతో విడివిడిగా, సమూహాలుగా ఆయన భేటీ అయ్యారు. లోతుగా చర్చించారు. అంతకు ముందు, రణస్థలంలో ‘యువశక్తి’ సదస్సు, గణతంత్ర దినోత్సవం నాడు పార్టీ శ్రేణులతో తాను వ్యక్తం చేసిన అభిప్రాయాల మంచిచెడుల్ని ఇప్పటికే ఆయన బేరీజు వేసుకుని ఉంటారు. ఎలా చూసినా, ప్రస్తుత సదస్సు కీలకం. ఇది, రాజకీయ క్షేత్రంలో జనసేనకు ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాలు వెతికి, ప్రకటించాల్సిన వేదిక!

తొలి సవాల్‌…అసెంబ్లీ ప్రవేశం

ఎలాగైనా అసెంబ్లీలోకి రావాలి. ‘అధికారం కాదు కదా, కనీసం అసెంబ్లీ గేటును కూడా తాకలేరు’ అని, కిందటి ఎన్నికల్లో తన ఓటమిని గేలి చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులు అంటున్నారు. ఏర్పడ్డ కొత్తలో జనసేన, తను పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి, 2014 ఎన్నికల్లో వారి గెలుపులో కీలకపాత్ర పోషించింది. అదే టీడీపీ సర్కారు ప్రజావ్యతిరేక నిర్ణయాలకు పాల్పడినప్పుడు, తాను స్వయంగా బరిలోకి దిగి, అన్ని స్థానాల్లో పోటీ ద్వారా 2019లో పరోక్షంగా వారి ఓటమికి కారణమైంది. అధికారం చేపట్టడం కన్నా, తగినంత సంఖ్యాబలంతో అసెంబ్లీలో అడుగుపెట్టడం జనసేనానికి ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతాంశం. తద్వారా కూడా నిర్ణయాత్మక శక్తిగా వ్యవహరించవచ్చని జనసేన భావిస్తోంది. ఇందుకు గాను, పవన్‌ కల్యాణ్‌కు నిర్దిష్ట వ్యూహాలు, ఆలోచనలు ఉన్నాయి. వాటిని అమలు పరచి, ఫలితాల ద్వారా మాత్రమే ప్రత్యర్థులకు సమాధానం ఇవ్వాలన్నది ఆయన యోచన!

మలి సవాల్‌... ఓట్ల చీలికను ఆపడం

కిందటి వేర్వేరు ఎన్నికల ఫలితాలను శాస్త్రీయంగా విశ్లేషించాకే, విపక్షాల ఓటు చీలనీయకుండా చూస్తానని పవన్‌ పలుమార్లు ప్రకటించారు. ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబుతో ఇటీవల రెండు సందర్భాల్లో వపన్‌ భేటీ అయ్యారు. ఇప్పటికైతే జనసేన బీజేపీతో కలిసి ఉంది. ఆ సయోధ్యలో భాగంగానే, విశాఖపట్నం వచ్చిన ప్రధాని మోదీతో పవన్‌ బేటీ అయ్యారు. ‘మనమే కలిసి ఎన్నికల్లో ముందుకు సాగుదాం, టీడీపీతో జతకట్టే పనిలేద’ని ఆయన పవన్‌కి సంకేతాలిచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇందులో వాస్తవమెంతున్నా.... ఆ భేటీ తర్వాత కూడా పవన్‌ చంద్రబాబుతో సమావేశమయ్యారు. రణస్థలం బహిరంగసభా వేదిక నుంచి మరోమారు ఓట్లు చీలనివ్వననే మాట పునరుద్ఘాటించారు. ‘ప్రజాకంటక పాలన సాగుతున్నప్పుడు... ఆ ప్రభుత్వాన్ని దింపివేయడం కర్తవ్యమ’ని చెప్పే పవన్‌, ‘సొంతంగా పోటీ చేసి, భంగపోయే ఆత్మహత్యా సదృశమైన పనికి మనం సిద్ధంగా లేం’ అని కూడా ప్రకటించారు. పాలకపక్షాన్ని వ్యతిరేకించే ఓట్లు చీలనీయకుండా, తన వంతుగా ఏం కృషి చేస్తారనేది ఈ సవాల్‌కు ఆయన ప్రతిస్పందన. దాని తీరు తెన్నులెలా ఉంటాయో వేచి చూడాల్సిందే!

పెద్ద సవాల్‌... పొత్తులు ఎవరితో ఎలా?

ఇప్పుడు బీజేపీతో కలిసున్న జనసేనకు టీడీపీతో ఎన్నికల పొత్తు ఉంటుందని ప్రజాక్షేత్రంలో విస్తృతంగా ప్రచారమైంది. ఉభయపక్షాల నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు మానసికంగా పొత్తులకు సిద్ధపడ్డ పరిస్థితి. పొత్తులకు కంగారు పడుతున్నారేమో.. అన్నట్టు, ‘ఒంటరిగా పోటీ చేయగలరా చేయండి చూద్దాం!’ అని సవాల్‌ విసురుతూ పాలక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎత్తుగడతో వ్యవహరిస్తోంది! టీడీపీని కాదని, బీజేపీతో మాత్రమే జనసేన వెళితే, రాష్ట్రంలో ముక్కోణపు పోటీలు అనివార్యమౌతాయి. అప్పుడు, అధికారపక్షం లబ్దిపొందుతుంది! దాంతో, తాను బాపుకోగలిగేది ఏమీ ఉండదని జనసేనకు తెలుసు. టీడీపీ, జనసేన, బీజేపీ... ముగ్గురు కలిసి పాలకపక్షాన్ని ఎదుర్కొనే ఒక అవకాశానికీ యత్నించవచ్చు! అలా కుదరని పక్షంలో, కాంగ్రెస్‌, సీపీఎం తరహాలో రాష్ట్రానికో వైఖరి బీజేపీ, జనసేనలు అనుసరించవచ్చు. కేరళలో ముఖాముఖి తలపడే కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు పశ్చిమ బెంగాల్‌లో, త్రిపురలో పొత్తు పెట్టుకున్నారు. 2014లో తెలంగాణలో వైఎస్సార్‌సీపీతో పొత్తుపెట్టుకున్న సీపీఎంకు, ఏపీలో పొత్తు లేదు. 2018లో తెలంగాణలో కలిసి పోటీ చేసిన టీడీపీ, సిపీఎం`కాంగ్రెస్‌లు 2019లో ఏపీలో విడివిడిగానే పోటీపడ్డాయి. అలా... జనసేన తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని, ఏపీలో వారితో కాకుండా టీడీపీతో పొత్తుపెట్టుకోవచ్చు. ఎవరితో ఉంటారు ఎవరితో తెగదెంపులు అన్నది జనసేనకు పెద్ద సవాల్‌!

నాలుగో సవాల్‌... వలసలు పెరిగేదెలా?

కొన్ని నెలలుగా రాజకీయం వేడందుకొని పొత్తులు`పోటీల గురించి ప్రచారం పెరిగినా ఇతరపక్షాల బడా నాయకుల్ని జనసేన ఆకట్టుకోలేకపోతోంది. గుర్తించదగ్గ వలసలు లేవు. వికటించిన ‘ప్రజారాజ్యం’ అనుభవాల నేపథ్యంలో ఎవరికైనా హామీలివ్వాలన్నా, ఆహ్వానించాలన్నా.... పవన్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పొత్తులు గౌరవప్రదంగా ఉండాలి, పాలకపక్షాన్ని గద్దె దింపి, ప్రజాప్రయోజనాలు సాధించడమే లక్ష్యంగా ఇది జరగాలని ఆయన పదే పదే అనటం, ఇతర పక్షాల నుంచి వచ్చే, రాదలచుకున్న నాయకులకు ఒక సంకేతంగా కనిపిస్తోంది. వ్యక్తిగత మేళ్లు కాకుండా, లక్ష్యం కోసం త్యాగాలకు సిద్దపడితేనే రావాల్సి ఉంటుందన్నది అంతరార్థం! అదే వారికి అడ్డంకి ఔతోందా? పొత్తులు, వాటాల విషయంలోనూ ఆయన రాజీపడతారేమోనన్న ఆశతో... జనసేనకు ఏవో కొన్ని నామమాత్రపు సీట్లు ఇచ్చి, పబ్బం గడుపుకోవాలని టీడీపీ చూస్తోంది. ఈ దిశలో టీడీపీ అధినేతపైన సానుకూలురైన మీడియా పెద్దలు, సామాజిక నేతలు, ఇతర మద్దతు దారుల ఒత్తిడి పనిచేస్తోంది. దానికి ప్రతిగా, పొత్తులున్నప్పటికీ... పూర్తిగా లొంగొద్దని జనసేనానిపై కూడా, హరిరామ జోగయ్య వంటి సీనియర్ల ఒత్తిడి ఉంది. ఏం భరోసా కల్పించి బయటి నాయకుల్ని ఆకట్టుకుంటారన్నది జనసేనానికి సవాల్‌!

కీలక సవాల్‌... ముక్కోణపు ఆస్కారం

ఏ కారణం చేతైనా పొత్తులు కుదరకపోతే ముక్కోణపు పోటీ అనివార్యమని జనసేన, టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఆ పరిస్థితి తనకు మంచిదని పాలక వైసీపీ ఆశిస్తోంది. ఈ విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు నిర్దిష్ట అభిప్రాయాలే కాదు, ప్రభావితం చేసే బలం, బలగం కూడా లేవు. టీడీపీకి ఎలాగూ తప్పదు. మరి, ముక్కోణ పరిస్థితిని జనసేన ఎలా ఎదుర్కొంటుంది అన్నది ప్రశ్న! అది అనివార్యమైతే... బలమైన క్షేత్రాల్లోనే దృష్టి కేంద్రీకరించి 2024 లో నిర్ణయాత్మక శక్తిగా, 2029 లో సొంతంగా రాజ్యాధికారాన్ని చేపట్టే ఆలోచన ఉంది. ఏదైనా ఒకటి, రెండు కులాలను పట్టుకోవడం వల్ల ఏదీ సాధ్యం కాదని, ‘కాపులు పెద్దన్న పాత్ర పోషించి దళిత, బీసీ వర్గాల్ని వెంట తీసుకుపోతేనే రాజ్యాధికారమ’ని పవన్‌ గ్రహిస్తున్నట్టు ఆది, సోమవారాల్లో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలే చెబుతున్నాయి. క్రమంగా ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తర కోస్తా మూడు జిల్లాలు, మధ్య కోస్తాతో సహా ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ... జనసేన బలమైన ముద్ర వేయగలదనే విశ్వాసం నాయకుల్లో వ్యక్తమౌతోంది. 2009, 2014, 2019 వరుస ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రధాన పోటీదారులకు లభించిన ఓట్ల వ్యత్యాసాల్ని చూసినప్పుడు, సదరు వ్యత్యాసాలకు మించి ప్రజారాజ్యం, జనసేనలకు లభించిన ఓటు శాతాన్ని విశ్లేషించుకుంటోంది. కర్ణాటకలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైనా...జేడీఎస్‌ పోషించే ‘నిర్ణయాత్మక పాత్ర’ ఇక్కడ జనసేనకు దక్కొచ్చు!

ఆరో సవాల్‌.. సోషల్‌ ఇంజనీరింగ్‌ సాధ్యాసాధ్యాలు

పొత్తులతో కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎమ్పీ), మరోవైపు ఉమ్మడి రాజకీయ భాగస్వామ్యం (సీపీపీ) అన్ని స్థాయిల్లో ఉండాలని జనసేన ప్రతిపాదిస్తోంది. రేపటి పొత్తుల్లో ఇదే అంశాన్ని ప్రాతిపదిక చేయాలన్నది యోచన. అదే సమయంలో.... ఏ ఒక్క సామాజికవర్గం పైనో పూర్తిగా ఆధారపడకుండా, ఇతర ముఖ్యమైన కులాలు, వర్గాలు అన్నింటినీ కలుపుకుపోయే ‘రామ్‌ మనోహర్‌ లోహియా సిద్దాంత’ మార్గాన్ని అనుసరించాలనేది జనసేన తలంపు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతికి గెలుపు బాటలు పరచిన, దళిత`బ్రాహ్మణ సోషల్‌ ఇంజనీరింగ్‌లో సతీష్‌ మిశ్రా పోషించిన పాత్ర ఇక్కడ నాదెళ్ల మనోహర్‌ నిర్వహిస్తున్నట్టుంది. జనసేనను టీడీపీకి దగ్గరికి తేవడం ద్వారా రెండు బలమైన సామాజిక వర్గాలు కాపు, కమ్మ మధ్య సయోధ్యకు ఓ యత్నం జరుగుతోంది. అదే బాటలో... దళిత, బీసీలను ఆకట్టుకోగలిగితేనే కూటమి బలమైన రాజకీయశక్తి కాగలదనే భావన ఇంటాబయటా ఉంది. ఈ సవాళ్లన్నింటికీ సమాధానాలు వెతకటమే కాకుండా వార్షిక సదస్సు వేదిక నుంచి స్పష్టమైన ప్రకటన చేయడం జనసేన ముందున్న పెద్ద సవాల్‌!

(నేడు బందరులో జనసేన వార్షిక సదస్సు సందర్భంగా)

దిలీప్‌రెడ్డి

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ

dileepreddy.ic@gmail.com

9949099802

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Tags:    

Similar News