రేవంత్ పాలనపై.. ప్రతిపక్షాల పరివేదన!
అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అంటే పొడగిట్టని ప్రత్యర్థులు పలు రకాల దుష్ప్రచారాలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి అంటే పొడగిట్టని ప్రత్యర్థులు పలు రకాల దుష్ప్రచారాలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాద్ ఖాళీ అవుతుందని అబద్ధాలు చెప్పారు. సోషల్ మీడియా, మీడియా… పత్రికా ప్రకటనలు ఇలా అన్ని వేదికల్లో చాలా నెగటివ్ ప్రచారం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము కష్టపడి తీసుకొచ్చిన పరిశ్రమలు తరలిపోతాయన్నారు. కొత్తవి అసలు రానే రావంటూ బీఆర్ఎస్ నాయకులు మోత మోగించారు. అయినా, అబద్ధాలను దాటుకొని రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపొందింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే పనిలో పడ్డారు. ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టడంతో పాటు పెట్టుబడుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ క్రమంలోనే తొలుత దావోస్, తాజాగా అమెరి కా, దక్షిణ కొరియా వెళ్లారు. ఐటీ, పరిశ్రమల రంగంలో ఇప్పటికే తెలంగాణలో పనిచేస్తున్న కంపెనీల విస్తరణకు ఒప్పించడంతో పాటు పలు నూతన కంపెనీల పెట్టుబడులు పెట్టేలా యత్నించారు.
ప్రచారానికే పరిమితమై..
కర్ణాటకలో పనిచేసే నా మిత్రుడైన ఆంగ్ల జర్నలిస్ట్ కొన్ని రోజుల క్రితం నాకు ఫోన్ చేసినప్పుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలన తీరుతెన్నుల గురించి ప్రత్యేకంగా సంభాషించుకున్నాం. గత ప్రభుత్వంతో పోల్చితే చాలా మేరకు ఆశాజనకంగానే రేవంత్ రెడ్డి పాలన సాగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడుల విషయంలో పెద్ద ఎత్తున ప్రచారానికే పరిమితమైంది. వాటిని క్షేత్రస్థాయికి తీసుకురావడంలో దృష్టి కేంద్రీకరించలేదు. భారీ పెట్టుబడులు... వేల ఉద్యోగాలు అంటూ ప్రకటనలు గుప్పించేది. కానీ అవి వాస్తవ రూపం దాల్చినట్లు కనిపించలేదు. పైగా ఆ కంపెనీలకు అవసరమైన మానవ వనరులకు ఉండాల్సిన నైపుణ్యాల విషయంలోనూ ఎటువంటి శ్రద్ధా పెట్టలేదు. అందుకు భిన్నంగా సీఎం రేవంత్ ఆయా కంపెనీలకు కావాల్సిన నిపుణులను అందించేందుకు వీలుగా స్కిల్ యూనివర్సిటీని రంగారెడ్డి జిల్లాలోని బ్యాగరికంచెలో ప్రారంభించారు. ఏ అంశంపైనైనా ఒక స్పష్టత ఉన్నప్పుడు ఇటువంటి నిర్మాణాత్మకమైన చర్యలుంటాయి.
హైదరాబాద్ అభివృద్ధికి కారణం..
రాష్ట్రావతరణ జరిగిన 2014లో తెలంగాణ నుంచి ఐటీ ఉత్పత్తులు, సేవల ఎగుమతులు యాభై వేల కోట్లు ఉంటే అవి ప్రస్తుతం రెట్టింపు కన్నా ఎక్కువై ఈ ఏడాది లక్షా నలభై ఐదు వేల కోట్లకు చేరుకున్నాయంటే దానికి ప్రధాన కారణం ఒక వ్యక్తి కానే కాదు. హైదరాబాద్‌లో ఉన్న అనువైన వాతావరణం అని సీఎం రేవంత్ ఇటీవల క్రెడాయ్ ప్రోగ్రాంలో చెప్పడం చూస్తే.. నిజమే అనిపించింది. ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ ఎందుకు అభివృద్ధి అవుతోందంటే... ఈ ప్రాంతంలో అన్ని రకాల వసతులు ఉండటం, వ్యాపార శక్తులకు అవసరమైన భూమి, కరెంటు, నీరు కావల్సినంత అందుబాటులో ఉండటమే ప్రధాన కారణమని సీఎం చెప్పుకొచ్చారు. అందుకే ప్రపంచంలోనే టాప్ పొజిషన్‌లో ఉండే టెక్ కంపెనీలు, అనేక ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇవ్వాళ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి కారణం ఇదే అని స్పష్టంగా చెప్పవచ్చు. అలాగే రైతుల విషయంలోనూ అంతే.. రేవంత్ పాలన ప్రారంభించగానే, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు రుణమాఫీని అమలు చేశారు. ఇప్పటీకే సుమారు రూ.18 వేల కోట్ల మాఫీతో 22 లక్షల రైతు కుటుంబాలు అప్పుల ఊబి నుంచి బయటపడ్డాయి. సాంకేతిక కారణాలతో పలువురి రైతుల రుణాలు మాఫీ కాలేదు. కానీ వాటిపైనా దృష్టి పెడతామని చెప్పడం స్వాగతించాల్సిన విషయమే.
నాయకత్వపు గీటురాయి పాలనా సామర్థ్యమే!
ఇకపోతే, సీఎం రేవంత్ రెడ్డి ఆంగ్ల భాషా పరిజ్ఞానం చుట్టూ సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతలు చేస్తున్న దుష్ప్రచారం చాలా జుగుప్సాకరంగా ఉన్నది. ఆయన ఇంగ్లిష్, హిందీ భాషానైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది అసలు అవసరమైన చర్చేనా? అంతర్జాతీయ వేదికలపై ఆయన సరైన ఇంగ్లిష్ మాట్లాడలేకపోవడం వల్ల తెలంగాణను ప్రపంచం ఎలా చూస్తుందనే విషయాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలుపెట్టారు. అదే సమయంలో, తెలంగాణలో ప్రభుత్వం నడపడానికి ముఖ్యమంత్రికి కావాల్సింది ఇంగ్లిష్ భాషా? లేదంటే పరిపాలనా దక్షత, ఇతర సామర్థ్యాలా? అన్నది గుర్తించకపోవడం వారి మనో వైకల్యతను సూచిస్తోంది. ఏ దేశపు పెట్టుబడిదారైనా చూసేది నాయకుడి ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాదని... తమ పెట్టుబడులకు సీఎం పరిపాలనపరంగా ఏ విధమైన సపోర్టు ఇస్తున్నారన్న విషయాన్నే అని గుర్తుంచుకోవాలి. ఆయా దేశాలు, రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఎలా ఉంది? పారిశ్రామికవేత్తలు అక్కడ తమ పరిశ్రమ లేదా వ్యాపారానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది చూస్తారు. అంతేకానీ, నాయకుల భాషా పరిజ్ఞానాన్ని చూడరన్నది తెలుసుకోవాలి.
ఆంగ్లం మాట్లాడితే పెట్టుబడులు వచ్చేస్తాయా?
ఇంగ్లిష్ భాషా నైపుణ్యమే ప్రాతిపదిక అయితే ప్రపంచంలోని ఇన్వెస్టర్లంతా అమెరికాకో, బ్రిటన్‌కో లేదంటే ఇంగ్లిష్ మాట్లాడే నాయకులున్న ఇతర దేశాలకో క్యూ కట్టాలి కదా. ఒడిశాలో నిరాటంకంగా 22 ఏళ్ల పాటు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ఒడియా సరిగా రాదు... ఆయన విద్యాభ్యాసమంతా ఇంగ్లిష్ మీడియంలోనే సాగింది. ఆయన ఫ్రెంచ్ అద్భుతంగా మాట్లాడతారు. కానీ నవీన్ పట్నాయక్ ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల నైపుణ్యం ఒడిషాకు పెట్టుబడులు తీసుకురాలేదనే విషయం ఆయన వ్యతిరేకులతో పాటు ఆ ప్రభావంలో పడే వారు గుర్తించాలి. గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నరేంద్ర మోడీకి ఇంగ్లిష్ అసలు ఏమాత్రం రానేరాదన్న విషయం తెలుసుకోవాలి. చివరగా ఇవన్నీ పక్కనబెడితే... సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు చేయని పని… రేవంత్ వచ్చాక జరిగిన ప్రధాన మార్పు ఏమిటంటే… ప్రజాస్వామికంగా ఉండటం. కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్యమా నువ్వెక్కడా? అన్న పరిస్థితి నుండి.. ప్రస్తుతం ప్రజాస్వామిక పాలన చూస్తున్నాం. అందుకే, మనలో వేదన ఏమాత్రం అక్కర్లేదు. రేవంత్ పాలన పరుగు చూశాక... పరివేదన పడాల్సింది ప్రతిపక్షాలే!
సాగర్ వనపర్తి,
జర్నలిస్టు,
91000 04402