‘యుద్ధం గెలిచినవాడి కంటే యుద్ధాన్ని ఆపినవాడు గొప్పవాడు’. ఎందుకంటే యుద్ధం వల్ల ఒక వ్యక్తిపై ఆధిపత్యం సాధించవచ్చు. ఒక ప్రాంతం మీద పెత్తనం చెలాయించవచ్చు. ఒక దేశాన్ని శాసించవచ్చు. కానీ దాని వెనుక జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని భర్తీ చేయలేం.
అనాథలుగా వేల మంది..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేల మంది సామాన్య ప్రజలను అనాథలను చేసింది. మహిళలపై అత్యాచారాలు, చిన్నారులపై అఘాయిత్యాలకు చిరునామాగా నిలిచింది. యుద్ధంలో దాదాపు 3 లక్షల మందికి పైగా రష్యన్ సైనికులు మరణించారని ఉక్రెయిన్ చెబుతోంది. దాదాపు 10,000 మంది కంటే ఎక్కువ పౌరులు మరణించారని అంచనా. వీరిలో 600 మందికి పైగా చిన్నారులున్నారు. 10,000 పైగా మంది పౌరులు క్షతగాత్రులయ్యారు. ఉక్రెయిన్ దేశం విడిచి శరణార్థులుగా వెళ్లిన వారు 70 లక్షలకు పైగానే ఉన్నారు. ఈ యుద్ధం కొనసాగుతుండగానే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలై వేల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటుంది. 3 వేలకుపైగానే ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఈ యుద్ధాల వలన కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తులు చనిపోతే వారికి జీవితాంతం ఇబ్బందులే ఎదురవుతాయి. లక్షలాది మందిని నిరాశ్రయులయ్యారు. అనాథలుగా మారుతారు.
చర్చలే పరిష్కార మార్గాలు..
ఏ రెండు దేశాల మధ్యనైనా సున్నితమైన అంశాలే యుద్ధానికి దారితీస్తాయి. అలాంటి అంశాలపై ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. యుద్ధానికి దారితీసే సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ప్రయత్నించాలి. మిత్ర దేశాల సలహాలు, సూచనలు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ పరిస్థితులను నివారించాలి. యుద్ధాన్ని ఆపడం వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టవచ్చు. లక్షలాది మంది అమాయక ప్రజల ప్రాణాలను కాపాడవచ్చు. ఆయా దేశాల ప్రజలకు శాంతిని, స్వేచ్ఛను పంచవచ్చు. ప్రపంచ దేశాలు చొరవ తీసుకుని యుద్ధం ఆపి శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉంది. అనేక మంది అమాయక ప్రజల జీవితాలను కాపాడాల్సి ఉంది. అభివృద్ధి, ఆధిపత్యం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏదో ఒకచోట యుద్ధం జరుగుతూనే ఉంది. వేలమంది అనాథలవుతున్నారు. వారికి చేయూతను అందించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంటుంది. వారికి రక్షణ, ఉపాధి, విద్య, వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇరుదేశాల నడుమ శాంతి నెలకొని మరింత మంది అనాథలు కాకుండా నిలువరిస్తారని ఆశిద్దాం.
(నేడు ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం)
-కాసాని కుమారస్వామి
9676218426