వేతనం పెంపు సరే.. క్రమబద్ధీకరణ ఏది?

ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు నిర్ణయించే విషయంలో అనేక రకాలుగా వివక్షత అనాదిగా కొనసాగుతూనే ఉన్నది

Update: 2023-05-12 02:25 GMT

ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు నిర్ణయించే విషయంలో అనేక రకాలుగా వివక్షత అనాదిగా కొనసాగుతూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా భావించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కార్మికులు గానే కొనసాగడం, అరకొర వేతనాలతో ఉద్యోగ సంఘాలు లేకుండా ఉండ వలసి రావడం వంటి అపసవ్య విధానాలకు రాష్ట్ర ప్రభుత్వమే కారణమవుతున్నది. 2019 సంవత్సరాంతంలో ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేసినప్పటికీ స్పందించని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను రద్దు చేసుకుంటేనే ఉద్యోగాలు ఉంటాయని హెచ్చరించి కొద్దిమందిని ఆహ్వానించి భోజనాలు పెట్టించి వేతన పెంపుదలను మరిచిపోయిన విషయం మనకు తెలిసినదే కదా!

ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఉద్యోగాలను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించి మొక్కుబడిగా వేతనాలు పెంచుతున్నారే తప్ప వేతన క్రమబద్ధీకరణ జరగడం లేదు. ముఖ్యమంత్రి గతంలో అనేకసార్లు చట్టసభల్లో కూడా హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి రాకముందు ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పటికీ ఇప్పటికీ ఎన్నో డిపార్ట్మెంట్లలో ఏక మొత్తం వేతనాలతోనే ఉద్యోగులు చాలీచాలకుండా జీవిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల మే ఒకటిన సీఎం కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు వెయ్యి రూపాయల పెంపుపై చేసిన ప్రకటన కొంత ఊరట లభించవచ్చు కానీ ఇది వెట్టి చాకిరీ కాక మరి ఏమవుతుంది? రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, హైదరాబాద్ మహానగరపాలక సంస్థలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వెయ్యి రూపాయల పెంపుతో హర్షించకుండా మరొక్క అడుగు ముందుకు వేసి, పాలాభిషేకాలు చేయడం మాని, వేతన క్రమబద్ధీకరణ కోసం ఉమ్మడిగా డిమాండ్ చేస్తేనే వేతన పెంపుదల సాధ్యమవుతుంది.

రూ. 1000ల పెంపును ప్రకటించిన సీఎం

ప్రస్తుతం గ్రామపంచాయతీలో కార్మికులకు రూ. 8,500 పురపాలక, నగరపాలక సంస్థలలో రూ. 15,600, హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు రూ.17,500 ఇస్తున్నట్లుగా తెలుస్తున్నది. పని వేళలు స్పష్టంగా ప్రకటించనటువంటి, నిరంతరం పారిశుద్ధ్య పనిలో లీనమై, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగు పరచాలని శ్రద్ధ సోయి లేని ప్రభుత్వం అతి తక్కువ ఏక మొత్తం వేతనాలతో ఆ కుటుంబాలు ఎలా పోషించబడతాయో ఆలోచన లేకపోవడం దారుణమే కదా! మరొక రకంగా ఇంత అత్యల్ప స్థాయిలో ఇస్తున్న వేతనం అంటే కార్మికులతో నిరంతరం రోజంతా పెట్టి చాకిరి చేయించుకోవడమే అన్నా అతిశయోక్తి లేదు. మే ఒకటిన కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పారిశుద్ధ కార్మికుల వేతనాన్ని 1000 రూపాయలు పెంచుతున్నట్లుగా ప్రకటించిన ముఖ్యమంత్రి జిహెచ్ఎంసి, మెట్రో వాటర్ వర్క్స్ తో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జిల్లా మండల పరిషత్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఈ నెల వేతనంతో పాటు వెయ్యి రూపాయల అదనపు భత్యం అందుతుందని ప్రకటించారు. సఫాయి అన్న నీకు సలాం అన్న అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ కార్మికుల సంక్షేమానికి నిబద్ధతతో పని చేస్తున్నదని ముఖ్యమంత్రి ప్రకటించిన దానిలో వాస్తవం ఎంతో ప్రజలు గ్రహించాలి. ఈ పెంపుతో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 1,06,474 మంది పారిశుద్ధ కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ప్రకటిస్తూ పారిశుద్ధ్య కార్మికుల కృషి ఎనలేనిదని ప్రశంసించడం బాగానే ఉంది. కానీ తాత్కాలిక వేతనాలు కాకుండా శాశ్వత వేతనాల పైన నియమించడానికి మనసొప్పక పోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? వారి వేతన క్రమబద్ధీకరణ మర్చిపోవడం ఏ మేరకు సమంజసం.

పారిశుధ్య కార్మికుల గురుతర పాత్ర

ముఖ్యంగా వీరు కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వైద్య ఆరోగ్యశాఖతో పాటు సాధారణ పరిపాలన శాఖలకు ఎంతో సహకరించి ప్రజలందరికీ సేవ చేసిన విషయాన్ని మర్చిపోలేము. కానీ కరోనా కాలంలో అత్యవసర ప్రాతిపదిక మీద వేలాది మంది నర్సులను తాత్కాలిక పద్ధతిలో తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరం తీరగానే వారిని తొలగించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో అవుట్‌సోర్సింగ్ ఇతర తాత్కాలిక పద్ధతుల పైన నియామకమైనటువంటి వారికి, ఎన్నో సంవత్సరాలుగా తాత్కాలిక పద్ధతుల్లో పనిచేస్తున్న వారికి క్రమబద్ధీకరణ అమలు చేయడం ద్వారా టెంపరరీ ఉద్యోగులు లేకుండా అందరినీ శాశ్వతం చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదు. నికృష్టమైన స్థితిలో పనిచేసే వారికి అల్ప వేతనాలతో కనీస అవసరాలు తీర్చలేమని పాలకులకు తెలియదా? ఒక దశలో 1980 ప్రాంతంలో నియామకమైనటువంటి పార్ట్ టైం స్వీపర్ల వేతనం ఇప్పటికీ 5000 రూపాయల వద్దనే స్థిరపడింది అంటే ఉద్యోగుల కోసం ప్రభుత్వాలు పనిచేయడం లేదని స్పష్టం అవుతున్నది కదా! పాలకుల ఈ తీరు మారాలి.

ఇచ్చిన హామీ మేరకు ముఖ్యంగా అన్ని రకాల తాత్కాలిక ఉద్యోగులతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు దిగువ స్థాయి ఉద్యోగులతో సమానమైన వేతన స్కేల్‌ని వర్తింపజేసి తమ చిత్తశుద్ధిని నిబద్ధతను చాటుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. అంతేకానీ 1000 రూపాయలను తాత్కాలికంగా పెంచి కార్మికుల జీవితాలను ఉద్ధరించినట్లుగా ప్రకటించడం పరిష్కారం కాకపోగా వెట్టి చాకిరీని చట్టబద్ధం చేయడానికి చేస్తున్న ప్రయత్నంగా భావించవలసి ఉంటుంది. క్రింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరికి వేతన స్టేలు వర్తింప చేయడానికి ఉద్యమించినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు దిగువస్తాయి. వాస్తవాలను అంగీకరిస్తాయి. వీరి డిమాండ్లు పరిష్కారానికి నోచుకుంటాయి. ప్రజాధనాన్ని అన్ని వర్గాలకు సమ పంపిణీ చేయవలసిన బాధ్యతను పాలకులు చిత్తశుద్ధిగా తీసుకోనంతవరకు పారిశుద్ధ్య కార్మికులు వంటి కొన్ని వర్గాలకు ఈ వివక్ష చట్టబద్ధమే అవుతుంది. కనుక ఆయా వర్గాలతో పాటు అనుబంధ సంఘాలు, అఖిలపక్షాలు కార్మిక సంఘాలు వేతన స్కేల్ కై డిమాండ్ చేసి పోరాడితేనే వారి జీవితాలలో వెలుగులను చూడవచ్చు. తద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచడానికి ఆస్కారం ఉంటుంది.

వడ్డేపల్లి మల్లేశం

సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత

90142 06412

Tags:    

Similar News