తరాలు మారినా పేదోడి తలరాత మారడం లేదన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది ప్రభుత్వ వైఫల్యమా? లేదా ప్రజల వైఫల్యమా? నీతి, నిజాయితీ, న్యాయం పట్ల నిబద్ధత ఉన్న వారిని ఎన్నుకోకుండా, డబ్బులు ఇచ్చినవారినే ఎన్నుకోవడమే దీనంతటికి కారణంగా చెప్పవచ్చు. దీనిని బట్టి ప్రజలు అభివృద్ధి కోరుతున్నారా? అవినీతి కోరుతున్నారనేది అర్ధం కానీ ప్రశ్నగా మారింది. అభివృద్ధి కోరుకున్నట్లైతే అభివృద్ధి చేసే నాయకున్ని ఎన్నుకోవాలి, అవినీతి కోరుకున్నట్లైతే అవినీతిపరుడైన నాయకున్ని ఎన్నుకోవాలి. ఈ రోజుల్లో అన్ని పార్టీలు డబ్బులు పంచడం మామూలే. అయితే ప్రజలు ఎవరికి ఓటు వేయాలి అనేది ఆలోచించవలసిన ప్రశ్న. డబ్బులు ఎక్కువ ఇచ్చేవాడికా? అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్న నాయకుడికా? చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు ఓటు వేసే సమయంలోనే సరైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నాయకున్ని ఎన్నుకోవాలంటే ప్రజల్లో ఓటు హక్కు ప్రాధాన్యత అవగాహన తప్పనిసరి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రజలను మభ్యపెట్టి..
ఒకప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజలు సంతోషంగా ఓటు వినియోగించడానికి ముందడుగు వేసేవారు. కారణం ఇచ్చిన హామీలు నెరవేరుతాయని, నిరుపేదలకు చేయూత అందుతుందని. అప్పట్లో నాయకులు ఇచ్చే హామీలు అలా నమ్మదగినవిగా ఉండేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు! ఒకాయన ఈసారి మేము గెలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు తక్కువే ఇస్తామని, మరొకాయన మేము గెలిస్తే అంతకంటే తక్కువకు ఇస్తామని హామీలిస్తున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? అనేది ఓటరు ఆలోచన చేయాల్సిన అవసరముంది. నిత్యావసర వస్తువుల ధరలు మండుతూనే ఉంటాయి. ధరలు పెరగడానికి కారణాలు వెతుకుతూ ప్రజలను మభ్య పెట్టడం తప్ప ప్రయోజనం ఉండదు. అది నాయకుల కనికట్టు మంత్రం. ఊక దంపుడు ఉపన్యాసాలు తప్ప ఉపయోగపడే ఉపన్యాసం ఒకటి ఉండదు. ఇది జగమెరిగిన సత్యం. ఓట్లు దగ్గరపడ్డాక జనాలలో వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి ఓట్లు అయినాక అంతకంత పెంచడం నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాకుండా ఓట్లకు ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుంది. తాగనివాడికి కూడా తాగడం నేర్పుతారు తాగుడుకి బానిసను చేసి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తారు. ఓట్లేసే జనాలు ఎర్రిపప్పలు అనుకుంటారేమోగాని జనాలు తిరగబడితే అదోలా ఉంటుందన్న సంగతి నాయకులు ఎరుగరు. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఉచిత రేషన్ లాంటి పథకాలు ప్రజలకు అవసరం అంతేగాని పెన్షన్ పథకాలు పెట్టి సోమరిపోతులను చేస్తున్నారు. ఏ పని చేయక అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రస్తుతం నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవడం ఎలా అనేది ప్రజలకు పెద్ద సవాలే.. నిజాయితీ నాయకుడిని గుర్తించి ఓటు వేయాలి!
ఓటు ఆయుధంగా మారాలి!
ప్రజా ప్రతినిధుల నేరచరిత్ర ఎన్నికల సంఘం పరిధిలోకి చేర్చడమే కాకుండా, ఓటర్లు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉండేలా ఎన్నికల సంఘం వెబ్‌సైట్లలో అన్ని అంశాలను పొందుపరచాలి. అప్పుడే ఓటరు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశముంది. అంతేకాకుండా అభ్యర్థి గెలిచిన తర్వాత అవినీతికి పాల్పడినట్లైతే ఆ సమయంలో ఓటర్లు రీకాల్ చేసుకొని మరొకరిని ఎన్నుకునే వెసులుబాటు కల్పించాలి. దీనివల్ల అవినీతిని అరికట్టే అవకాశముంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో రీకాల్ సిస్టమ్ అమలులో ఉంది. ఇలాంటి దేశాలలో మాత్రమే సుపరిపాలన పరుగులు పెడుతుంది. ఇలాంటి చట్టాల కోసం యువత కృషి చేయాలి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి. ప్రస్తుతం 90 శాతం మంది నాయకులు అవినీతిపరులు అయితే 10 శాతం మంది నిజాయితీ గల నాయకులున్నారు. ఉదాహరణకు గుమ్మడి నర్సయ్య 5 సార్లు ఎమ్మెల్యేగా చేసినా ఇప్పటికి సాధారణ జీవితం కొనసాగించడం గొప్ప విషయం. సమాజానికి గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తులు అవసరం. ఈరోజుల్లో ఒకసారి ఎమ్మెల్యే అయితేనే తరాలకు సరిపడా సంపాదన వెనకేసుకుంటున్నారు. గుమ్మడి నర్సయ్య లాంటి వాళ్ళు సంపాదన కోసం కాకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాడిన నాయకుడు. ఇలాంటి వారిని ప్రజలు ఎందుకు ఎన్నుకోరు? ప్రజలే మోసపోతున్నారు కానీ నాయకులు మోసం చేయడం లేరన్న విషయం గమనించాలి. సమాజంలో మార్పు రావాలంటే సమస్యలపై పోరాడే నాయకుడు కావాలి. అప్పుడే పేదలకు సరైన సంక్షేమ పథకాలు అందుతాయి. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోని సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. పేదోడి కల నెరవేరాలంటే. ఓటు ఆయుధంగా ఉపయోగించిన నాడే సాధ్యపడుతుంది.
కోట దామోదర్
93914 80475