ఓటును వినియోగించుకోండి!

Vote must be used in elections

Update: 2023-11-30 00:30 GMT

ఓటు ప్రతి ఒక్కరి బాధ్యత, అది ప్రతి పౌరుడి ఆయుధం. దేశ రాజకీయాలను, వ్యవస్థల ప్రక్షాళనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం. ప్రస్తుత పరిస్థితుల్లో యువత పాత్ర ఓటు వేయడంలో చాలా తక్కువగా ఉంది. దానికి కారణం రాజకీయాల్లో యువత భాగస్వామ్యం తగ్గడం వ్యవస్థపై నమ్మకం లేకపోవడం. పైగా ఈ ఒక్క ఓటుతో ఏదైనా మారుతుందా? అనే సంకోచం కారణంగా ఓటు హక్కును ఎక్కువగా ఉపయోగించడం లేదు. కానీ ఈ ఆత్మనూన్యత యువకులలో ఉండొద్దు! మన చుట్టూ జరుగుతున్న అన్యాయాన్ని యువత ప్రశ్నించాలి వాటి వల్ల వచ్చే కష్టాలను ఎదుర్కోవాలి, పోరాడాలి. యువత ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే చుట్టూ ఉన్న సమాజం వారికి సహకరిస్తుంది.

వ్యవస్థలో మార్పు రావాలంటే..

ప్రపంచంలో ఎక్కడా లేని యువత మన భారతదేశానికి సొంతం. ఈ యువత రేపటి భారతదేశం భవిష్యత్తుకు బలం. కానీ నేడు యువత తమ బాధ్యతను పక్కన పెట్టడం బాధాకరం. నేడు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతి పార్టీ కూడా తమ స్వలాభం కోసం యువతను ఉచితాలకు అలవాటు చేస్తున్నాయి. ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. పట్టభద్రులైన యువత ప్రలోభాలకు లొంగుతున్నారు. ఇది దేశానికి వెన్నుపోటు లాంటిది. ఐదు ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు తమ మిగతా ఐదు ఏళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దే బాటలు అని ఓటర్లు గుర్తించలేకపోతున్నారు.

ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఎటువంటి కోరికలు లేకుండా తనకు అప్పగించిన పదవిని బాధ్యతతో నిర్వర్తించాలి.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పదవి అంటే ఐదేళ్లపాటు ఒక సింహాసనం అనుకుంటున్నారు. హత్యలు, దోపిడీలు, కబ్జాలతో దేశాన్ని రాష్ట్రాలను, ప్రజలను దోచుకుంటున్నా వైనం. వీటిని మార్చగలిగే శక్తి ఒకే ఒక్క యువతకు మాత్రమే ఉంది. ఎంతోమంది యువత ధైర్యం చేసి ముందడుగు వేసిన చుట్టూ ఉన్న సమాజం వాళ్ళను నిరాశ పరుస్తోంది. దాని కారణంగా యువత నాకెందుకులే అనే భావన వారి మనసులో నాటుకుపోయింది. ఈ భావం యువత మనసులోంచి తొలగించుకోవాలి. ప్రజలు కోరుకునేవి ఉచితాలు కాదు.. సమస్యల పరిష్కారాలు, ఉపాధి అవకాశాలు.. సమాజంలో నెలకొన్న అసమానతలు నిర్మూలన ఈ అంశాలను సాధించే శక్తి ఒక యువతకు మాత్రమే ఉంది. ఓటు వేసే ముందు ఓటర్లు నేను వేసే ఓటు నా దేశ భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందా లేదా? అనేది ఆలోచించాలి. వ్యవస్థలో మార్పు కోసం, రాజకీయాల్లో మార్పు కోసం మనం పొందిన ఓటు హక్కును వినియోగించుకుందాం! దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం మన భవిష్యత్తుకు, దేశ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరం.

- వరాల సాయి యశ్వంత్

సామాజిక కార్యకర్త

9502052909

Tags:    

Similar News