24 ఫ్రేమ్స్ :విజువల్ ఎడ్యుకేషన్ కావాలి

24 ఫ్రేమ్స్

Update: 2022-03-18 18:45 GMT

చిన్న సినిమాలను ప్రదర్శించి వాటిని విద్యార్థులు view and review పేర విశ్లేషించేలా చూడాలి. అపుడే చిన్న తనం నుండే విలువలు, సృజన రెండూ అలవడుతాయి. మానవీయ విలువలను ప్రోత్సహించడం ద్వారా ఉత్తమ లక్షణాలను ప్రోది చేయవచ్చు. 'చీకటిని నిందిస్తూ కూర్చోవడం కన్నా చిరు దీపాన్ని వెలిగించడం' మంచిది. నేనే ఒక కవితలో ఇలా రాసుకున్నాను 'చీకటికి ఉనికి లేదు, వెలుతురు క్షీణించడమే చీకటి' అందుకే చిన్న వయసులోనే వెలుగులు నింపే ప్రయత్నం జరగాలి. విజువల్ లిటరసీని పెంపొందించాలి. పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసులను అమలు చేయాలి.

దివే సంస్కృతి నుంచి ఆధునిక తరం వేరై పోతూ చూసే సంస్కృతికి దగ్గరవుతున్నారు. లుక్ కల్చర్ పెరిగి బుక్ కల్చర్ కనుమరుగవుతున్నది. కొన్ని దశాబ్దాలుగా చదివే అలవాటు తగ్గిపోతున్నది. టీవీ చూస్తారు, సినిమా చూస్తారు, కంప్యూటర్ చూస్తారు, స్మార్ట్ ఫోన్‌ను మాట్లాడానికంటే బొమ్మలు, వీడియోలు చూడటానికే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇట్లా పెల్లుబుకుతున్న 'దృశ్య సంస్కృతి' గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇది. వర్తమానంలో ప్రబలుతున్న చెడు ధోరణులకు మౌలిక కారణాలను తరచి చూడాల్సి వుంది. ఇంటా, బయటా, విద్యాలయాలలోనూ ఉపయోగిస్తున్న దృశ్య మాధ్యమాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలి. సినిమాలు సహా సమస్త దృశ్య మాధ్యమం వలన కలిగే దుష్ప్రభావాలను నిరోధించగలగాలి. అమానవీయ దుష్ట సంస్కృతిని పెంపొందించే దృశ్యాల మంచి చెడుల విచక్షణ జరగాలి. సమాజంలో అర్థవంతమయిన దృశ్య సంస్కృతిని (VISUAL CULTURE) ని పెంపొందించే కృషి ప్రారంభం కావాలి.

ఆ ఆలోచన రావడం మంచిదే

విద్యార్థులలో సృజనాత్మకతను పెంచే 'కళ'ల విద్యను (ART EDUCATION) దేశ‌వ్యాప్తంగా పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రవేశపెట్టాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ప్రధానంగా నాట్యం, సంగీతం, విజువల్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్ కోర్సులు పెట్టాలని సూచించింది. 'అఖిల భారత సృజనాత్మక కళల విద్యామండలి' (COUNCIL FOR CREATIVE ARTS) సైతం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. జాతీయస్థాయిలో కళల కోసం కేంద్రీయ విద్యాలయం (CENTRAL UNIVERSITY FOR ARTS) ఏర్పాటు అవసరమని కూడా తేల్చి చెప్పింది.

కమిటీ సూచనలని కేంద్రం ఏ మేరకు స్వీకరిస్తుందో తెలీదు. కానీ, కళల పట్ల, విద్యార్థులలో దృశ్య చైతన్యం పట్ల జాతీయస్థాయిలో ఆలోచనయితే మొదలు కావడం సంతోషకరమే. నిజానికి ఇవ్వాళ డ్రగ్స్ కల్లోలం, ఆత్మహత్యలు, హత్యలు, ప్రమాదాలు, ఒకటేమిటి సమాజం యావత్తూ సంక్షోభ పూరిత పరిస్థితిలోకి నెట్టి వేయబడుతున్నది. హేతుబద్ధంగా లేని దగాకోరు అభివృద్ధి ప్రతిఫలాలే ఇవన్నీ. మానవీయ కోణం లేకుండా కేవలం డబ్బు, తాత్కాలిక సుఖ సౌకర్యాల కోసం అభివృద్ధి పేర జరుగుతున్న కార్యక్రమాల ఫలితాలే ఇవన్నీ. ఈ స్థితి ముఖ్యంగా యువకులలో, విద్యార్థులలో పెచ్చరిల్లడం అత్యంత ప్రమాదకరం. వర్తమానానికే కాదు, భవిష్యత్తు సమాజానికీ కూడా ముప్పే.

సమాజం గాడి తప్పుతున్నది

చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు అందరూ చూసేందుకు అలవాటు పడిపోయి, అక్షరాలు రాయడానికీ, చదవడానికీ కూడా ఇమేజ్‌లనే వాడే సంస్కృతిని మనం చూస్తున్నాం. ఈ చూడడం అనే ప్రక్రియలో అంతా సరిగ్గానే ఉందా? చూస్తూ ఉన్నవారి మీద ఈ ఇమేజెస్, మూవింగ్ ఇమేజెస్‌కు సంబంధించిన ప్రభావాలు ఎలా వుంటున్నాయి? వాటి ప్రతి ఫలాలు సమాజం పైన ఎట్లా ఉంటున్నాయి? అనే అవగాహన కొరవడడం విచారకరం.

దృశ్య సంస్కృతికి, దృశ్య సాక్షారతకు సంబంధించిన కనీస పరిజ్ఞానం లేకపోవడంతో టీవీలూ, ఇంటర్నెట్లూ నట్టింటిలో కుమ్మరిస్తున్న చెత్తనంతా చూస్తూ సమాజం గాడి తప్పింది. కనీస విలువలు లేని ఒక విష సంస్కృతికి అలవాటు పడిపోతున్నారు. చూస్తున్న దానిలో మంచేదో, చెడేదో గుర్తించలేకపోతున్నారు. భావి సమాజానికి ప్రతినిధులుగా ఉండాల్సిన విద్యార్థులకు విజువల్ లిటరసి కి సంబంధించిన మౌలిక విషయాలేమయినా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రభుత్వాలూ, మేధావులూ, విద్యావేత్తలూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు డిజిటల్ తరగతి గదులూ, స్కిల్ డెవలప్‌మెంట్ అంటూవుంటే, ప్రైవేటు విద్యాసంస్థలు ఈ స్కూల్స్, డీజీ స్కూల్స్ అంటూ విద్యను వ్యాపారం చేసేశాయి.

ఒరవడిలో కొట్టుకుపోతున్నారు

నిజానికి 'ఒక బొమ్మ వేయి పదాలకు సమానం' ఇక వీడియో లేదా సినిమానయితే ఎన్నో భావాలను నేరుగా ప్రేక్షకుని మనసులోకి తీసుకెళ్తుంది. అంతగా ప్రభావం చూపించగల విజువల్ మాధ్యమం గురించి సమాజం కనీసం ఆలోచన చేస్తున్నదా? అంటే జవాబు నిరాశాజనకంగానే వుంది. అసలు మంచి విజువల్ ఏదో చెడు విజువల్ ఏదో, మంచి సినిమాను లేదా మంచి వీడియోను ఎట్లా అర్థం చేసుకోవాలో నేర్పించే వ్యవస్థను నిర్మించుకోలేక పోవడం విషాదం. ఆ స్థితిలో అర్థం లేని చెత్త దృశ్యాలను చూస్తూ పిల్లలు పాడయిపోతున్నారని బాధ పడడంలో అర్థం లేదు. విజువల్ లిటరసి అందించలేనపుడు పిల్లలే కాదు పెద్దలు కూడా విలువలు లేని బొమ్మలకూ, సినిమాలకూ వీడియోలకూ అలవాటు పడిపోతారు.

అందుకు వాళ్లని కాకుండా పాలకులనూ, ప్రణాళికా నిర్మాతలనూ, మేధావులనూ నిందించాల్సి ఉంటుంది. నిజానికి వర్తమాన సమాజం ప్రసార మాధ్యమాల ప్రభావంలో పడి కొట్టుకుపోతున్నది. ఇమేజ్ చట్రంలో కూరుకుపోతున్నది. ఇటీవల జరిపిన ఒక సర్వేలో వర్తమాన తరం అత్యధిక ఫొటోలు దిగిన తరంగా తేలింది. విద్యార్థులు రోజుకు ఏడు గంటలకు పైగా బొమ్మలో, వీడియో లో చూస్తున్నట్టుగా తేలింది. 1991లో మొదటిసారిగా అందుబాటులోకి వచ్చిన వరల్డ్ వైడ్ వెబ్ (www ) ఒక సాలీడు లాగా మానవాళిని కప్పేసింది. దీనితో సమాచార వ్యాప్తికి, జ్ఞాన విస్తృతికీ అమితమయిన ఉపయోగం కలిగింది. కానీ, దృశ్య సాక్షారత (VISUAL EDUCATION) లేక పోవడం వలన అందరూ ఆ ప్రవాహంలో కొట్టుకు పోతున్నారు.

చిరుదీపాన్ని వెలిగించాలి

ఈ స్థితి నుంచి బయట పడాలనుకుంటే పాఠశాల స్థాయి నుంచే విజువల్స్‌కు సంబందించి కార్యక్రమాలను రూపొందించాలి. దాదాపు అన్ని పాఠశాలలు, కళాశాలలలో వీడియో ప్రదర్శనలకు సరిపడా సాంకేతిక వసతులు ఉన్నాయి. వాటితో మంచి చెడుల నడుమ తేడాని అర్థం చేసే విధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. మానవీయ విలువల ప్రోత్సాహం కోసం సాహిత్యంతో పాటు అర్థవంతమయిన దృశ్య మాధ్యమాన్ని పరిచయం చేసే కృషి కొనసాగాలి.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యా విషయక అవసరాలతో పాటు బాలల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఇరాన్ సినిమాలలాంటివి చూపించాలి.

చిన్న సినిమాలను ప్రదర్శించి వాటిని విద్యార్థులు view and review పేర విశ్లేషించేలా చూడాలి. అపుడే చిన్న తనం నుండే విలువలు, సృజన రెండూ అలవడుతాయి. మానవీయ విలువలను ప్రోత్సహించడం ద్వారా ఉత్తమ లక్షణాలను ప్రోది చేయవచ్చు. 'చీకటిని నిందిస్తూ కూర్చోవడం కన్నా చిరు దీపాన్ని వెలిగించడం' మంచిది. నేనే ఒక కవితలో ఇలా రాసుకున్నాను 'చీకటికి ఉనికి లేదు, వెలుతురు క్షీణించడమే చీకటి' అందుకే చిన్న వయసులోనే వెలుగులు నింపే ప్రయత్నం జరగాలి. విజువల్ లిటరసీని పెంపొందించాలి. పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసులను అమలు చేయాలి.

వారాల ఆనంద్

94405 01281

Tags:    

Similar News