ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలూ వచ్చేశాయి. మరికొన్ని గంటలలో ఓట్ల లెక్కింపుతో క్లారిటీ రానున్నది. అన్ని పార్టీలూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇక్కడి ఫలితం జాతీయ రాజకీయాలలో ఎలాంటి మార్పునకు దారితీస్తుందనే చర్చలూ మొదలయ్యాయి. మరో రెండేళ్లలో జరిగే పార్లమెంటు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు సరేసరి. యూపీ ఓటర్ల తీర్పు ఆ రాష్ట్రానికి సంబంధించినదే. కానీ, దీని ప్రభావం దేశ రాజకీయాలపై పడనున్నది. అసెంబ్లీ ఫలితాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడకపోవచ్చనే వాదన ఎలా ఉన్నా మోడీ, బీజేపీ భవిష్యత్తును మాత్రం ప్రభావితం చేయనున్నదనేది నిర్వివాదాంశం. గతంలో బీజేపీ పలు రాష్ట్రాలలో ఓడిపోయినా 2019 పార్లమెంటు ఎన్నికలలో ఊహించని మెజారిటీతో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నది. బీజేపీకి వ్యతిరేకంగా జట్టుకట్టాలనుకుంటున్న ప్రాంతీయ పార్టీల భవిష్యత్తును యూపీ ఫలితం డిసైడ్ చేయనున్నది. అదే టైమ్‌లో బీజేపీలోనూ సంస్థాగతమైన మార్పులకు దారితీయనున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా బీజేపీ గెలిస్తే ఆ క్రెడిట్ ఎవరికి? మోడీకా? లేక యోగి కా? ఒకవేళ అంచనాలు తారుమారై బీజేపీ ఓడితే దానికి ఎవరు జవాబుదారీ? బీజేపీ గెలిచినట్లయితే మరింతగా బలపడేది మోడీ యా? లేక యోగి యా? ఢిల్లీ రాజకీయాలు వయా యూపీ అని ఇప్పటికే బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో యూపీ రిజల్టు యోగి మరింతగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోడానికి దారితీస్తుందా?
యూపీ గెలుపు బీజేపీకి అవసరం
మోడీ తర్వాత సెకండ్ ప్లేస్‌లో అమిత్ షా అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయింది. యూపీలో బీజేపీ గెలిచి యోగి మరోసారి సీఎం అయితే జాతీయ నాయకత్వంలో ఆయనకు కీలక స్థానం ఖాయమనే వాదనలూ తెరపైకి వస్తున్నాయి. మోడీ 75 ఏళ్ల వయసు పూర్తికాగానే ఆయన స్థానాన్ని యోగి భర్తీ చేసే అవకాశాలూ లేకపోలేదన్న చర్చలూ ఉన్నాయి. యూపీలో బీజేపీ గెలవడం ఆ పార్టీకి చాలా అవసరం. ఇప్పటికీ మోడీ-యోగి పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారనే సందేశాన్ని మరింత బలంగా తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుంది. పార్లమెంటు ఎన్నికలలో దీన్నే ప్రధానంగా ప్రస్తావించి స్థానాన్ని సుస్థిరం చేసుకోడానికి బీజేపీ వాడుకుంటుంది. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో అధికారానికి దూరమైంది. ఇప్పుడు యూపీలోనూ అది రిపీట్ అయతే పార్టీ ఇమేజ్‌తో పాటు మోడీ వైఫల్యాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలవుతాయి. అందుకే యూపీలో గెలవడం ఆ పార్టీకి కీలకం. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినా సీట్ల సంఖ్య కూడా ప్రధానం. పార్లమెంటు ఉభయ సభలలో మరే రాష్ట్రం కంటే ఎక్కువ సీట్లు యూపీ నుంచే ఉన్నాయి. త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలను మళ్లీ గెల్చుకుని బీజేపీ ఖాతాలో వేయాలంటే అసెంబ్లీలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెల్చుకోవడం అనివార్యం. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికలలోనూ ఎమ్మెల్యేల, రాజ్యసభ ఎంపీల బలం ఆ పార్టీ నిలబెట్టే అభ్యర్థిని గెలిపించుకోడానికి అవసరం. అందుకే యూపీలో గెలుపు బీజేపీకి 'ఇజ్జత్ కా సవాల్' గెలవడం ద్వారా మోడీ అనుసరిస్తున్న విధానాలకు ప్రజలు పట్టం కట్టారనే మెసేజ్‌ని జనంలోకి పంపడానికి ఉపయోగపడుతుంది. లేదంటే మోడీ, యోగి విధానాలతోనే యూపీలో బీజేపీ ఓడిపోయిందనే నింద అన్ని రాష్ట్రాలకూ వ్యాపించి భవిష్యత్తులో ఒక పార్టీగా బీజేపీ తన ప్రాభవాన్ని కోల్పోతుంది.
ప్రత్యామ్నాయ కూటమి సంగతేంటి?
మోడీ-అమిత్ షా సాన్నిహిత్యం పార్టీని డామినేట్ చేస్తున్నదనే అపవాదు పార్టీలో ఉండనే ఉన్నది. అంతేస్థాయిలో అసంతృప్తీ ఉన్నది. యూపీలో ఓడినట్లయితే పార్టీలో అంతర్గత విభేదాలు ఊహకు అందని విధంగా భగ్గుమనే అవకాశాలున్నాయి. ఆర్ఎస్ఎస్ సైతం వీరిద్దరి ప్రభావం పార్టీ ఫంక్షనింగ్‌ను ఇబ్బంది పెడుతుందనే అభిప్రాయంతో ఉన్నది. నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, డీజిల్- పెట్రోలు రేట్ల నియంత్రణలో వైఫల్యం, ఇలాంటివన్నీ ఒక్కసారిగా తెరపైకి వస్తాయి. పార్టీలోనే కాక వివిధ రాష్ట్రాలలో రాజకీయ మార్పులకు కారణమవుతాయి. బీజేపీకి వ్యతిరేకంగా అనేక ప్రాంతీయ పార్టీలు జట్టు కట్టాలనుకుంటున్నాయి. ఒకవైపు మమతా బెనర్జీ, మరోవైపు కేసీఆర్ వేర్వేరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఇంకా ఒక షేప్ తీసుకోకపోయినప్పటికీ ప్రయత్నాలు ముమ్మరంగానే జరుగుతున్నాయి. మమతా బెనర్జీని యాంటీ-మోడీ ఫేస్‌గా గుర్తించిన సమాజ్‌వాదీ పార్టీ ఆమె సహకారాన్ని యూపీ ఎన్నికలలో వాడుకున్నది. స్వయంగా యూపీ ఎన్నికల ప్రచారంలో అఖిలేష్‌కు మద్దతుగా ఆమె ప్రచారం చేశారు. కేసీఆర్ మద్దతు పలికినా ప్రచారంలోకి దూకలేదు. యాంటీ బీజేపీ, యాంటీ మోడీ అనే నినాదంతో ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టారు. చివరకు అది యాంటీ బీజేపీ ఫ్రంట్ కాదని, జాతీయ రాజకీయాలలో ప్రత్యామ్నాయం కోసం జరుగుతున్న ప్రయత్నాలంటూ సవరించారు.
కేసీఆర్ వ్యూహం ఎలా ఉండబోతుంది?
యూపీలో బీజేపీ ఓడి సమాజ్‌వాదీ పార్టీ గెలిస్తే ప్రాంతీయ పార్టీలకు ఒకింత బలం చేకూరుతుంది. బీజేపీ ప్రభావం, మోడీ ఇమేజ్ తగ్గిపోయిందనే నినాదాన్ని ప్రజలలోకి బలంగా తీసుకెళ్లడానికి వీలు చిక్కుతుంది. యూపీ నుంచే యాంటీ బీజేపీ ఫ్రంట్ పాలిటిక్స్ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్‌ను కలుపుకుపోవడమా లేక ఆ పార్టీయే అనివార్యంగా కలుస్తుందా? అనేదీ తేలిపోతుంది. మోడీ విధానాలను తూర్పార పట్టడానికి యూపీలో బీజేపీ ఓటమి ప్రాంతీయ పార్టీలకు ఒక అస్త్రంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే బీజేపీ గెలిస్తే ప్రత్యామ్నాయ ఫ్రంట్ పాలిటిక్స్ వెనకపట్టు పట్టక తప్పదు. ఒక పార్టీగా బీజేపీని, ప్రధానిగా మోడీని అవకాశం దొరికిన ప్రతీసారి విమర్శిస్తున్న కేసీఆర్ యూపీ పోలింగ్ సరళిని నిశితంగా గమనించారు. ఒకవేళ గెలిచినా గతంలో వచ్చినన్ని సీట్లు రావని, ప్రాభవం కోల్పోతుందని వ్యాఖ్యానించారు. యాంటీ బీజేపీ వైఖరితో ఉన్న పార్టీలన్నింటినీ ఏకం చేసే టాస్క్ తీసుకున్నారు. యూపీఏ భాగస్వాములుగా ఉన్న పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కలిసొచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోతామన్నారు. ఇప్పుడు యూపీలో బీజేపీ గెలిస్తే కేసీఆర్ తన ప్రత్యామ్నాయ ఫ్రంట్ విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరం. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టినందున యూపీ రిజల్టు కేసీఆర్ ప్రయత్నాలను ఏ వైపు తిప్పుతుందోననే చర్చలు ఇప్పటికే మొదలయ్యాయి.
తేలనున్న భవిష్యత్
గతంలో యాంటీ బీజేపీ వైఖరితో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తెచ్చారు. 2019లో భారీ మెజారిటీతో గెలవడంతో ఆ అంశాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు యూపీ రిజల్టు తర్వాత అలాంటి పరిస్థితి రిపీట్ అవుతుందా? లేక ప్రయత్నాలను కొనసాగిస్తారా అనేది కీలకం. మరికొన్ని గంటల తర్వాత వెలువడే యూపీ ఫలితం అటు బీజేపీ, ఇటు దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీల భవిష్యత్తు వ్యూహాన్ని డిసైడ్ చేస్తుంది. పవర్‌పుల్ స్థానంలో ఉన్న మోడీని సమీప భవిష్యత్తులో యోగి రీప్లేస్ చేస్తారా? బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీకి అవకాశం లేదనే పరిస్థితి ఉత్పన్నమవుతుందా? లేక ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు అనేది ఉనికిలోకి వచ్చి ఫ్రంట్ పాలిటిక్స్ మళ్లీ ఊపందుకుంటాయా? ఇవన్నీ తేలిపోనున్నాయి.
ఎన్. విశ్వనాథ్
99714 82403