ఆగమైన నిరుద్యోగి!

నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ

Update: 2023-10-13 01:00 GMT

నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నేటికీ అరకొర మాత్రమే ఉద్యోగ నియామకాలు జరిగాయి. కొన్నింటికి నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు కేసుల వలన నియామకాలు లేట్ అవుతున్నాయి. ఇటీవల టీఎస్‌పీఎస్సీలో పనిచేసే కొందరి వ్యక్తుల వలన కొన్ని పేపర్లు లీక్‌ కావడంతో పరీక్షలు రద్దయ్యాయి. ఇలా ఉద్యోగ నియామకాలు వివిధ కారణాల వలన లేటవుతుండటంతో సగటు నిరుద్యోగి ఎంతగానో మనోవేదనకు గురవుతున్నాడు.

ఎన్నిసార్లు ఈ వాయిదాలు..

నిజానికి ఒక నిరుద్యోగిని ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు, ఎన్నో ఉద్విగ్నతలు సవాలక్ష ఉద్వేగాలు వెంటాడుతుంటాయి. గుండె బరువుతో ఉన్న నిరుద్యోగి వేదనకు ఎవరు సమాధానం చెప్పాలి? వారి బాధను చూసి వెక్కిరించేవారికి ఏం సమాధానం చెప్పాలి? రాష్ట్రం ఏర్పడ్డాకా, తొలిసారి పెద్దఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఆర్థిక స్థోమత లేకపోయినా అప్పులు తెచ్చుకొని పట్నం వచ్చి అర్థాకలితో, నిద్రలేమితో కష్టపడి చదువుకుంటున్న వారికి పేపర్ల లీక్ పిడుగుపాటులో తగిలింది. టీఎస్‌పీఎస్‌సి కమిషన్‌లో పనిచేసే కొందరి ఇంటి దొంగల మూలాన కొన్ని పేపర్లు రద్దయ్యాయి. లీక్ చేసిన వారే డబ్బు విషయంలో తేడా వచ్చి వారిలోని ఒకరు స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసేదాకా ఇంత పెద్ద మోసం బయటకు రాలేకపోవడం విడ్డూరం. అంటే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంత లోపభూయిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లీకేజీల ఉదంతం బయటకి రాగానే చాలామంది ప్రైవేటు ఉద్యోగాలు సైతం పక్కనపెట్టి చదివేందుకు వచ్చిన వారు అర్ధాంతరంగా ప్రిపరేషన్ ఆపేశారు. చాలావరకు హాస్టల్స్, లైబ్రరీలు కూడా ఖాళీ అయ్యాయి. పైగా ఇటీవల రద్దయిన గ్రూప్-1 పరీక్ష రెండవసారి నిర్వహించగా, ఆ సమయంలో కోటీ రూపాయల డబ్బు ఆదా చేద్దామని బయోమెట్రిక్ నిర్వహించలేదు. దీంతో పరీక్షల్లో పలు అవకతవకలు జరిగాయంటూ, తద్వారా పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ల కన్నా, ఎక్కువ ఓఎంఆర్‌లు వచ్చాయని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా రెండవసారి పరీక్షను రద్దు చేసింది కోర్టు. గ్రూప్-2 సైతం ఇప్పటివరకు రెండుసార్లు వాయిదా పడింది. మొదటిసారి సిలబస్ పెరిగిందనే కారణంతో ఉద్యోగార్థులు ఆందోళన చేయడంతో పరీక్షను వాయిదా వేసింది. మొన్న ఈ మధ్య ఎన్నికల కోడ్‌ని దృష్టిలో ఉంచుకొని రెండవసారి కూడా గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయడంతో ఉద్యోగాలకు మరికొన్ని రోజులు వేచి ఉండక తప్పడం లేదు. దీంతో వారిపై ఇంకా ఆర్థిక భారం పడుతుంది.

టీఎస్‌పీఎస్సీని విశ్వసించేది ఎలా?

టీఎస్‌పీఎస్సీ బోర్డే కాకుండా, తెలంగాణలో నిర్వహించిన పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియ ఆద్యంతం వివాదాలతోనే కూడుకున్నది. ఈ నోటిఫికేషన్‌లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివాదం మొదలుకొని తప్పు ప్రశ్నలు, దేహదారుఢ్య పరీక్షల్లో ఏ రాష్ట్రాల్లో లేనటువంటి కఠిన నియమ నిబంధనలు, జీవో నంబర్ 46,57,58, మెయిన్స్ పరీక్షల్లో తప్పుడు ప్రశ్నలు వంటి పలు వివాదాలపై కోర్టును ఆశ్రయిస్తే కొన్నింటిని కోర్టు ఆదేశించాక అమలు చేసింది కోర్టు, ఇటీవల కానిస్టేబుల్ ఫైనల్ సెలక్షన్ జాబితా విడుదలైనప్పటికీ కోర్టు నాలుగు మార్కులని పరిగణలోకి తీసుకోని తుది జాబితా విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో తీవ్రగందరగోళం ఏర్పడింది. ఎంతో మంది మేధావులు ఉన్న బోర్డులో ఈ విధంగా తప్పులు చేయడం సరికాదు. దీనివల్ల ఎంతోమంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. ఇన్ని తప్పులు జరిగినా వీటికి బాధ్యత తీసుకునేవారు ఏ ఒక్కరూ లేరు. ఒక్క సగటు నిరుద్యోగికి ధైర్యం చెప్పేవారు లేరు. భవిష్యత్తులో టీఎస్‌పీఎస్సీని విశ్వసించేది ఎలా? టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని ఎంతోమంది అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. కానీ దీనిని పట్టించుకోవట్లేదు. ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు బాధ్యతగా తీసుకోవడం లేదు? కేవలం ఒక్కరు ఇద్దరి తప్పుల వల్ల జరిగిందని చెప్పేవారు, ఆ తప్పు జరగడానికి అవకాశం ఎందుకు వచ్చిందంటే మాత్రం సమాధానం చెప్పరు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసే శాఖలోని ఉద్యోగ ఖాళీలు దర్శనమిస్తున్నాయి. ఇంకా ఉద్యోగాల కోసం నిరుద్యోగుల ఎక్కువ కాలం వేచి ఉండడం వల్ల వారిపై ఎక్కువ ఆర్థిక భారం పడుతుంది. అందుకే ప్రభుత్వం ఇంతకుముందు నిర్వహించినటువంటి గ్రూప్-1 ఉద్యోగాలలో ప్రిలిమినరీ పరీక్షలలో ఎవరైతే అర్హత సాధించారో వారి జాబితాను సిద్ధం చేసి గ్రూప్-1 పూర్తి ప్రక్రియ అయిపోయేంతవరకు నెలకి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలి. దీనివల్ల వారికి కొంత స్వాంతన చేకూర్చినట్టు అవుతుంది.

బలవుతున్నది నిరుద్యోగే!

నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటాడుకుంటుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆరే అసెంబ్లీలో 80 వేల ఖాళీల ప్రకటన చేసేటప్పుడు, పలు విభాగాల్లో టీచర్ పోస్టులు 13,086 ఖాళీలుగా ఉన్నట్టు ప్రకటించారు. కానీ ప్రస్తుతం టీచర్ నోటిఫికేషన్ కేవలం 5,089 పోస్టులు మాత్రమే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఏళ్ల తరబడి టీచర్ పోస్టులకు సన్నద్ధమవుతున్నటువంటి నిరుద్యోగులు తీవ్రమైన నిరాశకు లోనయ్యారు. ఒక్కొక్క జిల్లాలో పట్టుమని పది పోస్టులు కూడా లేకపోవడం, గతంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ఐదు శాతం పోస్టులు ఓపెన్ కేటగిరిలో పెట్టుకపోవడంతో మరిన్ని పోస్టులు తగ్గినట్టు అయ్యాయి. పైగా ఈ నోటిఫికేషన్ హడావుడిగా విడుదల చేసి, ఎక్కువ సిలబస్‌ను పెట్టి కేవలం రెండు నెలలలో తుది పరీక్ష నిర్వహించనున్నారు. దీనిపై కూడా అభ్యర్థులు ఆందోళన చేయగా నేటికి ప్రభుత్వం తరఫున సమాధానం లేదు.

ఇదంతా ఒక వైపైతే మరోవైపు భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాగానే నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని పలు కోచింగ్ సెంటర్ వాళ్ళు ఫీజులు భారీగా దండుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా ఇవి వీధి వీధినా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇలా అర్హత లేని కోచింగ్ సెంటర్లలో చేరడం వల్ల అభ్యర్థులు సమయం, డబ్బులు వృధా చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి అరకొరా మాత్రమే ఉన్నాయి. ఇక పుస్తకాలు ముద్రించే పబ్లికేషన్స్ అయితే వీధివీధిన వందల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. కొందరు ఎటువంటి అర్హతలు లేని వారు సైతం పుస్తకాలు రాసి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇవి చాలవన్నట్టు ప్రైవేట్ హాస్టల్లు, స్టడీహాళ్ళ యాజమాన్యాలు సైతం అభ్యర్థుల నుండి అందిన కాడికి దండుకుంటున్నాయి. విధి ఆడుతున్న వికృత నాటకంలో బలి అవుతుంది ఒక నిరుద్యోగి మాత్రమే! కోట్లాది కలలతో ఎన్నో ఆశలతో పుస్తకాలు చేతబట్టినటువంటి ఏ నిరుద్యోగిని కదిలించినా కన్నీటి గాధలే.

నేరడిగొండ సచిన్,

ఉస్మానియా యూనివర్సిటీ

87907 47628

Tags:    

Similar News