మారని జగన్! మాయని గర్వం

అసెంబ్లీ ఎన్నికలల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత కూడా తత్వం బోధపడని వైఎస్ జగన్.. తనకి తాను నిజాయతీపరుడిగా, సత్యహరిశ్చంద్రుడి వారసుడిలాగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

Update: 2024-07-08 23:13 GMT

అసెంబ్లీ ఎన్నికలల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత కూడా తత్వం బోధపడని వైఎస్ జగన్.. తనకి తాను నిజాయతీపరుడిగా, సత్యహరిశ్చంద్రుడి వారసుడిలాగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తానెందుకు ఓడిపోయానో అర్ధంకావడం లేదని వాపోతున్నారు. ఏమాత్రం ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ప్రజలపై నిందలు మోపుతున్నారు. చంద్రబాబులా అబద్దాలు చెబితే మరో పదిశాతం ఓట్లు వచ్చేవి, మనమే అధికారంలోకి వచ్చేవారమని చెప్పుకొచ్చారు. అధికారం కోసం అబద్దాలు చెప్పడం సరికాదని, అబద్దాలు చెప్పక, వాస్తవాలు మాట్లాడటం వల్లే తాను ఓటమి చెందినట్లుగా చెబుతున్నారు.

2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అబద్దాలు చెప్పని రోజంటూ లేదు. ఆయన చెప్పినవన్నీ అబద్దాలు, అసత్యాలు, అర్ధసత్యాలే. మద్య నిషేధం అమలుచేస్తేనే ఓట్లు అడుగుతానని చెప్పి, అమలు చేయకుండా ఓట్లడగడంతో ఓటర్లు చాచి కొట్టారు. ప్రత్యేక హోదా, సీపీఎస్, పోలవరం, అమరావతి వంటి విషయాల్లో మాటతప్పి, మడమతిప్పి సిగ్గూ, ఎగ్గూ లేకుండా 98శాతం అమలుచేశానని ఇప్పటికీ జబ్బలు చరుచుకుంటున్నారు. రాష్ట్రాభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఒక్క పరిశ్రమ రాకపోగా.. ఉన్న పరిశ్రమలను పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారు. ఏటా జాబ్ కేలండర్ విడుదల చేస్తానని మాటతప్పారు. దీంతో నిరుద్యోగం పెరిగింది. ఉద్యోగ, ఉపాధి కోసం యువత పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లారు.

ఈవీఎంలే ఓటమికి కారణమట..!

ఎన్నికలు ముగిసి నెల రోజులు కాలేదు, కొన్ని రోజుల క్రితమే సభలో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు, అప్పుడే ఎదురుదాడి మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా తీసుకురాలేదని చెబుతూ శిశుపాలుడు వంద తప్పుల్లో ఒక తప్పు జరిగి పోయిందని చెప్పడం జగన్ రెడ్డి ఉక్రోషానికి అద్దం పడుతోంది. నిన్నటిదాకా వై నాట్ 175 అని, ఇప్పుడు కాస్త కనికరిస్తూ జాలిపడి 2029 నాటికి తెలుగుదేశానికి సింగిల్ డిజిట్ వస్తాయని ఉత్తరకుమార ప్రగల్బాలు పలుకుతున్నారు. ఏపీలో రాబోయే ఎన్నికల పలితాలు చూసి దేశం నివ్వెరపోతుందని జగన్ రెడ్డి చెబుతుంటే.. ఆ పార్టీ శ్రేణులు కూడా నవ్వుకున్నారు. కానీ వచ్చిన ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. గెలుపుపై భారీ అంచనాలు పెంచుకున్నారు. ఎమ్మెల్యేలపై బాగా వ్యతిరేకత ఉంది, తనపై ఏదో సానుకూలత ఉన్నట్లు, తననేదో ప్రజలు బాగా ఆరాధిస్తున్నట్లు భ్రమల్లో విహరించారు. ఈవీఎంలపైనా, ప్రజలపైనా తప్పును నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 164 స్థానాల్లో ఓడిపోతే అందుకు జగన్ రెడ్డీ బాధ్యత వహించాలి కదా?

నొక్కుడు తక్కువ.. బొక్కుడు ఎక్కువ

ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజల్లో ఏమాత్రం అతనిపట్ల సానుభూతి కనిపించలేదు. రుషికొండ, పార్టీ కార్యాలయాల నిర్మాణ శైలి చూసిన తర్వాత 11 సీట్లు కూడా ఎందుకు గెలిపించామని ప్రజలు భావిస్తున్నారు. ఈ ఐదేళ్లు కళ్లు మూసుకోండి.. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామని కేఏ పాల్ ను మించిన హాస్యాన్ని పండిస్తున్నారు. జగన్ రెడ్డిలో ఎలాంటి మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు. కనీసం ఓటమిపై ఎలాంటి సమీక్షలు లేవు. ఆయన రోదనలు, వేదనలు హావభావాలు చూస్తుంటే జాలేస్తోంది. రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ ద్వారా తను కష్టపడి సంపాదించిన సొమ్మును అక్కచెల్లెళ్లలకు, అవ్వాతాతలకు పంచినట్లుగా తెగ బాధపడ్డారు. అక్కచెల్లెమ్మల ప్రేమలు, అవ్వాతాతల అప్యాయతలు ఏమయ్యాయని రోదిస్తున్నారు. ఇన్నిసార్లు బటన్ నొక్కినా కానీ ప్రజలు తననెందుకు మోసం చేశారని పదేపదే వాపోతున్నారు. రాష్ట్రంలో జరిగింది పాలన కాదు పీడన. మేం పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును తిరిగి మాకే చెల్లించారు. సిద్ధం సిద్ధం అంటూ మాపై యుద్ధం చేశారని ప్రజలు భావించారు. బటన్ నొక్కుడు కంటే బొక్కుడు ఎక్కువైందని ఆలస్యంగా గ్రహించారు.

కోడికత్తి నుంచి గులకరాయి దాకా...

ఓటమిపై ఇప్పటికీ సరైన విశ్లేషణ కానీ, వైసీపీ నేతల నుంచి అభిప్రాయాలు తెలుసుకోకుండా పదేపదే ఆత్మస్థుతి, పరనిందకు పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి చేయని దుర్మార్గం లేదు. ప్రజాసమస్యలను పరిష్కరించకుండా ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. అక్రమ కేసులతో వేధించారు. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తమ విధులను, బాధ్యతలను మర్చిపోయి అజ్ఞానంతో, అహంకారంతో ప్రజలపై స్వారీ చేశారు. దోచుకో దాచుకో అనే నినాదంతో ముందుకు వెళ్లారు. జగన్ రెడ్డి ఐ ప్యాక్ సర్వేలనే పూర్తిగా నమ్మారు. దీని ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మార్చారు. అయినా ప్రజల నమ్మకాన్ని సాధించలేకపోయారు. గత ఎన్నికల్లో వైఎస్ వివేకా హత్యను, కోడికత్తి లాంటి డ్రామాలను సానుభూతి కోసం వాడుకున్నారు. ఈ ఎన్నికల్లో కూడా గులకరాయి డ్రామా ఆడారు. అయినా ప్రజలు విశ్వసించలేదు. సొంత తల్లికి, చెల్లికే న్యాయం చేయని వ్యక్తి ప్రజలకేం న్యాయం చేస్తారని ఓటర్లు భావించారు.

తప్పులను అంగీకరించని అహంకారి

అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడి కార్యక్రమానికి అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష నేతలు కూడా హాజరై సభాపతి స్థానంలో కూర్చోబెట్టడం ఆనవాయితీ. జగన్ రెడ్డి కనీసం ఆ సభా సాంప్రదాయాలను కూడా మంటగలుపుతూ సభాపతి ఎన్నికకు గైర్హాజరయ్యారు. పులివెందుల పర్యటనలోనూ సొంత పార్టీ నేతల నుంచి జగన్ రెడ్డికి నిరసన వ్యక్తమైంది. ప్రజల విశ్వాసం కోల్పోయినప్పుడు ఆత్మపరిశీలన చేసుకుని జరిగిన పొరపాట్లను చక్కదిద్దుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏవో తప్పులు చేస్తారు, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఎదురుచూస్తూ కూర్చోవడం వివేకవంతుల లక్షణం కాదు. పార్టీ యంత్రాంగానికి లేనిపోని ఆశలు కల్పించి వారిని ఆ భ్రమల్లోనే ఉంచాలనుకోవడం సహేతుకం కాదు. ప్రజా సమస్యలపై పోరాడి వాటి పరిష్కారం కోసం పాలకపక్షంపై ఒత్తిడి తీసుకురావాలి. తద్వారా ప్రజల మన్ననలు పొందాలి. ముందుగా తాను చేసిన తప్పులను, వైఫల్యాలను హుందాగా అంగీకరించాలి. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ జగన్ రెడ్డి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే కనీసం ప్రతిపక్ష నేతగా, పార్టీగా ప్రజలు గుర్తిస్తారు.

మన్నవ సుబ్బారావు

99497 77727


Similar News