దళితులని ‘కుర్చీ’కాడికి తీసుకెళితే చాలా?
Udhayanidhi Stalin’s 'Maamannan' Controversy Over Caste Politics
'మామన్నన్' (నాయకుడు) తమిళ సినిమాకు హృదయం పారేసుకున్న వాళ్లను కొంతమందిని గుచ్చి గుచ్చి అడిగితే అందులో సింబాలిజాలు ఆకట్టుకున్నాయని చెప్పారు. దళితుల మీద జరిగే అకృత్యాల చిత్రీకరణ, దళిత ప్రజా ప్రతినిధుల పట్ల ఆయా పార్టీల వైఖరుల వాస్తవ చిత్రీకరణలు ఈ సినిమాను దళిత సినిమాగా చూపించటానికి వనరులుగా ఉన్నాయి. సినిమా హీరో ఉదయనిధి స్టాలిన్‌ను పందుల పెంపకం దృశ్యంతో పరిచయం చేయటంతో ఈ సినిమా మారి సెల్వరాజ్ తరహా సినిమాగా భావించటానికి దోహదం చేసింది.
ఒక్క చేత్తో కొట్టి పడేసే హీరోయిజం
అయితే పందులు, కుక్కలు, గుర్రాలు, కుర్చీ లాంటి ప్రతీకలను డా. అంబేద్కర్ గొంతును, పెరియార్ ఫోటోను దర్శకుడు మారి సెల్వరాజ్ వాడుకొన్నప్పటికి అవి అతని గత సినిమాల్లో (పెరియారుం పెరుమాళ్, కర్ణ) చూపినంత ప్రభావాన్ని చూపటంలో విఫలం అయ్యాయి. పెరియారుం పెరుమాళ్‌లో కథానాయకుడిలో కుల వివక్ష అనుభవంతో కనిపించిన తీవ్ర ఘర్షణ, కర్ణన్‌లో సూచించిన క్రియాశీలత ఈ సినిమాలో లోపించింది. సినిమా ఓపెనింగ్ పందుల పెంపకంతో మొదలైనా, పదుల కొద్దీ మనుషులను ఒక్క చేత్తో కొట్టి పడేసే దృశ్యాలు ఈ సినిమా కథ వాస్తవికతను దెబ్బ తీసాయి. విజ్ఞులైన ప్రేక్షకులు కూడా ఆ మొదటి సీనుకే మనసును అర్పించి, తార్కికత కోల్పోయి, భావోద్వేగ ఒరవడిలో కొట్టుకొని పోయి సినిమాలోని అసంబద్ధతలనూ, సినిమాకున్న రాజకీయ ఉద్దేశాన్ని గుర్తించలేకపోతారు.
నిజానికి పందుల పెంపకపు కుటుంబాన్ని కేంద్రంగా తీసుకొని తీసిన ‘ఫాండ్రి’,‘పార్’ సినిమాలు -పందిని భారతీయ సినిమాకు కథా వస్తువుగా ఎప్పుడో పరిచయం చేశాయి. ఆ సినిమాలకు ఈ సినిమాకు తేడా క్రీడా శాఖల మంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాజకీయ వారసుడు పందులను ఇంటి దగ్గర (ఉపాధి కోసం కాదు) పెంచుకోవటంలోనే ఉంది. సినీ నటుల సినిమా వారసత్వానికి, రాజకీయ నాయకుల రాజకీయ వారసత్వానికి అలవాటు పడిన భారతీయులకు రాజకీయ నాయకుల సినిమా ప్రవేశం కూడా నచ్చినట్లుంది.
పందికి, కథానాయకుడికి ఉన్న సంబంధాన్ని చెప్పే బలమైన ఘటన ఒక్కటి కూడా ఈ సినిమాలో ఉండదు. ‘పందిని ఎందుకు టాటు’గా వేసుకున్నావు? అన్న హీరోయిన్ ప్రశ్నకు ‘ఏమో తెలియదు’ అనే హీరో సమాధానం లాగే ఈ సంబంధం గందరగోళంగా అనిపిస్తుంది.
సమస్యలకు ఉత్తుత్తి పరిష్కారాలా?
దళితుల మీద జరుగుతున్న అత్యాచారాలను ఉన్నదున్నట్లుగా పవర్‌ఫుల్‌గా తీస్తే కళ్ల నీళ్లు కారతాయి. కానీ దళితుల ఆ పరిస్థితుల నుండి మొదలు పెట్టి, వాళ్లను ఎక్కడకు ఈ సినిమా తీసుకొని వెళ్లిందనేది ముఖ్యం. సినిమా క్లైమాక్స్ చూశాక, బాలుర మీద జరిగిన దారుణాన్ని కమర్షియల్ సరుకుగా వాడుకున్నట్లు అర్థం అవుతోంది. ఈ ధోరణి కొద్దికాలంగా మొదలైయ్యింది. కుల వివక్షతను బ్రాహ్మణ కథానాయకుడి కళ్లద్దాల నుండి చూపించిన 'ఆర్టికల్ 15' సినిమా, కరోనా కాలంలో శ్రామికులు చేసిన లాంగ్ మార్చ్‌ని బ్రాహ్మణ అనుభవంగా చూపిన 'బీడ్' సినిమాలు ఈ కోవలోకి వస్తాయి. ఆర్టికల్ 15 సినిమాలో కళ్ళనీళ్ళు పెట్టించిన దారుణ దళిత హింసకు పరిష్కారంగా హీరోయిజాన్ని చూపించినట్లే, బీడ్ సినిమాలో పోలీస్ వ్యవస్థలో ఉనికిలో ఉన్న కుల వివక్షను దళిత హీరో సహనంతో ఓడించినట్లు చూపించారు. సమస్యల మీద సూర్యుడంత వెలుగును ప్రసరించి ఉత్తుత్తి పరిష్కారాలతో ముగింపు నివ్వటం ఈ దర్శకుల చిత్తశుద్ధిని అనుమానించే వైపుగా తోస్తుంది. అలాంటి ఉత్తుత్తి పరిష్కారమే ఈ సినిమా ఇస్తుంది. ఏదో ఒక ‘మంచి’ అధికార పార్టీ దళితులకు సమాన స్థానం ఇచ్చి కుర్చీలో కూర్చోబెడుతుందనే సందేశాన్ని ఈ సినిమా ఇస్తుంది.
పార్టీల ప్రాపగాండా సినిమా!
సింబాలిజాలకు పెట్టిన కోట అయిన మారి సెల్వరాజ్ కుర్చీని కూడా ఒక సింబల్ గా వాడారు. ‘నిన్ను (దళితుల్ని) కుర్చీలో కూర్చొనిస్తాను. మమ్మల్ని కుర్చీలో (అధికారంలో) కూర్చొనివ్వండి’ అనే సందేశాన్ని పెరియార్ ఫోటో సాక్షిగా ఈ సినిమా వదులుతుంది. వెరసి ఈ సినిమా దళితులని ‘కుర్చీ’కాడికి తీసుకొని వెళ్లింది. ఆ కుర్చీ దళితులు వాళ్ళు తయారు చేసుకొన్న కుర్చీ కూడా కాదు. ఏదో అధికార పార్టీ కుర్చీ. ఎన్నికల ద్వారా దళితులు రాజ్యాధికారాన్ని పొందగలరు అని నమ్మే వాళ్లు, అదే సోషల్ జస్టిస్ అని చెప్పేవాళ్ళు కూడా ఒప్పుకోకూడని పార్టీ కుర్చీ అది. ఆ పార్టీ కుర్చీ అప్పటి వరకూ పరమ కులోన్మాది రత్నవేల్‌ను (ఫహాద్ ఫాజిల్ పాత్ర) కూడా మోస్తుంది.‘They are rule. But there wont be any exception’ అంటుంది వచ్చిరాని ఇంగ్లీష్ లో ‘The Exception’ అనే సెకండ్ వరల్డ్ వార్ కథా కాలం సినిమాలో యూదు హీరోయిన్. ఈ సినిమా డీఎంకే ప్రాపగాండా సినిమా అవునో కాదో చెప్పలేము కానీ దళితులను అధికార పార్టీల వైపు మోసుకొని పోయే సినిమా అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మొత్తానికి కశ్మీరీ ఫైల్స్, కేరళ స్టోరీ ఇలాంటి అధికార పార్టీల ప్రాపగాండా సినిమాలకు మార్గదర్శకత్వం ఇచ్చినట్లు ఉన్నాయి.
రమాసుందరి
మాతృక సంపాదకవర్గ సభ్యురాలు
94405 68912