స్త్రీ సాధికారతనే చెప్పే ‘తుమ్హారీ సులు’
స్త్రీ సాధికారతనే చెప్పే ‘తుమ్హారీ సులు’... 'Tumhari Sulu' movie tells about women's empowerment
నా సొంత గొంతుకను రూపొందించుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది, అదిప్పుడు నాకుంది. ఇక మౌనంగా ఉండే ప్రశ్నే లేదు ‘అన్నారు మెడెలిన్ అల్ బ్రైట్. అట్లా సొంత గొంతుకొక్కటే కాదు, సొంత ఆర్థిక, సామాజిక సాధికారికత సాధించడానికి మహిళలు ప్రపంచవ్యాప్తంగా కొట్లాడుతూనే వున్నారు. ఏటికి ఎదురీదినట్టు నిర్విరామంగా కృషి చేస్తూనే వున్నారు. ఆకాశంలో సగమని ఒక పక్క అంటూనే అనేక ఆంక్షల మధ్య మహిళల జీవితాలను బంధిస్తున్న వర్తమాన సమాజంలో స్త్రీ స్వావలంబన అత్యంత అవసరమయింది. స్త్రీ పురుష భేదం లేకుండా సాటి మనుషులుగా పరిగణించుకునే పరిస్థితులు ఇంకా రావల్సి వుంది. ఈ నేపథ్యంలో కేవలం వంటింటికి పరిమితమయిన మహిళలు ఇల్లు దాటి ఉద్యోగం చేసినప్పుడు ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులు, సమాజం స్పందించే తీరు, మగవాళ్ళ నుండి ఎదురయ్యే అనేక అంశాల్ని ఇతివృత్తాలుగా చేసుకొని వివిధ భారతీయ భాషల్లో పలు సినిమాలు వచ్చాయి. ఆయా కాలాలకు అద్దం పట్టాయి. వాటిల్లో ప్రధానమైనవి ‘మహానగర్’, ‘ఉంబర్థ’. సత్యజిత్‌రే 1963లో మహానగర్‌ను, జబ్బార్ పటేల్ 1982లో ఉంబర్థను రూపొందించారు. అదే ఒరవడిలో 2017లో సురేష్ త్రివేణి “తుమ్హారీ సులు’ రూపొందించారు.
ఈ సినిమా ఇతివృత్తం..
'తుమ్హారీ సులు' ప్రస్తుత కాలమాన పరిస్థితులకు, పెరిగిన సాంకేతికత, ఆధునిక పని పరిస్థితులకు అద్దం పడుతూ సాగుతుంది. ఇందులో సులుగా పిలవబడే సులోచనా ధూబే పాత్రలో సుప్రసిద్ధ నటి విద్యా బాలన్ మంచి నటనను ప్రదర్శించి అభినందనలు అనేక అవార్డులు అందుకున్నారు. కహానీ సినిమా తర్వాత విద్యా బాలన్ 'తుమ్హారీ సులు’ లో పరిణతి పొందిన నటనను ప్రదర్శించారు. ఉన్నత పాఠశాల విద్యనయినా పూర్తి చేయని గృహిణి సులోచన తన సొంత కాళ్ళ పైన నిలబడాలని తాను ఏదో సాధించాలనే తపన పడుతూ వుంటుంది. ఆ క్రమంలో ఒక రేడియో సంస్థలో రాత్రి పూట జాకీగా పనిచేసే ఉద్యోగంలో చేరుతుంది. పర్యవసానంగా ఆమె జీవితంలో జరిగే మార్పులు, కుటుంబపరంగా, సామాజికంగా తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని ‘తుమ్హారీ సులు’ ఆవిష్కరిస్తుంది. ఒక మామూలు గృహిణి ఆధునిక సాంకేతిక ఆడియో టెక్నిక్‌కి అనువుగా తనని తాను మెరుగుపర్చుకోవడం ఒక ఎత్తయితే, రాత్రి షిఫ్ట్ కారణంగా ఎదుర్కొనే సమాజ పరిస్థితులు, వ్యతిరేకతను ఎదుర్కొని సొంత కాళ్ళ మీద నిలబడడమనేది ‘తుమ్హారీ సులు’ ఇతివృత్తం. గొప్ప ఈజ్‌తో రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రసంశలతో పాటు ఆర్థికంగా కూడా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.
కథేంటంటే
‘తుమ్హారీ సులు’ కథాకథనం విషయానికి వస్తే సులుగా ప్రేమగా పిలువబడే సులోచనా దూబే తన భర్త 11 ఏళ్ల కుమారుడితో కలిసి విరార్‌లో నివసిస్తూ వుంటుంది. తాను ఎప్పటికయినా సొంత కాళ్ళ మీద నిలబడి మంచి ఉద్యోగం చేయాలన్నదే సులు ఆశగా ఉంటుంది. కానీ కనీసం స్కూల్ అయినా పూర్తి చేయని తనకు ఉద్యోగం ఎట్లా అన్నది ఆమె ముందున్న సమస్య. సులుకి వివిధ పోటీల్లో పాల్గొని బహుమతులు గెల్చుకోవడం పరిపాటిగా వుంటుంది. ఆ క్రమంలో ఒకరోజు రేడియో స్టేషన్ వాళ్ళు నిర్వహించిన పోటీలో గెలుస్తుంది. బహుమతిని తెచ్చుకునేందుకు రేడియో స్టేషన్‌కు వెళ్ళిన సూలుకి రేడియో జాకీ ఉద్యోగ ప్రకటన చూసి తనను ఇంటర్వ్యూ చేయమంటుంది. కానీ సీనియర్ జాకీ అల్ బెలీ అయిష్టంగానే బాస్ మరియా వద్దకు తీసుకెళ్తుంది. మారియా, సులును హలో అనే మాటను రొమాంటిక్‌గా చెప్పమంటుంది. కానీ కవి పంకజ్‌ని చూస్తూ సులు నవ్వుతూ ఇంటర్యూని హాస్యంగా తీసుకుని నవ్వేస్తుంది. చివరికి ఎట్లాగో హలోను చెప్పేస్తుంది. మరియా తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అది రాత్రి షో కనుక ఆలోచించుకొమ్మంటుంది. మర్నాడు సులు, మారియాకు పలు సార్లు ఫోన్ చేస్తుంది కానీ మారియా స్పందించదు. సులుకున్న పట్టుదలను గమనించి మరియా ఆమెకు ఉద్యోగం ఇస్తుంది.
కంపెనీ పిక్ అప్, డ్రాపింగ్ సౌకర్యం ఇస్తుందని చెబుతుంది. కానీ భర్త తనకు ఉద్యోగం గురించి చెప్పలేదని, రాత్రి షిఫ్ట్ అని, అదికూడా రొమాంటిక్‌గా మాట్లాడే ఉద్యోగం కావడంతో మొదట వ్యతిరేకించి సర్దిచెప్పడంతో ఒప్పుకుంటాడు. కానీ సులు తల్లిదండ్రులు, అక్కలు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యోగం మానేయమంటారు. కానీ భర్త అశోక్ సహకరించడంతో సులు ఉద్యోగంలో కొనసాగుతుంది. మారియా కూడా సులు ప్రతిభను తెలుసుకొని ప్రోత్సహిస్తుంది. ఒక రోజు కొడుకు స్కూల్ నుండి ఫోన్ వస్తుంది వెంటనే రమ్మని, సులు, అశోక్ వెళ్తారు. సులు కొడుకు సీడీలు అమ్ముతున్నాడని అది స్కూల్ నిబంధనలకు వ్యతిరేకమని అబ్బాయిని సస్పెండ్ చేస్తున్నట్లు చెబుతాడు ప్రిన్సిపాల్. అది కాస్తా కుటుంబంలో వివాదాస్పదమై సులు ఉద్యోగం చేయడం వల్లే పిల్లాడు అదుపు తప్పుతున్నాడని నౌకరీ మానేయమని ఒత్తిడి తెస్తారు. మరో పక్క అశోక్ తాను పనిచేసే చోట ఇబ్బందులు ఎదుర్కొంటూ వుంటాడు. ఎవరి ఒత్తిడి ఎట్లున్నా సులు ఉద్యోగం చేయడానికి నిర్ణయించుకుంటుంది.
సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా కొడుకు కనిపించడం లేదని ఫోన్ కాల్ వస్తుంది. ఎక్కడ వెతికినా కనిపించడు. ఇంతలో అబ్బాయి రాసిన లేఖ దొరుకుతుంది. తాను తప్పు చేశానని తనవల్లే తల్లి ఉద్యోగం మానేయాల్సి వస్తున్నదని అమ్మకు సపోర్ట్ చేయమని తండ్రిని ఉత్తరంలో వేడుకొంటాడు. తెల్లారి పోలీసులు అబ్బాయిని తోడ్కొని వచ్చి అప్పగిస్తారు. సులు ఆలోచనలో పడుతుంది. తాను ఇంట్లో ఉండి చూస్తే తప్ప కొడుకు బాగుపడడని తలపోస్తుంది. ఆఫీసుకు వెళ్లి రాజీనామా ఇస్తుంది. అప్పుడే ఆఫీసు రిసెప్షనిస్ట్ టిఫిన్ వాలాతో గొడవ పడడం చూసి ఆ కాంట్రాక్ట్ తనకిమ్మని మారియాను అడుగుతుంది. తర్వాత అశోక్ టిఫిన్ సర్వీస్‌ని చేపట్టగా, సుళ్ళూ తన వృత్తినీ, ఇంటినీ నిర్వహిస్తుంది. అట్లా ‘తుమ్హారీ సులు’ సినిమా స్త్రీ సాధికారికతను నొక్కి చెబుతుంది. ఈ సినిమా హాస్యం, సీరియస్‌తో కూడి అలరిస్తుంది. ఇది అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో వుంది చూడండి.
‘తుమ్హారీ సులు’ దర్శకత్వం: సురేష్ త్రివేణి, నటీ నటులు: విద్యా బాలన్, మానవ్ కౌల్, నేహా ధూపియా
వారాల ఆనంద్
94405 01281