నమ్మకం కనుమరుగవుతున్న బంధాలు
మనకి గతంలో ఎదురైన చేదు అనుభవాలను విస్మరించి, ఆ అనుభవాలకు కారణమైన వారిని క్షమిస్తూ, వారిని ప్రేమిస్తూ స్నేహపూర్వక ధోరణితో మెలగడం
మనకి గతంలో ఎదురైన చేదు అనుభవాలను విస్మరించి, ఆ అనుభవాలకు కారణమైన వారిని క్షమిస్తూ, వారిని ప్రేమిస్తూ స్నేహపూర్వక ధోరణితో మెలగడం సులభమా? షరతులు లేని మానవ సంబంధాలకి, ప్రేమ, స్నేహం ఆలవాలమై నిలిచినప్పుడు, నమ్మకం ప్రతిపాదక అయితే సాధ్యం. నమ్మకానికి తూట్లు పడితే, మానవ సంబంధాలు కృత్రిమ మనుష్య సంబంధాలుగా అవసరాల ప్రాతిపదికన మనుగడ సాగిస్తాయి.
కళ్లలో కళ్లు పెట్టి చూసే అవకాశం తక్కువగా ఉన్న ఈ రోజుల్లో, రాసే మాటలు, చెప్పే ఊసులు ఆధారంగానే మనుషుల మధ్య సంబంధాలు ఏర్పడుతున్నాయి. వాటి పటిష్టత కూడా మారే పరస్పర అవసరాలకు అనుగుణంగా మారుతున్నాయి. చేతిలో చేయి వేసి, కళ్లలో కళ్లు పెట్టి చేసే వాగ్దానాలు కలకాలం నిలిచే ఫెవికాల్ బంధాలుగా ఉండేవి. ప్రస్తుతం అంతర్జాల జనిత, అవసరాల ఆధారిత సంబంధాలు ఎక్కువగా విరాజిల్లుతున్నాయి. మరో కోణంలో చూస్తే, జొమాటో, స్విగ్గీ లాంటి ఆహార రవాణా వ్యవస్థలు అమ్మనీ, ఆలినీ, వారు పెట్టె కమ్మటి ఆత్మీయతతో కూడిన భోజనాన్ని కనుమరుగయ్యేలా చేస్తున్నాయి.
నా చిన్నప్పుడు కుక్కలంటే భయంగా ఉండేది. కుక్కలంటే నాకు ఉండే భయానికి కారణం మా ఇంటి పక్కన ఉండే మా బంధువుల కుక్కలే. వాళ్లకి కుక్కలంటే చాలా ఇష్టం. కానీ పాలన చేసే విధం తెలియదు. నాకు తెలిసి,వారు తెచ్చుకున్న ఒక పది కుక్కలు, వచ్చిన కొద్ది కాలంలోనే చనిపోయాయి. ఎందుకు చనిపోతున్నాయో తెలియక, వాళ్లు పెడుతున్న తిండి కుక్కలకి సరిపడదని తెలియక, తెలుసుకునే ప్రయత్నం చేయక, వాళ్ల కుటుంబానికి ఏదో శాపం ఉందని నమ్మి ఉపశమనం పొందేవారు.
నాకూ మా పక్క వాళ్లకీ రక్త సంబంధంతో పాటు కుక్క సంబంధం కూడా ఉండేది. వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడలా అప్పుడు ఉన్న కుక్కలు నా బక్క పిక్క మీద గురిచూసి పట్టుకునేవి. నేను పారిపోతూంటే వచ్చి కనీసం పిక్కలు కరిచేవి. అవి విద్వేషంతో వెంటపడుతున్నాయని అనుకునేవాడిని, కానీ, పిడికెడు తిండి, ఇసుమంత ప్రేమ కోసం నన్ను వేడుకుంటున్నాయని తెలియలేదు. కారణం, నేను ఎప్పుడూ ఆ కుక్కల కళ్లలోకి చూడలేదు. పెంపుడు కుక్కల గురించి అప్పటికి నాకు తెలిసినదల్లా నేను విన్నది, నేను నమ్మినది మాత్రమే. అవి మనం తినగా మిగిలిన ఎంగిలి మెతుకుల కోసం వేచి, తిని మన కాళ్ల దగర పడి ఉండే జంతువులు అని. ఆ అభిప్రాయం మా ఇంటికి కుక్క వచ్చాక పూర్తిగా మారిపోయింది.
మా అమ్మాయికి కుక్కలంటే ఇష్టం. ఏదో ఒక బలహీన సమయంలో కుక్కని తెచ్చి ఇస్తానని వాగ్దానం చేసి, పేరులో కృష్ణుడు ఉన్నా, రాముడిలా పేరు పొందాలన్న ఆకాంక్షతో కావచ్చు ఒకానొక నాడు 70 మైళ్లు ప్రయాణం చేసి జాక్ అనే కుక్కని కొనుక్కుని, ఇంటికి వెళ్లే మార్గంలో లక్కీ అనే పేరు పెట్టి ఇంటికి తీసుకువెళ్లాము. నాకు అప్పటికీ కుక్కలంటే భయం, ఏవగింపు. కానీ లక్కీ నాకు దగ్గర అవడానికి అహర్నిశలూ అలమటించేవాడు. నా వృత్తి రీత్యా వేరే ఊళ్లో ఉండి వెనక్కి వచ్చినప్పుడు వాడు చూపించే ప్రేమ, వాడి కళ్లలో కనిపించే ఆనందం మరిచిపోవాలన్నా సాధ్యం కాదు. ఎట్టకేలకు, నా భయాన్ని పోగొట్టి, దరిచేరి, నన్ను విడవకుండా చివరివరకూ జీవించిన కుక్క, లక్కీ, నాకు చెప్పిన పాఠాలు సుదర్శన మార్గ ద్వారాలకి అందించిన ఆలోచనల బాటలు.
డా. కొవ్వలి గోపాలకృష్ణ
సీనియర్ సైంటిస్ట్, అమెరికా,
editor@prakasika.org