రోడ్డుపై ప్రయాణం.. కాకూడదు ప్రాణసంకటం...!

Traveling on the road.. should not be life threatening...!

Update: 2023-11-16 00:45 GMT

రోడ్లు నాగరికతకు చిహ్నాలు రహదారులు. వాటి రూపురేఖలను బట్టి ఆయా ప్రాంతాల అభివృద్ధిని అంచనా వేయవచ్చు. మౌలిక వసతుల్లో నీరు, విద్యుత్ కంటే రహదారులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. పరిశ్రమలు రావాలన్నా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నా రహదారులే అత్యంత కీలకం. కానీ మన రాష్ట్రంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారి దాదాపు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం కొన్ని రోడ్ల ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో అడుగుకో గుంట చొప్పున రెండు నుంచి నాలుగు అడుగుల లోతుకు గోతులుగా మారాయి. వర్షాకాలంలో స్విమ్మింగ్ ఫూల్స్‌ను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల గ్రామస్థులు వరినాట్లు కూడా వేస్తూ, మరికొన్ని చోట్ల ఈత కొడుతున్నారు. రోడ్లు చెరువుల్లా మారడంతో పశువులను కూడా అక్కడే శుభ్రపరుస్తూ తమ ఆవేదనతో కూడిన నిరసననలు తెలియజేస్తున్నారు.

రాష్ట్రంలో 14వేల కి.మీల రాష్ట్ర, 20 వేల కి.మీ జిల్లా రహదారులు ఉన్నాయి. ఈ రహదారుల్లో ఎక్కువ భాగం రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి మూడు నెలలకు ఒకసారి రోడ్లపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల నుంచి రోడ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోవాలి, ఎక్కడా గోతులు కనిపించకూడదు అని ఆదేశాలు జారీ చేసేవారు. కొత్తలో నిజమేనని ప్రజలందరూ బాగా సంతోషించారు. రోడ్ల రూపురేఖలు మారి అద్దంలా కనిపించడం ప్రతి నెలా వాయిదా పడుతూనే ఉంది. నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి, ఎప్పుడు రోడ్లు అద్దంలా మెరిసిపోతాయని ప్రజలందరూ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎక్కడా ఒక్క తట్ట మట్టి కూడా వేసిన దాఖలాలు కనిపించడం లేదు. కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టిన జాడ కూడా లేదు.

బిల్లులు రావు... టెండర్లు పడవు

అన్ని రోడ్ల నిర్మాణాలకు, మరమ్మతులకు క్రమం తప్పకుండా టెండర్లు పిలుస్తూనే ఉన్నారు. మొదట్లో కాంట్రాక్టర్లు ఉత్సాహంగా టెండర్లలో పాల్గొనేవారు. తర్వాత అసలు బిల్లులు రాకపోవడంతో టెండర్లు వేయడం మానేశారు. ముడుపులు చెల్లిస్తేనే కొంతమందికి అరకొరగా బిల్లులు వచ్చాయి. తీవ్రమైన నిధుల కొరత, మరోవైపు అవగాహన రాహిత్యం, దీనికితోడు పాలకపక్ష నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారాయి. బిల్లులు రాకపోవడంతో కొంతమంది అప్పులపాలై దొంగలుగా మారారు. కాంట్రాక్టర్లను దొంగలుగా, పింఛనుదారులను పిక్ పాకెటర్లుగా మారేలా ప్రభుత్వమే చేస్తోందని హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం మనం చూశాం. నాడు పోషకులు, నేడు యాచకులమని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని ప్లకార్డులతో సంబంధిత కాంట్రాక్టర్లు వాపోతున్నారు. 2018-19లో చేసిన పనుల తాలుకా బిల్లులు చెల్లించడంలో జరుగుతున్న జాప్యంపై కాంట్రాక్టర్లు 2021లో హైకోర్టును ఆశ్రయించారు. సత్వరమే బిల్లులు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఆనాడు జరిగిన పనులపై విచారణల పేరుతో రకరకాల రూపాల్లో ఇబ్బందులు పెడుతున్నారు. ఐదేళ్లు దాటినా బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదు. రోడ్ల తాలుకా కొలతలు వేసి, క్వాలిటీ కంట్రోల్ వారు పరిశీలించి, అనంతరం ఎమ్-బుక్కుల్లో రికార్డ్ కూడా చేశారు. రావాల్సిన బిల్లుకు ఫండ్ ట్రాన్స్ ఫర్ ఆర్డర్ (ఎస్టీవో) కూడా విడుదల చేశారు. తిరిగి ఇప్పుడు క్వాలిటీ కంట్రోల్ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ కాంట్రాక్టర్లు పురుగుమందు డబ్బాలతో సంబంధిత కార్యాలయాల ముందు నిరసన తెలిపుతున్నా ఈ ప్రభుత్వానికి చలనం ఉండటం లేదు.

మరణపు గుంతలు

ఇటీవల పల్నాడు జిల్లాలో బత్తిన ఆనంద్ అనే వ్యక్తి రోడ్లపై గుంతలు కారణంగా ప్రమాదానికి గురై మరణించాడు. అతని భార్య గర్భవతి కావడంతో కారంపూడి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ సరైన వసతులు లేని కారణంగా గురజాలకు అటునుంచి నరసరావుపేట ఆసుపత్రికి పంపారు. భార్యను ఆసుపత్రిలో చేర్పించి డబ్బుల కోసం ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరగా జూలకల్లు వద్ద రోడ్డుపై ఉన్న గుంతలో పడి మరణించాడు. ఒక వార్డులో పుట్టిన బిడ్డ, మరోవార్డులో మరణించిన తండ్రి మృతదేహం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలచివేసింది. కృష్ణా జిల్లా తేలప్రోలు- ఆనందపురం రహదారి మధ్యలో ఉన్న గొయ్యి ఉంగుటూరు ఎంపీపీ ప్రసన్నలక్ష్మి మృతికి కారణమైంది. కేంద్ర రహదారి రవాణా శాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం 2022లో దేశంలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా మరణించిన వారి జాబితాలో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో నిలిచింది. మానవ తప్పిదాలు, రోడ్లు సరిగా లేకపోవడమే ఇందుకు కారణం.

కేబినెట్‌లో ఉన్న ఏ మంత్రి ఇలాకాలో కూడా రోడ్లు సక్రమంగా లేవు. కానీ ఎవరూ నోరు విప్పి మాట్లాడటానికి సాహసం చేయడం లేదు. ప్రత్యక్షంగా ప్రజాప్రతినిధులు, మంత్రులు సైతం ఆయా రోడ్లలో ప్రయాణిస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రోడ్లపై ప్రయాణిస్తే ప్రయాణికుల వెతలు, బాధలు తెలుస్తాయి. బహుశా రోడ్లు బాగా లేవనే కారణంగానే 4,5 కి.మీలు సైతం హెలికాప్టర్‌లోనే ప్రయాణిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చి శంకుస్థాపనలు చేసిన రోడ్లు సైతం కనీసం మొదలుపెట్టలేదు. ఆంధ్రప్రదేశ్‌లో 80కి.మీ రోడ్డు ప్రయాణం చేశాను, తెలంగాణ వెనుకపడింది అనుకున్నా.. కానీ ఇక్కడ పరిస్థితి అధ్వానంగా ఉందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర రోడ్లపై ప్రయాణించడం ఒక శిక్ష లాంటిదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ ట్వీట్ చేయడం జరిగింది. డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్రా అని ఇటీవల కేసీఆర్ ఎగతాళి చేశారు. అంతకుముందు ఏపీ రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయో అని కేటీఆర్, హరీష్ రావు కూడా అవహేళన చేశారు.

నరకయాతనగా రోడ్ జర్నీ

రాష్ట్రంలో రోడ్లన్నీ నరక కూపాలుగా మారిపోయాయి, రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి దాపరించిందని, ఆఖరికి గాయాలపాలైన వారి కారణంగా వైద్యులకు పని పెరిగిందని వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతున్నాయి. రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, ఉన్న డబ్బులు సంక్షేమ పథకాలకు ఖర్చుపెడుతుంటే రోడ్లు వేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఎమ్మెల్యే కన్నబాబు వ్యాఖ్యానించారు. రోడ్ల కారణంగా లారీలు, బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల లైఫ్ టైం తగ్గిపోతోంది. పెట్రోల్, డీజిల్ కూడా ఎక్కువగా వినియోగం అవుతోంది. వాహనాల రిపేర్లకు అధిక మొత్తం వెచ్చించాల్సి వస్తోంది. సమయం కూడా వృధా అవుతోంది. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లల అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ పనులకు పోవడానికి, పట్టణాలకు వెళ్ళడానికి రోడ్లుపై ప్రయాణం చేయడం సాధ్యపడక.. ప్రజలే స్వయంగా పూనుకుని మరమ్మతులు చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల తమ వాహనాలు గుల్ల కాకుండా ఉండేందుకు ఆటో డ్రైవర్లే రోడ్లను మరమ్మతులు చేసుకుంటున్నారు.

గ్రామీణ రహదారి ప్రాజెక్ట్ ప్లాఫ్

గత ప్రభుత్వం రూ.5,694 కోట్లతో 23,553 కి.మీ రోడ్లు వేశారు. 12వేల కోట్లతో బీటీ రహదారుల పనులు చేపట్టారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని జాతీయ రహదారులు రాష్ట్రానికి కేటాయించారు? జాతీయ రహదారులకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఒక్క ఫ్లై ఓవర్ బ్రిడ్జి కూడా తీసుకురాలేదు. కేంద్ర బడ్జెట్ 2022-23లో ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు కింద ఏఐఐబీ నిధులు 15 వందల కోట్లు కేటాయిస్తే.. రూ.655 కోట్లే ఖర్చు చేశారు. దీంతో 2023-24 బడ్జెట్ లో కేవలం రూ.413 కోట్లే కేటాయించారు. రోడ్ల పునర్ నిర్మాణానికి 2022-23 బడ్జెట్లో రూ.979 కోట్లు కేటాయిస్తే.. రూ.247 కోట్లే ఖర్చు చేశారు. అలానే మండల లింక్ రోడ్లు, ఇతర రోడ్లకు కేటాయించిన నిధులు కూడా సక్రమంగా ఖర్చు పెట్టలేదు. జగన్ రెడ్డి అరాచక పాలనతో కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. నేరుగా బ్యాంకుల ద్వారా బిల్లులు చెల్లిస్తున్నామని చెబుతున్నప్పటికీ కాంట్రాక్టర్లకు నమ్మకం కుదరడం లేదు. నూతన రోడ్లు నిర్మించకపోయినా కనీసం ఉన్న రోడ్లకైనా తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించి, వారిపై వేధింపులు ఆపి భరోసా నింపాలి. రోడ్లను నిర్మించడం ద్వారా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది సంపద పెరుగుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితే ఉద్యోగ, ఉపాధి రంగాలు కూడా ఊపందుకుంటాయి. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు వెచ్చించే సమయాన్ని ప్రజల బాగోగుల కోసం వెచ్చించాలి. రోడ్లు ప్రాణసంకంటంలా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

మన్నవ సుబ్బారావు

99497 77727

Tags:    

Similar News