సామాజిక పరివర్తనా శిల్పి – అంబేడ్కర్

Update: 2023-04-13 23:45 GMT

దేశ సాంఘిక వ్యవస్థలో వేళ్లూనుకొని ఉన్న సాంఘిక, సామాజిక, ఆర్థిక అసమానతలు, వివక్షతలను, అదిగమించి తన సొంత కృషితో పట్టుదలతో సమకాలీన భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, మహోన్నతమైన వ్యక్తిగా, నాయకునిగా ఎదిగారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. కులానికి, తెలివితేటలకు సంబంధం లేదని చెప్పడానికి అంబేద్కర్‌ జీవితమే గొప్ప ఉదాహరణ. ప్రగతిశీల దృక్పథంతో, ఒక సంఘ సంస్కర్తగా శాంతియుత, రాజ్యాంగ పద్ధతుల ద్వారా, పరిణామ ప్రక్రియ ద్వారా భారతీయ సమాజంలో సామాజిక పరివర్తన సాదించాలని విశ్వసించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విజ్ఞానశాస్త్ర, మానవశాస్త్ర, నీతిశాస్త్రాలలో మూడు డాక్టరేట్లు, గొప్ప పాండిత్యాన్ని సంపాదించాడు. ఇంత మేధావి అయినా అంటరానితనమనే భూతం వెంటాడుతూనే ఉంది. అందుకు తన విజ్ఞానాన్ని విస్తృత పరచుకొని సామాజిక దోషాలను రూపుమాపడానికి నడుం కట్టాడు. మత వ్యవస్థలో సామాజిక మార్పు , సామాజిక న్యాయం, సమానత్వానికి చాలా కీలకమని ఆయన నొక్కి చెప్పారు. కుల వివక్ష, సామాజిక అసమానతలు లేకుండా సమ్మిళిత వృద్ధి, సాంస్కృతిక ఏకీకరణతో దేశం స్థిరమైన పునర్నిర్మాణం అనే విస్తృత భావనపై దేశ నిర్మాణం అవసరమని అన్నారు. కోట్లాదిమంది అణగారిన, బలహీన వర్గాలకు మరింత సమానమైన సమాజాన్ని స్థాపించడానికి భారత రాజ్యాంగంలో అంబేద్కర్‌ రక్షణలను ఏర్పాటు చేశారు.

అంబేడ్కర్‌ అంటరానికులాల గురించి మాత్రమే ఆలోచించాడనే చాలామంది అపోహ. కులం, మతం, చరిత్ర, ఆర్థికరంగం, రాజకీయ సిద్ధాంతాలు, వివిధ రంగాల అభివృద్ధి, పరిశ్రమలు, వ్యవసాయం, ప్రగతి, మహిళల హక్కులు– ఒక్కటేమిటి ఏ విషయాన్ని తీసుకున్నా, అంబేడ్కర్‌ సమగ్రమైన, శాస్త్రీయమైన, ఆచరణాత్మకమైన ప్రతిపాదనలు చేశారు. అందుకే అంబేడ్కర్‌ కేవలం అంటరాని కులాలు, నిమ్న వర్గాలు, ఆదివాసీల హక్కుల కోసం స్వప్నించినవాడు మాత్రమే కాదు. ఒక సమగ్ర, సమానత్వ దృష్టి ఉన్న భవ్య భారతదేశాన్ని ఊహించినవారు కూడా. ఎన్నో విషయాలను రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా సర్వజన సంక్షేమాన్ని కాంక్షించారాయన. కొన్నింటిలో సఫలీకృతులయ్యారు. కొన్నింటిలో కాలేకపోయారు. ఆ విషయాలను రాజ్యాంగాన్ని సభకు సమర్పిస్తున్నప్పుడే చెప్పారు.

తన జీవితాంతం అణగారివర్గాల గొంతుకను వినిపించి, వారి సాధికారికతకు అంబేడ్కర్ పాటుపడ్డారు. అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంఖం నేటికీ నిప్పు కణికలా జ్వలిస్తూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన. బడుగు, బలహీనవర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా అంబేడ్కర్.. వారి అభ్యున్నతకి రాజ్యాంగంలో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. అలాగే అంటరానితనం, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేశారు. అటు, ఆర్థికవేత్తగా కూడా ఎంతో గుర్తింపు పొందారు. పారిశ్రామికీకారణ, వ్యవసాయాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు. దేశం కోసం పాటు పడ్డ నాయకుల గురించి స్కూల్ స్థాయిలో చెప్తారు కానీ కుల నిర్మూలన లాంటి సాంఘిక దురాచారంపై , మహిళల హక్కుల కోసం, కార్మికుల కోసం పాటుపడ్డ గొప్ప అంబేడ్కర్ లాంటి నాయకుడిని గురించి మాత్రం చెప్పరు. ఆయన విగ్రహాలను పెడ్తూ, ఆయనను ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా చేసి, ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆలోచనను కూడా ఇతర వర్గాల ప్రజల్లో రాకుండా ఈ సమాజం తయారైంది. అంబేడ్కర్ దూర దృష్టితో తీసుకున్న నిర్ణయాలు గురించి ఇతర దేశాల్లో గొప్పగా చెప్పుకుంటారు కానీ ఆయన గురించి మాత్రం మన పాఠశాలల్లో కూడా చెప్పరు.

అంబేడ్కర్ భారతీయ సామాజిక వ్యవస్థను మార్చడం కోసం జీవితాంతం కృషి చేశారు. కులవ్య వస్థను రద్దు చేయడానికి కులనిర్మూలనను ప్రతిపాదించారు. కులం ఒక పెట్టుబడిగా, అదనపు సంపదగా, అదనపు విలువగా, అధికార కేంద్రంగా ఉందని స్పష్టం చేయడం ద్వారా అంబేడ్కర్ కులాన్ని కూడా అర్థశాస్త్రంలో భాగంగా చర్చించారు. భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, ఆర్ధికవేత్తగా, న్యాయ శాఖ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా, ఇలా ఎన్నో బాధ్యతలను ఆయను నిర్వర్తించారు.ఆ మహానుభావుడి జయంతి. ఈ సందర్భంగా యావత్ భారతావని నివాళులు అర్పిస్తోంది.

- తీగల అశోక్ కుమార్

ఫోన్ 7989114086




Tags:    

Similar News