చీకటి పల్లెల్లో.. వెలుగులు నింపిన సూర్యుడు

Update: 2023-04-13 23:30 GMT

ఏ సామాజిక ఉద్యమానికైనా తప్పనిసరిగా ఉండాల్సిన వ్యూహాలు, ఆచరణ, నాయకత్వం, సామాజిక అంగీకారాన్ని నిర్వహించే తత్వశాస్త్ర (తాత్విక సిద్ధాంతం) సూత్రాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించిన గొప్ప ఉద్యమ నాయకుడు 'డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్'. డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ అసమాన విద్యావేత్త. సామాజిక అసమానతలను రూపుమాపడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి. అంటరానితనంపై, అగ్రకుల దురహంకారంపై గొంతెత్తిన స్వరం. బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన సమాజ సేవకుడు.

డా.బాబాసాహెబ్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుందాం.

ఓటు హక్కు ప్రదాత

ప్రజాస్వామ్య పౌరసత్వానికి ఓటు హక్కు అత్యంత ప్రాథమిక అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య అభివృద్ధి ప్రక్రియలో ప్రజలు సార్వత్రిక ఓటు హక్కును పొందలేదు. అన్ని దేశాల్లాగే భారతదేశంలో కూడా మొదటగా అందరికీ ఓటు హక్కు లభించలేదు. పన్ను చెల్లింపుదారులు, మెట్రిక్యులేషన్ (10వ తరగతి) సహా కొందరికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఓటు హక్కు ప్రాముఖ్యతను గుర్తించిన అంబేద్కర్ 1919లో సౌత్ బోరో కమిటీకి తన పిటిషన్‌లో ప్రాతినిధ్య హక్కు, రాజ్యాంగ హోదా హక్కు పౌర హక్కులలో అత్యంత ముఖ్యమైనవి పౌరసత్వం, రాజకీయాల్లో సభ్యత్వం కోసం ఓటు హక్కు అని పేర్కొన్నాడు. ఓటు హక్కు వల్ల బడుగు బలహీన వర్గాలవారికి రాజకీయ చైతన్యాన్ని తెస్తుందన్నారు. ఇన్ని సంవత్సరాలుగా సామాజిక, రాజకీయ జీవితాల జోలికి వెళ్లని వారి విముక్తికి ఇది ఆయుధంగా ఉపయోగపడుతుంది.

అంబేద్కర్ పేర్కొన్న ఈ రెండు అంశాలు భారత రాజ్యాంగం ఇచ్చిన సార్వత్రిక ఓటు హక్కుకు వెన్నెముక. అంబేద్కర్ 1930లో మరియు తరువాత రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ డిమాండ్‌ను లేవనెత్తడానికి తనకు అందుబాటులో ఉన్న ప్రతి వేదికను ఉపయోగించారు. ఓటు హక్కు అనేది స్వేచ్ఛకు ప్రజాస్వామ్యానికి అవసరమైన అంశం అనే అభిప్రాయాన్ని అంబేద్కర్ సృష్టించగలిగారు. నిరక్షరాస్యత ఆధారంగా ఓటు హక్కు కల్పించడాన్ని అంబేద్కర్ రాజ్యాంగ సభలో తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తరువాత అగ్రనేతల సహాయంతో అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 326ని ప్రవేశపెట్టారు. దానివల్లే వర్గ, లింగ, కుల, కులాలకు అతీతంగా ప్రజలందరికీ ఓటు హక్కు లభిస్తోంది. ఈరోజు మనం ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నకుంటున్నామంటే ఇది అంబేద్కర్ కృషి ఫలితం. దేశం, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించడానికి ఓటే ఆధారం. ఓటు అనే రెండక్షరాలు దేశ భవిష్యత్తుకి పునాది.

పంచాయతీరాజ్ వ్యవస్థ

భారత గణతంత్ర 70 ఏళ్ల సుదీర్ఘ పాలన లో పంచాయత్ రాజ్ వ్యవస్థ గొప్ప విజయం. ఢిల్లీ పాలన ను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని మహాత్ముడు కలలుగన్న గ్రామస్వరాజ్ లక్ష్యంతో ప్రారంభించిన పంచాయతీరాజ్ వ్యవస్థ అనుకున్న లక్ష్యాలను చాలా వరకు సాధించింది. జనాభాలో సగం మంది మహిళలు మరియు ప్రస్తుతం 50% స్థానిక సంస్థలను పరిపాలిస్తున్నారు. గ్రామానికి దూరంగా..వివక్షతో జీవించే దళితులు కూడా అధికారంలో భాగమయ్యారు. ఇలా ఎన్నో విజయాలతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ అనేక మౌలిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో వాటన్నింటినీ పరిష్కరించగలిగితే భారత్ ప్రపంచంలోనే ఆదర్శవంతమైన దేశంగా రూపుదిద్దుకుంటుందనడంలో సందేహమే లేదు. ప్రజాస్వామ్యాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరింప చేయడానికి, స్వపరిపాలన ద్వారా పంచాయతీలను బలోపేతం చేయడానికి 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.

అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం

1927లో మహద్‌లో అంటరానితనానికి వ్యతిరేకంగా మంచినీరు, దేవాలయాల ప్రవేశం కోసం పెద్దఎత్తున మంచినీటి సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. 1927 డిసెంబర్ 25 న తన వేలాది మంది అనుచరులతో కలిసి దేశంలో కుల వ్యవస్థకు పునాదులు వేసిన సామాజిక అసమానతలకు మూలమైన మనుస్మృతిని తగులబెట్టాడు. 1930లో 15,000 మంది వాలంటీర్ల సహాయంతో మిలటరీ బ్యాండ్ స్కౌట్ బృందం కలరామ్ ఆలయ ఉద్యమాన్ని ప్రారంభించగా, మహిళలంతా క్రమశిక్షణగా ఈ ఉద్యమాన్ని చేసి తొలిసారిగా దేవుడిని దర్శించుకున్నారు. ఆర్టికల్ 17 ద్వారా అంటరాన్నితనాన్ని చట్టపరంగా పూర్తిగా నిషేధించారు.

- కోటం చంద్రశేఖర్




Tags:    

Similar News