తిరుమల దృశ్య కావ్యం

తూర్పున ఏర్పేడు నుంచి పడమరలో తలకోన వరకు, దక్షిణంలో తిరుపతి నుంచి ఉత్తరంలో కోడూరు దాకా వ్యాపించిన శేషాచలం అడవులను జల్లెడ పట్టాలని

Update: 2024-11-16 00:45 GMT

తూర్పున ఏర్పేడు నుంచి పడమరలో తలకోన వరకు, దక్షిణంలో తిరుపతి నుంచి ఉత్తరంలో కోడూరు దాకా వ్యాపించిన శేషాచలం అడవులను జల్లెడ పట్టాలని నా చిరకాల వాంఛ. ముప్పై ఏళ్ల కింద ఒకసారి, పాతికేళ్ల క్రితం మరోసారి తలకోనలో మునకలేయడంతో అట్టడుగుకు పోయిన కోరిక ఈ మధ్యకాలంలో కావాల్సినంత సమయం దొరకడంతో అంతరాంతరాల్లో దాగిన కోరిక మళ్ళీ ఈ మధ్య నసపెడుతోంది. ఇలాంటి తరుణంలో రాఘవశర్మ గారు రాసిన ' తిరుమల దృశ్య కావ్యం ' పుస్తకం నాకు అందింది. చదవకుండా ఎలా ఉండగలను? ఏకబిగిన చదవడం పూర్తి చేశాను. 

మన దేశంలో భక్తులే ఎక్కువ కాబట్టి తిరుమలకు పలుమార్లు వెళ్లి వెంకన్నను దర్శించుకొని వెనుదిరుగుతారు. ఆ చుట్టుపక్కల ఉన్న అద్భుత ప్రాకృతిక దృశ్యాల వైపు వెళ్లరు. ప్రకృతి ప్రేమికులు మాత్రమే ఆ పని చేయగలరు. కానీ అతి కొద్దిమంది ఆ ఆనందాలను పలువురికి పంచాలనుకుంటారు. అలాంటి వాళ్లలో రాఘవ శర్మ గారిని ప్రధా నంగా చెప్పుకోవాలి. గత కొన్నేళ్లుగా వారు చూసిన తిరుమల కొండల అందాలకు, ఆనందాలకు అక్షర రూపమే ఈ పుస్తకం.

ప్రతి వాక్యం రసాత్మక కావ్యమే!

"వాక్యం రసాత్మకం కావ్యం" అని విశ్వనాథుడు తన లక్షణ గ్రంథం సాహిత్య దర్పణం లో చెప్పినట్లు ఈ పుస్తకంలోని ప్రతి వాక్యం రసాత్మకమైన కావ్యమే... శేషాచలం కొండకోనల్లో విహరిస్తూ, పవిత్ర తీర్థాలలో జలకాలాడుతూ, వనమూలికా పవనాలను శ్వాసి స్తూ, ప్రాణవాయువును ఊపిరితిత్తుల నిండా నింపుకొని, జల సంగీతాన్ని ఆలకిస్తూ, పాఠ కులు పుస్తకంలో మునిగిపోతారు. శేషాచ లం అడవులు వివిధ జంతువులకు, ఎర్ర చందనం వృక్షాలకే కాకుండా పలురకాల మూ‌లికా వృక్ష సంపదకు కూడా నెలవై ఉ న్నాయి. జీవ వైవిధ్యానికి పేరుగాంచాయి. ఆ మూలికా వృక్ష సంపద విజ్ఞానమంతా ఈ పుస్తక పఠనం వల్ల పాఠకులకు దక్కుతుంది.

శేషాచలం అడవుల యాత్రకు ఇది గైడ్!

అంతేకాదు, శేషాచలం అడవుల్లోకి వెళ్లాలనుకునే వాళ్ళకు ఈ పుస్తకం ఒక గైడ్ లాగా పనిచేస్తుంది. ఏ దారి ఏ తీర్థానికి వెళు తుందో, ట్రెక్కర్లు ఎక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ట్రెక్కర్ల మధ్య ఉండే పరస్పర సహకారం మొదలైన అంశాలు వివరంగా చెప్పడం వలన కొత్త ట్రెక్కర్లకు కావలసినంత ఉత్సాహం, భరోసా వస్తాయి. ఏ కొండ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? అవసరమైతే చతష్పాదాలతో వెళ్ళవలసిన కొండకోనలు ఏవి? దట్టమైన అడవిలో ఒక మోస్తరుగా వెళ్ళే ప్రదేశాలు, ఒక రోజులోనే వెళ్ళ రాగలిగిన ప్రదేశాలు అన్నింటిని చాలా వివరంగా ఇచ్చారు. పుస్తకాన్ని ముందు పట్టుకొని తమ శక్తి సామర్థ్యాలను బట్టి ట్రెక్కర్లు వెళ్లవచ్చు.

బ్రహ్మ గుండానికి మహిళా ట్రెక్కర్లు

ట్రెక్కింగ్ అనేది మగవాళ్ళకే సొంతమా? ఆడవాళ్లు ట్రెక్కింగ్ చేయలేరా? లాంటి ప్రశ్న లకు సమాధానమే 'బ్రహ్మ గుండానికి మహిళా ట్రెక్కర్లు' అనే చాప్టర్. ఈ పుస్తకంలో రచయిత పేర్కొన్న ప్రదేశాలలో ముందుగానే చెప్పినట్లు తలకోన రెండు సార్లు, శిలాతోరణం రెండుసార్లు, చంద్రగిరి దుర్గానికి రెండుసార్లు, అతి పురాతనమైన, చారిత్రాత్మకమైన గుడిమల్లం ఆలయానికి ఒకసారి నేను వెళ్లాను. ఈ పుస్తకంలో శేషాచలం అడవులు, కొండలు, కోనలే కాకుండా చారిత్రాత్మకమైన ప్రదేశాలకు సంబంధించిన.. చంద్రగిరి దుర్గం, సందిగ్ధ సౌందర్యం గుడిమల్లం శివలింగం అనే వ్యాసాలు రెండున్నాయి. వీటికి సంబంధించిన చారిత్రక, పరిశోధనాత్మక వివరాలను సవివరంగా రాశారు. 'డేర్ డెవిల్ ట్రెక్కర్లు' TTC (తిరుమల ట్రెక్కింగ్ క్లబ్) గురించి రాసింది. ప్రకృతి ప్రేమికులైన TTC వాళ్లు కేవలం వాళ్లు మాత్రమే వెళ్లకుండా ఇతరులను కూడా తీసుకువెళ్లడం ప్రశంసనీయం. ఈత రాని వాళ్ళను సైతం ట్యూబుల సహా యంతో పెద్ద పెద్ద నీటి గుండాలను నిర్భ యంగా పాటించడం అభినందనీయం. రచయిత వారి కాంటాక్టు నెంబర్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది.

త్వరలో 'తిరుమల దృశ్యకావ్యం-2'

మొత్తానికి తిరుమల దృశ్య కావ్యం తిరుమల అందాలను పాఠకుల కళ్లముందు సాక్షాత్కరింపజేస్తుంది. పుస్తకం చదివాక ఆ అందా లను ప్రత్యక్షంగా చూసి ఆనందించే వాళ్లు కొందరైతే... అక్షర రూపేణా అవగాహన చేసుకొని ఆనందించే వాళ్లు మరికొందరు. ఆ అన్నట్టు తిరుమల దృశ్య కావ్యం 2 కూడా త్వరలో రాబోతోందడోయ్! చూడాలి ... అందులో రచయిత పాఠకులకు ఏయే ప్రదేశాలు చూపించబోతున్నారో....!

 గిరిజ పైడిమర్రి

99494 43414

Tags:    

Similar News