తొలితరం దర్శకుడు తపన్ సిన్హా

నవంబర్ 20 నుంచి గోవాలో జరిగే 55వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రత్యేక గౌరవాన్ని పొందనున్నారు దర్శకుడు తపన్ సిన్హా. ఆయనతో

Update: 2024-11-16 01:00 GMT

నవంబర్ 20 నుంచి గోవాలో జరిగే 55వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రత్యేక గౌరవాన్ని పొందనున్నారు దర్శకుడు తపన్ సిన్హా. ఆయనతో పాటు రాజ్ కపూర్, మహమ్మద్ రఫీ, అక్కినేని నాగేశ్వరరావులకు ఈ గౌరవం దక్కనుంది. ఆ సందర్భంగా తపన్ సిన్హా గురించి నాలుగు మాటలు...

బెంగాలీలకు సాహిత్యం పట్ల ఉన్న భక్తి, చలనచిత్రాలు, సంగీతం, రంగస్థలం పట్ల వారికి ఉన్న ప్రేమ బహుశా ప్రపంచంలోనే మరే ఇతర ప్రజలకంటే కూడా అసమానమైనది. బెంగాలీ సినీరంగం అనగానే సత్యజిత్ రే, మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్ ఇట్లా పలు పేర్లు మనకు స్పురణలోకి వస్తాయి. అదే స్థాయిలో బెంగాలీ సినిమాకు సేవలందించి ముందు వరసలో నిలబడ్డవాడు తపన్ సిన్హా. ఠాగూర్ అన్నా, ఠాగూర్ రచనలన్నా ముఖ్యంగా కథ లన్నా అమితంగా ఇష్టపడే తపన్ సిన్హా ఠాగూర్ అనేక కథల్ని సినిమాలుగా రూపొందించాడు. కమర్షియల్‌గా కూడా విజయవంతమయిన సినిమా దర్శకుడాయన.

కిటికీలన్నీ తెరిచి ఉంచాలి అంటూ..

ఎన్నో వైవిధ్యమైన సినిమాలు తీసిన తపన్ సిన్హా ఇట్లా “నన్ను నేను బ్రతికించుకోవడానికి, సినిమా దర్శకుడిగా మెరుగ్గా ఉండటానికి ప్రధాన కారణం నేను నా సృజనను పునరావృతం చేయను. కేవలం ఒకే జానర్‌కి కట్టుబడి ఉండలేను. ఇది నేను విదేశీ చిత్ర దర్శకుల్నించి నేర్చుకున్నాను. వారి కెరీర్‌ను పరిశీలిస్తే, వారు బైబిల్‌పై సినిమా తీసిన తర్వాత ప్రేమ కథపై పని చేయడం చూస్తాం. లేదా ఓ కామెడీని చిత్రీకరించడం చూస్తాం. లేదా వారి తదుపరి వెంచర్ కోసం సంగీతాన్ని రూపొందించడానికీ లేదా చిత్రీకరించడానికీ ప్లాన్ చేయడం లాంటివి చూస్తాం. అంటే అధిక శాతం మంది ఏదో ఒకే ఒక జానర్‌కి పరిమితం కాకుండా వుంటారు. వాళ్లే నాకు ప్రేరణ. ఇంకా చెప్పాలంటే నా ఈ గది నిండా కిటికీలు ఉన్నాయి. ప్రపంచాన్ని బాగా తెలుసుకోవాలంటే వాటన్నింటినీ విశాలంగా తెరిచి ఉంచాలనుకుంటాను. ఒక కిటికీని మాత్రమే తెరిచి ఉంచడం, మిగతావాటిని దృఢంగా మూసి వేయడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే నేను నా సబ్జెక్టులనూ, వాటి నేపథ్యాన్ని మారుస్తూ ఉంటాను. ఇది సృజనాత్మక మనస్సును అప్రమత్తంగా ఉంచుతుంది. ఖచ్చితమైన పనిని మంచి స్థితిలో ఉంచుతుంది. నా మనస్సును స్తబ్దత ఆవరించాడాన్ని నేను ఎప్పుడూ అనుమతించను.” అంటారు.

సౌండ్ రికార్డిస్టుగా మొదలై...

భారతీయ సినిమా దర్శకుల్లో మొదటి తరానికి చెందిన వాడు తపన్ సిన్హా. ముప్పై ఎనిమిది సినిమాలు తీసాడు. ప్రధానంగా బెంగాలీ సినిమా దర్శకుడిగానే ఉన్నప్పటికీ హిందీలో కూడా పలు సినిమాలు తీశాడు. ఆయన అనేక అవార్డులు అందుకున్న దర్శకుడు. ‘తపన్ దా’ గా అందరి మన్ననలను అభిమానాన్నీ చూర గొన్న వాడాయన. ఆయన 1924లో జన్మించా డు. ఆయన తన సినీరంగ జేవితాన్ని 1946లో న్యూ థియేటర్స్‌లో సౌండ్ రికార్డి‌స్ట్‌గా ప్రారంభించాడు. కలకత్తాలో మొదలయిన ఆయన సినీ జీవితం 1950లో లండన్‌లో జరిగిన ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనడంతో ఓ మలుపు తిరిగింది. ఆయనకు ఫైన్ ఫుడ్ స్టూడియోలో ఆడియో ఇంజినీర్‌గా ఉద్యోగం రావడంతో అక్కడే ఉండిపోయాడు. లండన్లో శిక్షణ పొంది కొంతకాలం వుండి తిరిగి వచ్చిన తర్వాత కలకత్తాలో తన దృష్టి మొత్తం దర్శకత్వం పైనే సారించాడు.

16 జాతీయ ఫిలిం అవార్డుల గ్రహీత

ఆయన చిత్రావళి ‘అంకుష్’‌తో 1953లో ఆరంభమయింది. ఆయన నిర్మించిన చిత్రాలకు 16 జాతీయ ఫిలిం అవార్డులు అందుకున్నాడు. ‘కాబూలీవాలా’, ‘హతే బాజారే’, చిత్రాలకు రాష్ట్రపతి పురస్కారాలు అందుకున్నాడు. ఠాగూర్ కాబూలివాలా కథని మొదట బెంగా లీలో సినిమాగా రూపొందించినవారు తపన్ సిన్హా. ఆ తర్వాత బిమల్ రాయ్ అనేదాన్ని హిందీలో తీశారు. తపన్ సిన్హా పిల్లల కోసం రూపొందించిన ‘సఫేద్ హాతి’ సినిమాకు ఉత్తమ బాలల చిత్రం అవార్డు కూడా అందుకున్నాడు. ఇక తపన్ దా రూపొందించిన ‘ఏక డాక్టర్ కి మౌత్’ సినిమాకు గాను 1990లో జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నాడు. ఇక ‘వీఎల్ చైర్’ లాంటి సినిమా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని విశేష ప్రశంసల్ని అందుకుంది.

వాస్తవికతకు ప్రాణం పెట్టి..

అంతర్జాతీయ అవార్డుల విషయానికి వస్తే ఆయన అనేక పురస్కారాలు అందుకున్నాడు. కాబూలీవాలా బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ సంగీత అవార్డు, ‘లావూ హాపతే’, క్షుదితా పాషన్’, ‘హాన్సులి బంకర్’, ‘అతిథి’, చిత్రాలకు వెనీస్ ఫిలిం ఫెస్టివల్‌లో, ‘హతే బజారు’ ఆసియన్ ఫిలిం ఫెస్టివల్‌లో రాయల్ కప్ అవార్డు, ‘నగీనా మహార్’కు ఆఫ్రో ఆసియన్ అవార్డు, ‘హార్మోనియం’కు ఆసియన్ ఫిలిం ఫెస్టివల్‌లో సంగీతం, అందులో నటిం చిన నటులకు ఉత్తమ నటనకు అవార్డులు అందుకున్నారు. ఇక 1980లో తీసిన ‘బందారామేన్ బాగన్’కు జాతీయ అవార్డును అందుకున్నాడు. 1981 తపన్ సిన్హా తీసిన ‘అదాలత్ ఓ ఎక్తిమాయి’లో సమాజంలో వేళ్లూనుకుని వున్న అవకాశవాదాన్ని భావస్ఫోరకంగా చిత్రిం చాడు. ఈ చిత్రంలో స్త్రీ పాత్ర ప్రోటాగానిస్ట్, ఆ పాత్రని కేంద్రంగా చేసుకుని సమాజంలో వున్న మనుషుల చిత్ర విచిత్ర ప్రవర్తనలను ముఖ్యంగా పురుషుల దురహంకారాన్ని, అధి కార వర్గాల మోసాల్ని అత్యంత వాస్తవికంగా చిత్రించాడాయన. ఇక తపన్ సినిమాల్లో సంగీ తం ప్రధాన పాత్ర పోషించింది. ఆయన తన చిత్రా ల్లో ఎలాంటి మెలోడ్రామాను అంగీకరించలేదు. అన్నీ వాస్తవిక కోణంలోంచే తీశారు. ఇంకా ఆనాటి దర్శకుల్లో పోటీ కంటే పరస్పర సహకారం అధికంగా ఉండేది. తాను తీస్తున్న ఒక సినిమాలో రవీంద్ర సంగీతను ఉపయోగిం చమని సత్యజిత్ రే సూచించాడని తపన్ సిన్హా ఒక చోట ఆనందంగా చెప్పుకున్నాడు. ఇట్లా అర్థవంతమైన కవితాత్మకమైన సినిమా లు రూపొందించి ప్రథమ శ్రేణి దర్శకుల్లో నిలబడ్డ తపన్ 2009 జనవరి 15న మరణించాడు.

- వారాల ఆనంద్

94405 01281

Tags:    

Similar News