వ్యక్తి నిర్మాణం ద్వారా... జాతీయ పునఃనిర్మాణం

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేడు భారతదేశంలో క్రియాశీలమైన విద్యార్ధి సంఘం.

Update: 2024-07-08 23:20 GMT

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నేడు భారతదేశంలో క్రియాశీలమైన విద్యార్ధి సంఘం. స్వర్గీయ యశ్వంతరావు కేల్కర్, స్వర్గీయ దత్తాజీ డిండోల్కర్, సమైక్య ఆంధ్రప్రదేశ్ నుండి స్వర్గీయ జనమంచి గౌరీశంకర్ గార్లు ఏబీవీపీ సంఘటనాత్మకమైన కార్యపద్ధతికి పునాది వేశారు. భారతమాత పునర్వైభవం కోసం విద్యార్థి, యువతను సంఘటిత పరిచి వారిలో దేశభక్తి, దేశం పట్ల నిష్ఠను ప్రాదుకొల్పడం కోసం జ్ఞానం, శీలం, ఏకతలే ధ్యేయంగా విద్యార్థి పరిషత్ ప్రభావశీలంగా దేశంలో పనిచేస్తుంది.

భారత దేశంలో అనైక్యతల కారణంగా కోల్పోయిన స్వాతంత్ర్యం సాధించుకోవడంలో కొన్ని వేలమంది అమరులైనారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుని మనం స్వతంత్ర సమరయోధులను తలుచుకున్నాము. ఏబీవీపీ 1948 లోనే ఢిల్లీ యూనివర్సిటీలో అతికొద్ది మందితో తన ప్రస్థానాన్ని కొనసాగించినా, 1949 జూలై 9 న అధికారికంగా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఏబీవీపీ అమృతోత్సవ సంబరాలు (75 సంవత్సరాలు) జరుపుకుంటున్నది. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న అజ్ఞాత స్వాతంత్ర్య సమరయోధుల గురించి యువతకు తెలియచేసి వారిలో దేశభక్తి స్ఫూర్తి రగిలించడం కోసం ఏబీవీపీ కృషి చేస్తుంది. వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునఃనిర్మాణమే ధ్యేయంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈరోజు అన్ని రంగాల విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా విద్యార్థి పరిషత్ పనిచేయడంలో ముందుంది.

జాతీయవాద శక్తిగా ఏబీవీపీ

ఈ దేశ ప్రజలు నా వాళ్ళు అని ఈ దేశం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి ప్రజల మధ్యనే బ్రతుకుతూ, ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటూ ఒక శక్తివంతమైన విద్యార్థి శక్తిని జాతీయవాదం వైపు నడిపించిన చరిత్ర ఏబీవీపీది. వామపక్ష తీవ్రవాదం వల్ల అశాంతి, అలజడి, ఆందోళనకరమైన పరిస్థితులలో యూనివర్సిటీలలో, కాలేజీలలో ఏబీవీపీ జాతీయ భావాన్ని పెంపొందించడంలో 40 మంది కార్యకర్తలను కోల్పోయింది. ఇటువంటి కఠిన సమయంలో మొక్కవోని దైర్యంతో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ప్రాంతంలో శాంతియుత వాతావరణం, యూనివర్సిటీలలో విద్యా వాతావరణాన్ని పెంపొందించడంలో అవిరళ కృషి చేశారు.

అడుగడుగునా త్యాగాల చరిత్ర

ఆ సందర్భంలో 1981 జనవరి 26 రోజున నాటి కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఎగరేసిన కొద్ది సేపటికి, రాడికల్ మూకలు జాతీయ జెండా దించి, నల్ల జెండాను ఎగరవేయడం జరిగింది. నక్సల్స్ బెదిరింపులను లెక్క చేయక సామ జగన్మోహన్ రెడ్డి తిరిగి జాతీయ పతాకాన్ని ఎగుర వేశాడు. ఇదే కేసులో సాక్ష్యం చెప్పడానికి న్యాయస్థానానికి బయలుదేరిన సామ జగన్మోహన్ రెడ్డిని నడిరోడ్డుపై అతి కిరాతకంగా నక్సల్స్ హత్య చేశారు. నల్గొండ నాగార్జున కళాశాలకు చెందిన ఏచూరి శ్రీనివాస్‌ను 1981 ఏప్రిల్లో నక్సల్స్ హతమార్చారు. 1997లో మేరెడ్డి చంద్రారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో నక్సలైట్ల తూటాలకు ఆత్మార్పణం అయ్యారు.

ఈ విధంగా జాతీయ వాదంతో దేశం పట్ల ప్రేమ, విశ్వవిద్యాలయాల విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు చేస్తున్న ఏబీవీపీ కార్యకర్తలను గన్నులతో బెదిరించినా, 40 మందికి పైగా కార్యకర్తలను పొట్టనబెట్టుకున్న ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నక్సలైట్లను ఎదురించి ఈరోజు ఏబీవీపీ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్‌గా వెలుగొందుతుంది. రాజకీయ నాయకుల హత్యలు చూసి రాజకీయాలు చేయాలంటే భయపడే పరిస్థితి ఆరోజు... కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏబీవీపీ చేసిన కృషి అమోఘం.

నంబర్ వన్ ఆర్గనైజేషన్

ఏబీవీపీ 54,85,514 మంది సభ్యులను కలిగి, దేశవ్యాప్తంగా వివిధ నిర్మాణాత్మక కార్యక్రమాల ద్వారా ప్రపంచంలోనే No.1 స్టూడెంట్ ఆర్గనైజేషన్‌గా గుర్తింపు పొందింది. కాలానుగుణంగా వచ్చే వివిధ రకాల మార్పులను స్వీకరిస్తూ అధునాతనమైన ఆర్గనైజేషన్‌గా విద్యార్థుల చేత వేనోళ్ళ కొనియాడబడుతూ ఉంది. విద్యార్థులలో నూతనత్వం, సృజనాత్మకతను పెంపొందించడం కోసం, విద్యార్థి సర్వాంగీన ఉన్నతి, విశ్వగురువుగా భారత దేశాన్ని మన కనులారా వీక్షించేందుకు, వివేకానంద కలలు కన్న భారతాన్ని పునఃనిర్మించేందుకు విద్యార్థుల వివిధ రకాల అభిరుచులకు అనుగుణంగా విద్యార్థి పరిషత్ వివిధ ఫోరమ్స్ (ఆయామాల) ద్వారా జాతీయ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్క విద్యార్థిని ఏబీవీపీ భాగస్వాములను చేస్తూ ఉంది.

ఏకాత్మ భావన పెంపుదలే ధ్యేయం

నేటి విద్యార్థి రేపటి పౌరుడు అనేది గతం, నేటి విద్యార్థి నేటి పౌరుడే అనే స్పృహతో ప్రస్తుతం సమాజంలోని అనేక సమస్యలపై అవగాహనతో స్పందిస్తూ, పరిష్కారాలను చూపే విధంగా విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే విద్యార్థి పరిషత్ ధ్యేయం. విద్యార్థి, టెక్నాలజీ, వైద్య, సామాజిక, కళా మొదలైన రంగాల్లో సమాజంతో మమేకమవుతూ, ప్రత్యక్షంగా అనుభూతి చెందుతూ ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా, ఏకాత్మ భావనను పెంపొందించే విధంగా ఏబీవీపీ కృషి చేస్తుంది.

(నేడు ఏబీవీపీ జాతీయ విద్యార్థి దినోత్సవం)

జీవన్, పరిశోధక విద్యార్థి ఓయూ

తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ కన్వీనర్ - ఏబీవీపీ

88850 99930


Similar News