860 ఏళ్ల వేయిస్తంభాల గుడి
860 ఏళ్ల వేయిస్తంభాల గుడి... thousand-pillared temple is 860 years old
కాకతీయ చరిత్రకు భారతదేశ చరిత్రలో రావాల్సిన ప్రాధాన్యం రాలేదు. కానీ కాకతీయ రాజులు ప్రజలకు సుఖ సంపదలను సమకూర్చి ప్రజాహితమైన రాజ్యపాలన చేశారు. తన పరిపాలన అంతా సమాజ సర్వతోముఖాభివృద్ధి కోసం నిర్వహించారు. భారతదేశ చరిత్రలోనే మిక్కిలి తేజోవంతమైన ఘట్టాలలో కాకతీయ పాలన ఒక ఇతిహాస పార్శ్వం. ఈ రాజవంశం సార్వభౌమాధికారంతో, దక్షిణ భారతదేశంలో ప్రధాన భూభాగాన్ని పరిపాలించినారు. హనుమకొండ తర్వాత ఓరుగల్లును రాజధానులుగా చేసుకొని ప్రజల భాగస్వామ్యంతో పాలన కొనసాగించారు. భూమిని సస్యశ్యామలంగా చేసేందుకు ఊరూరా తటాకాలను నిర్మించి ఎన్నో వేల చెరువుల ద్వారా నిరాటంకంగా పొలాలకు, జనాలకు జీవనాన్ని అందించారు. ఈ గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను మనం నిలుపుకోలేకపోయినా ఉన్నంతలో అవి ఈ ప్రాంత జనుల పంటచేల దాహార్తిని తీరుస్తున్నాయి. కాకతీయుల నిర్మాణాలలో దేవాలయాలు, కోటలు, వరగలులు, చెరువులు, సంస్కృతి చిహ్నాలు ఎన్నో కానవస్తున్నాయి. నాటి శిల్పకళా వైభవానికి నిదర్శనాలుగా వివిధ దేవాలయాలు, ఓరుగల్లు కోట కనిపిస్తున్నాయి.
కాకతీయ ప్రభువులు తాముగా నిర్మించిన ఆలయాలు, త్రికూట, పంచకూట ఆలయాలు శైవ, వైష్ణవాలే కాక సౌరదైవతం కూడా హనుమకొండలోని రుద్రేశ్వరాలయంలో ప్రతిష్ఠించారు. కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా 860 ఏళ్ల క్రితం ఓరుగల్లులో నిర్మించిన రుద్రేశ్వరస్వామి దేవాలయంలోని వెయ్యి స్తంభాల గుడి ఈనాటికీ దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. 1163 వ సంవత్సరంలో జనవరి 19వ తేదీన రుద్రసేన మహారాజు కాకతీయుల కాలం నాటి శిల్ప కళా రీతికి అద్దం పట్టే విధంగా ఈ గుడిని హనుమకొండ నడిబొడ్డున నిర్మించారు. ఈ ఆలయానికి చుట్టూ లెక్కకు మిక్కిలి చెక్కిన శిల్పాలను తిలకించేందుకు వీలుగా సుమారు పది అడుగుల ప్రదక్షిణ పథాన్ని తొమ్మిది అడుగుల ఎత్తైన ద్వారాన్ని నిర్మించారు. రుద్రేశ్వరాలయం ముఖ ద్వారం మీద మనోహరమైన వివిధ భంగిమల్లో దేవతామూర్తుల శిల్పాలు చెక్కారు.
రామప్ప ఆలయంలో దశావతారాలు వాసు దేవాలయం ముందున్న ఐరావతంపై ఇంద్రుడు మొదలైన శిల్పాలు శోభాయమానంగా తీర్చిదిద్దబడ్డాయి. ఒక్కొక్క బొమ్మను పరీక్షగా చూడాలంటే కొన్ని రోజులు పడుతుంది. త్రికూట ఆలయాల మధ్య ఒక నల్లరాతి చెక్కడం పరిపూర్ణ వలయాకార దర్పణం లాగా కనిపిస్తుంది. ఇక్కడ వృషభ రాజు విగ్రహం సొంపులు సోయగాలు చూసి తీరవలసిందే. ఆలయానికి ఈశాన్య దిశలో రాతి కట్టు మెట్లు గల దిగుడు బావి కాకతీయుల కాలం నాటి నిర్మాణ కౌశలానికి నిదర్శనంగా ఈ నాటికి నిలిచి ఉంది. రుద్రేశ్వరస్వామిగా, కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా తరతరాలుగా భక్తుల విశ్వాసం.
ఈ ఆలయాన్ని ఎంతో మంది పీఠాధిపతులు, స్వామీజీలు, హిందూమత ప్రచారకులు, సాహితీవేత్తలు, కళాకారులు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, విదేశీయులు, ప్రముఖ వ్యక్తులు తరచు దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించిన వారికి మళ్ళీ రావాలనే ప్రేరణ కలగడం విశేషం. జీవం ఉట్టిపడే కాకతీయ నంది. కాకతీయుల శిల్ప శైలికి పతాక ఇది మన దైవ వారసత్వ సంపదలో తెలుగు వారందరినీ ఒకే ఛత్రం కిందికి తెచ్చేందుకు ఎంతో కృషి చేశాడు. తెలుగు జాతి సమైక్యతకు ప్రతీకగా ఈ ఆలయం ఇప్పటికీ భాసిల్లుతోంది.
హనుమకొండ లోని రుద్రేశ్వరాలయం (వెయ్యి స్తంభాల గుడి) నిర్మాణం జరిగి నేటికి 860 ఏళ్లు
కొలనుపాక కుమారస్వామి,
వరంగల్.
9963720669.
Also Read....