విద్యావ్యవస్థలో ఈ సంస్కరణలు ఆవశ్యం

These reforms are necessary in the education system

Update: 2023-12-14 00:00 GMT

21వ శతాబ్దపు అవసరాలు, నాలుగవ పారిశ్రామిక విప్లవ డిమాండ్లకు అనుగుణంగా జ్ఞాన రంగంలో భారత దేశాన్ని గ్లోబల్ సూపర్ పవర్‌గా రూపాంతరం చెందించడమే లక్ష్యంగా నూతన విద్యావిధానం 2020 (ఎన్‌ఈపీ)ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. రాబోయే కాలంలో బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాతావరణం, ఫుడ్, ఎనర్జీ, వాటర్, శానిటేషన్ వంటి రంగాల్లో నిపుణులకు మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేసింది. కావున ఈ రంగాల్లో స్కిల్డ్ లేబర్‌ను తయారుచేసే విధంగా ఉన్నతవిద్యలో భారీ మార్పులు చేయాలని పాలసీ సిఫార్సు చేసింది. దేశంలో సుమారు 50 వేలకు పైగా ఉన్నత విద్యా సంస్థలు ఉండగా, చాలా వాటిలో ఒకే ఒక కోర్సుతో ధనార్జనే ధ్యేయంగా నడుస్తున్నాయి. ఇంకా వీటిలో నాణ్యమైన బోధన జరగకపోవడం, కొన్నింట్లో 100 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉండటం, క్వాలిఫైడ్ టీచింగ్ స్టాఫ్ లేకపోవడం, తగిన సదుపాయాలు లేకపోవడం, సైన్స్- సోషల్ సైన్స్ సబ్జెక్టుల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండటం వంటివాటిని ప్రధానమైన సమస్యలుగా పేర్కొంది. అందువల్ల ఉన్నత విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఒక బృహత్తర ప్రణాళికను ఎన్ఈపీ-2020 రూపొందించింది. దానిలో భాగంగా అన్ని ఉన్నత విద్యా సంస్థలు 2040 వరకు రకరకాల కోర్సులు స్టార్ట్ చేస్తూ, కనీసం 3 వేలమంది విద్యార్థులను చేర్చుకొని అమెరికాలోని ఐవీలీగ్, స్టాన్ ఫర్డ్, ఎం‌ఐటిల్లాగామల్టీ డిసిప్లినరి (బహుళవిషయ పరిజ్ఞానం) యూనివర్సిటీ కాలేజీలుగా మార్చాలని సిఫార్సు చేసింది. ఈ విషయంలో ప్రాచీన భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి కెక్కిన నలంద, తక్షశిల యూనివర్సిటీలను ఆదర్శంగా తీసుకోవాలని పాలసీ పేర్కొంది.

ముఖ్య సిఫార్సులు

దేశంలోని ప్రస్తుతమున్న ఉన్నత విద్యా సంస్థలను వాటికి ఉన్న అభిరుచి, వనరులను బట్టి టీచింగ్ యూనివర్సిటీ (టియు), రీసర్చ్-ఇంటెన్సివ్ యూనివర్సిటీ (ఆర్‌యు), అటానమస్ డిగ్రీ-గ్రాంటింగ్ కాలేజీ (ఏసి) అనే మూడు రకాలుగా విభజించాలని రికమెండ్ చేసింది, ఆర్.యులు పరిశోధనపై మాత్రమే పూర్తిగా ఫోకస్ చేస్తే, టి.యులు బోధనపై ఎక్కువ ఫోకస్ చేస్తూ పరిమితంగా పరిశోధన కూడా చేస్తాయి. ఏసిలు మాత్రం డిగ్రీ స్థాయిలో బోధనపై ఫోకస్ చేస్తాయి. క్రమక్రమంగా 2035 వరకు అనుబంధ (అఫిలియేట్) కాలేజీ విధానాన్ని ఎత్తివేసి, అన్ని కాలేజీలను అటానమస్ డిగ్రీ-గ్రాంటింగ్ కాలేజీలుగా మార్చాలని దిశానిర్దేశం చేసింది. కాలక్రమేణా, ఒక కాలేజీ టియుగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ మూడు రకాల విద్యాసంస్థలకు వేర్వేరుగా అక్రిడిటేషన్ రూల్స్ రూపొందుతాయి. పరిశోధనలకు ప్రత్యేకంగా నిధుల కోసం ‘నేషనల్ రిసర్చ్ ఫౌండేషన్’ను ఏర్పాటు చేయాలని, ఉన్నత విద్య మొత్తానికి దేశవ్యాప్తంగా ఒకే ఒక రెగ్యులేటరీ సిస్టమ్ ఉండాలని, ఆన్లైన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అందించేందుకు అన్ని విద్యాసంస్థలకు అవకాశం కల్పించాలని సూచించింది. ఉన్నత విద్యలో విద్యావ్యాపారీకరణను అడ్డుకునేందుకు ‘లైట్ బట్ టైట్’ విధానాలను అనుసరించాలని రికమెండ్ చేసింది. టాప్ 100 ర్యాంకుల్లో నిలిచే ఫారిన్ యూనివర్సిటీలు, మన దేశంలో వారి క్యాంపస్‌లను స్థాపించాలని, అలాగే మన దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలు, విదేశాల్లో వారి క్యాంపస్‌లను నెలకొల్పుకోవచ్చని కూడా సిఫార్సు చేసింది.

మారనున్న డిగ్రీ, పీజీ కోర్సుల వ్యవధులు

అలాగే ఈ పాలసీ విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని డిగ్రీ, పీజీ కోర్సుల్లో చాలా మార్పులు సూచించింది. ఒక డిగ్రీ కోర్సును విద్యార్థి తనకు వీలైనప్పుడు చదువుకునేలా (మల్టిపుల్ ఎంట్రీ- మల్టిపుల్ ఎగ్జిట్), వాటిని రీడిజైన్ చేయాలని చెప్పడం ఎన్ఈపీ-2020 చేసిన మరో ముఖ్యమైన సిఫార్సు. దీని ప్రకారం, ఎవరైనా విద్యార్థి అండర్ గ్రాడ్యుయేషన్‌లో ఒక సంవత్సరం పూర్తిచేస్తే డిప్లొమా, 2 సం. లు చదివితే అడ్వాన్స్ డిప్లొమా, 3 సం.లు పూర్తిచేస్తే బ్యాచిలర్ డిగ్రీ, 4 సం.లు చదివితే ‘డిగ్రీ విత్ రీసెర్చ్’ లాంటి సర్టిఫికేట్లు అందిస్తారు. అయితే పాలసీ మాత్రం 4 సం.ల డిగ్రీకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది. నిజానికి 4 సం.ల డిగ్రీ చేసినవారికి విదేశాల్లో మాస్టర్ డిగ్రీ చేయడానికి మార్గం సులభమౌతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కూడా మార్పులు చేసింది. 3 సం.ల డిగ్రీ చేసిన వారు 2 సం.ల పీజీ, 4 సం. డిగ్రీ చేసినవారు 1 సం. పీజీ, 12వ తరగతి తర్వాత అయితే 5 సం.ల ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలని నిర్దేశించింది. అంతేకాకుండా విద్యార్థి ఒక కాలేజీ యూనివర్సిటీ నుండి మరో కాలేజీ యూనివర్సిటీకి వెళ్ళేందుకు స్వేచ్చ కల్పించింది. దీనికోసం ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్’ (ఏబిసి)ని ఏర్పాటు చేసి విద్యార్థులు సాధించిన క్రెడిట్లను డిజిటల్ రూపంలో భద్రపరచాలని సిఫార్సు చేసింది. దీని ద్వారా విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడైనా, వారికి నచ్చిన విద్యా సంస్థలో సులువుగా జాయిన్ అయ్యే వీలు కలుగుతుంది. ఇక రీసెర్చ్ కోర్సుల విషయానికి వస్తే, ఎంఫిల్‌ను మొత్తానికే తొలగించాలని, పీజి పూర్తిచేసిన వారు డైరెక్ట్‌గా పీహెచ్‌డి చేయవచ్చని రికమెండ్ చేసింది.

ఇక్కడ అమలుకాని ఎన్ఈపీ

తెలంగాణలోని సెంట్రల్, డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలు ఎన్‌ఈపీ 2020ని ఫాలో అవుతున్నాయి. కానీ, విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉండటం, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయక పోవడం వల్ల తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఉన్నత విద్యా సంస్థలైన ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఇతర కాలేజీలు, ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఎన్‌ఈపీ 2020 అమలు కావడం లేదు. కనీసం ఎన్‌ఈపి 2020 చేసిన సిఫార్సులను ఏ రకంగా అమలుచేయాలో ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడానికి అధ్యయన కమిటీలు కూడా వేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుంభనంగా వ్యవహరిస్తున్నది. మరోవైపు యూ‌జీసీ, ఎన్‌ఈపీ 2020 సూచించిన విధంగా దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా డీమ్డ్ యూనివర్సిటీలకు, పీజి కోర్సులకు, బహుళ విషయక ప్రాంగణాలకు, పరిశోధన బోధనకు, విదేశీ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యానికి, విదేశీ విశ్వవిద్యాలయాల స్థాపనకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణలో ఎన్‌ఈపీ 2020 అమలైతే, ప్రస్తుతమున్న ప్రైవేట్ అటానమస్ కాలేజీలు డిగ్రీ-గ్రాంటింగ్ కాలేజీ (ఏసి) క్లస్టర్ యూనివర్సిటీ టీచింగ్ యూనివర్సిటీలుగా కన్వర్ట్ అవ్వాలని ఎదురుచూస్తున్నాయి. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేటట్లు లేదని భావించి, రాష్ట్రంలోని కొన్ని కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీగా మారేందుకు మొగ్గుచూపుతున్నాయి. గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్‌లో విదేశీ విశ్వవిద్యాలయాలు వారి క్యాంపస్‌ను నెలకొల్పడానికి ఆసక్తి కనబరుస్తాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వంఎన్‌ఈపి 2020ని అమలుచేస్తేనే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. తద్వారా తెలంగాణ విద్యార్థులు విదేశాలకు వలసవెళ్ళడం తగ్గి, తక్కువ వ్యయప్రయాసలతో విదేశీ విద్యను ఇక్కడే పొందవచ్చు. ఇలా ఎన్‌ఈపి 2020 తెలంగాణలో ఇంకా అమలుకు నోచుకోకపోవడంవల్ల విద్యార్థులు గుణాత్మక విద్యకు దూరమై, వారు ప్రపంచ మార్కెట్‌కు తగినట్టుగా నైపుణ్యాలు పొందలేకపోతున్నారు. కానీ బి‌ఆర్‌ఎస్ సర్కారు ఆ దిశగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కనీసం కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎన్ఈపీ-2020ని అమలు చేయడానికి ముందడుగు వేయాలని ఆశిద్దాం.

-డా. శ్రీరాములు గోసికొండ,

అసిస్టెంట్ ప్రొఫెసర్,

9248424384

Tags:    

Similar News