గురుకులాల కన్న కులమెరుగని విద్యాలయాలే మిన్న!
స్వేచ్ఛా, సమానత్వం, మానవత్వం, సోదరభావం, ఐక్య మత్యంతో కూడిన లౌకికవాద చదువులు 20 ఏండ్ల కిందటి వరకే చూశాం. నాటి చదువుల్లో హిందువులు
స్వేచ్ఛా, సమానత్వం, మానవత్వం, సోదరభావం, ఐక్య మత్యంతో కూడిన లౌకికవాద చదువులు 20 ఏండ్ల కిందటి వరకే చూశాం. నాటి చదువుల్లో హిందువులు, ముస్లింలు, దొరలు, దళితులనే తేడా లేదు. విద్యార్థు లందరికీ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలే దేవాలయం. కానీ నేడు కులమెరుగని ఆనాటి విద్యాలయాలకు నేడు ఆదరణ లేదు. విద్యాలయాలను కులానికొక్కటిగా విడదీసి బోధించే గురుకులాలనే ఆదరిస్తున్నాయి ప్రభుత్వాలు. కుల గురుకులాల కన్న - కుల మెరుగని ఆనాటి ప్రభుత్వ విద్యాలయాలే మిన్న! ‘కుల గురుకులాలకు 30 చోట్ల, కులానికి ఒక్కటి చొప్పున 120 సమీకృత భవనాలు, రూ.5000 వేల కోట్ల ఖర్చుతో నూతనంగా పుట్టుకొస్తుండడం స్వాగతించే విషయమే అయినప్పటికీ, కుల ప్రాతిపదికన లేని ప్రభుత్వ కాలేజ్‌లు, పాఠశాలలు మాత్రం అభివృద్ధి చెందలేకపోతున్నాయి.
‘కార్పొరేట్ కళాశాలలు, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ బడులు, సాంఘీక సంక్షేమ పాఠశాలలు, బీసీ వెల్ఫేర్, ఎస్.సి గురుకులం, ఎస్.టి- ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ రెసిడెన్షియల్, జ్యోతిబాపూలే, ఇలా కులానికొక్క గురుకులం, దానికి తోడు మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ పాఠశాలలు, వీటన్నిటింలో తరగతులు ఉన్నతీకరించి ఇంటర్ విద్యా ప్రారంభం, ఇప్పుడు సమీకృత గురుకులాలు, రేపు సెమీ రెసిడెన్షియల్స్..! వీటికేనా అభివృద్ధి.? నిధులన్నీ వీటికే కేటాయిస్తే ప్రభుత్వ జిల్లా పరిషత్ హైస్కూల్స్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవిష్యత్ ఎలా..?’
నో అడ్మిషన్ బోర్డులు ఉండేవి..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివిన ప్రముఖ జాతీయ, రాష్ట్ర నాయకుల్లో భారత మాజీ ఉప రాష్ట్రపతులు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని పీ.వీ.నర్సింహరావు, తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్, ప్రజాకవి కాళోజీ, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ఆర్, ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తదితరులు సైతం ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలల్లో చదివారు. వీరే కాక ఇందులో చదివిన ఎందరో రాజకీయంగా, వ్యాపార పారిశ్రామిక వేత్తలుగా, ఉన్నత స్థాయి పరిపాలన అధికారులుగా జాతీయ స్థాయిలో ఎదిగిన వారెందరో.!
వీటిల్లో కుల, మత, వర్గ, భేదం లేదు. ధనిక, పేదా తేడాల్లేవు, ప్రభుత్వ విద్యాలయాలైన జిల్లా పరిషత్ హైస్కూల్స్, జూనియర్ కాలేజ్‌లలో ప్రవేశం దొరకాలంటే పాసైన మార్కులతో పాటు పెద్ద పైరవీలే నడిచేవి. పాఠశాలల్లో కూర్చోవడానికి స్థలం లేకుంటే బెంచీలు, కుర్చీలు, ఏదో ఒకటి విరాళంగా ఇచ్చి ప్రవేశం పొందేవారు. కొన్నిచోట్ల ‘నో అడ్మిషన్’ బోర్డులు చూసే వాళ్లం! ఆ ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన, సంస్కారవంతమైన చదువుతో పాటు, విశాలవంతమైన ఆట స్థలం మానసిక శారీరక ఎదుగుదలకు దోహదపడ్డాయి. ఒత్తిడిని తట్టుకొనే శక్తిని నరనరాన నింపాయి. ప్రభుత్వ కళాశాలలో చదివితే ఎక్కడైనా బతకచ్చనే గట్టి భరోసా నిచ్చాయి, లౌకిక, సామాజిక అవగాహనను పెంచాయి. వినయ విధేయతలు, కుటుంబ బాధ్యతలు నేర్పించాయి.
దాదాపు అద్దె భవనాలే..!
పదేండ్ల కిందట చాలా తక్కువ సంఖ్యలో ఉన్న గురుకుల పాఠశాలలు, కళాశాలలు తెలంగాణ ఏర్పడ్డాక గత సర్కారు గురుకుల వ్యవస్థ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ చదువుల పేరుతో కొత్త కొత్త పాఠశాలల వైపే మొగ్గు చూపింది, రకరకాల పేర్లతో కులానికి ఒక్కొటిగా సాంఘీక సంక్షేమ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా, కస్తూర్బాగాంధీ పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయడం, మైనారిటీ పాఠశాలలు, మహాత్మ జ్యోతిబాపూలే, గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలనే అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ కళాశాలలను, హైస్కూల్స్ అభివృద్ధిని మరిచారు. ఈ గురుకుల పాఠశాలల అన్నింటిలో జూనియర్ కాలేజ్‌లకు అనుమతులిచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలను గాలికి వదిలేశారు. ప్రభుత్వ శాఖల్లోని విద్యా వ్యవస్థలోనే విద్యార్థుల అడ్మిషన్ల కోసం ఒకరికొకరు పోటీపడేలా చేసారు. అయితే, ఈ విద్యాలయాలన్నీ దాదాపు 70 శాతం అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు రాష్ట్రం మొత్తంలో 1022 ఉంటే వీటిలో కేవలం 394కు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. అదే ప్రభుత్వ హైస్కూల్స్ 26 వేలకు పైన, జూనియర్ కాలేజ్‌లు 422, ఇవన్నీ దాదాపు సొంత భవనాల్లోనే నడుస్తున్నాయి. కానీ గత సర్కారు వీటి పట్ల నిర్లక్ష్యం వహించింది.
కార్పొరేట్ విద్యను కట్టడి చేయకపోతే..
అందుకే ప్రస్తుత ప్రభుత్వం వీటి అభివృద్ధి కోసం ఆలోచించాలి. ఢిల్లీలోని పాఠశాలలను కేజ్రీవాల్ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసినట్లే తెలంగాణలోనూ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం గత నెలలో సమీకృత గురుకులాల పేరుతో మొదట 46 నియోజకవర్గాల్లో ఒక్కో గురుకులం 20 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొన్న ఐదు వేల కోట్లతో 30 చోట్ల 120 భవనాలు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రకటించారు. ఇంత పెద్ద మొత్తంలో లక్షల కోట్లలో చదువు కోసం బడ్జెట్ కేటాయించే ముఖ్యమంత్రి ఆలోచన స్వాగతించేదే.. అయినప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యను కట్టడి చేయకుండా ఇలాంటివి నిర్మిస్తే ఏ మేరకు ఫలితాలుంటాయో చెప్పలేము.! పైగా ఇవన్నీ చేపడితే జిల్లా పరిషత్ హైస్కూల్స్, జూనియర్ కళాశాలలు భవిష్యత్‌లో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయమై ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, విద్యావంతులు మేధావులు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను కాపాడాల్సిన అవసరం ఉంది.
- సయ్యద్ జబీ (లెక్చరర్)
ప్రభుత్వ అధ్యాపక సంఘ (మైనారిటి విభాగ) రాష్ట్ర అధ్యక్షులు
99493 03079