మహిళా బిల్లు సరే.. మరి ఓబీసీ బిల్లు!
The women's bill is ok .. but what happened to the OBC bill
మహిళలు దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న, చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. ఈ బిల్లు వెనక బీజేపీ అగ్ర నాయకత్వం చొరవ, కృషి అధికంగా ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వం గత నాలుగు దశాబ్దాలుగా ప్రధాన డిమాండ్ ఉన్న ఓబీసీ బిల్లును మాత్రం ఆమోదించడం లేదు.
ఎన్‌డీఏ ప్రభుత్వానికి దేశంలోని ఓబీసీలు.. జనాభా లెక్కించాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పరచాలని, స్థానిక సంస్థలలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని అనేక విజ్ఞప్తులు చేశారు. అయితే వాటిలో ఏ ఒక్కదానిపై మోడీ సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఎన్నో ఎండ్ల కలగా ఉన్న మహిళా బిల్లును ఆమోదించగా, ఎన్నో ఎండ్ల నుంచి ఓబీసీలకు కలగా ఉన్నా ఓబీసీ బిల్లును విస్మరించడం పట్ల దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలు రగిలిపోతున్నారు.
ఓబీసీలపై పాలకుల శీతకన్ను
దేశానికి స్వాతంత్రం లభించి డెబ్బై ఆరు సంవత్సరాలు గడిచాయి. కానీ రాజ్యాధికారం వీరి జనాభా దామాషా ప్రకారం అందడం లేదు. దేశ జనాభాలో ఓబీసీలు యాబై రెండు శాతానికి పైగా ఉన్నారు. వీరు కులవృత్తులు ఆధారంగా జీవనం సాగిస్తుంటారు. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ మూలంగా ఓబిసీల కులవృత్తులు అత్యధిక భాగం కుదేలయిపోయాయి. తద్వారా ఓబీసీల జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారిపోతున్నాయి. ఓబీసీలకు విద్య, ఉద్యోగాలలో మూడు దశాబ్దాల క్రితం 1992లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించారు. నాటి నుంచి నేటి వరకు ఓబీసీల జనాభా దేశవ్యాప్తంగా రెండు రెట్లు పెరిగింది. అయినా విద్య, ఉద్యోగాలలో ఓబిసీ రిజర్వేషన్లను కేంద్ర పెంచకపోవడం ఆశ్చర్యకరం. వీటిపై గత కొద్ది కాలంగా అధికార పార్టీలకు ఓబీసీ సంఘాలు పలుమార్లు విజ్ఞప్తి చేసినా అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
వీరి సంక్షేమం కోసం స్థానిక రాష్ట్రాలు సైతం నామమాత్రంగానే నిధులు కేటాయిస్తున్నాయి. యాబై రెండు శాతం పైగా జనాభా ఉన్న ఓబీసీలు ఇప్పటి వరకు కేవలం పద్నాలుగు శాతం మాత్రమే రాజకీయంగా అవకాశాలు పొందారు. అందరిలాగే వీరికి రాజ్యాధికారంలో వాటా లభించినప్పుడే అణగారిన బతుకులు బాగుపడతాయి. అందుకే ఈ రిజర్వేషన్లు సాధించాలని గత నాలుగు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా కేంద్రంలోని పెద్దలు కనికరించడం లేదు! ఓబిసీల జనగణన చేయడంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది.
ఓబీసీలంటే భయమా, చులకనా?
ప్రస్తుత నారీ శక్తి వందన్ మహిళా బిల్లులో సైతం మహిళలకు రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించాలని అధికారపక్షాన్ని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ఉభయ సభల్లో కోరితే.. కేంద్ర ప్రభుత్వం గుంభనంగా వ్యవహరిస్తూ తన అభిప్రాయాన్ని ఇంతవరకూ బహిర్గతం చేయలేదు. అదే సమయంలో ఎవరూ డిమాండ్ చేయకపోయినా, ఇదే కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల వారిలో ఆర్థికంగా వెనుకబడినవారికి విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించింది. కానీ ఏండ్లుగా డిమాండ్ చేస్తున్నా ఓబిసీల సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో మేధావులకు సైతం అంతుచిక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అగ్రవర్ణ భావజాలం పేరుకుపోయి ఉన్నందునే, తమ సమస్యల పట్ల ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నట్లు దేశవ్యాప్తంగా ఉన్న ఓబిసిలు భావిస్తున్నారు.
చట్టసభల్లో ఓబిసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం ఎందుకు సంకోచిస్తుంది. ఓబిసీ లంటే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు భయమా, చులకనా లేక తమకు గడ్డం గీసే వాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, కల్లు తెచ్చే వాళ్ళు, బట్టలు నేసే వాళ్ళు, ఇంటికి ఇటుకలు మోసే వాళ్ళు భవిష్యత్తులో దొరకరని భావిస్తున్నారా? లేక వెనుకబడిన జాతుల వారు తమ పక్కన చట్టసభల్లో కూర్చోవడం ఇష్టం లేకనా? ఓబీసీలు చట్టసభల్లో రిజర్వేషన్లు కోరేది రాజ్యాలు ఏలేందుకు కాదని, వారి బతుకులు బాగు చేసుకునేందుకే అని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. మహిళా బిల్లు ఆమోదించి ఓబిసీ బిల్లును విస్మరించిన భారతీయ జనతా పార్టీనే కాకుండా ఓబిసీ రిజర్వేషన్లను వ్యతిరేకించే ప్రతి రాజకీయ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఓబిసీల ఆగ్రహానికి గురి కావాల్సిందే!
కైలసాని శివప్రసాద్
సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్
94402 03999