పీడితుల రంగస్థలం... సగటు ప్రేక్షకుడికి దిక్సూచి
భారతీయ నాటక రంగం రూపకం దగ్గరే ఆగి పోయింది. వాహకంగా మారి ప్రజల జీవితాల్లో భాగం కాలేక పోయింది. ముఖ్యంగా,గ్రామీణ ప్రాంతాల్లో ఒకనాడు ఆబాలగోపాలాన్నీ అలరించిన ఈ ప్రక్రియ తేరుకోలేనంతగా మూగబోయింది.
- దళిత బహుజన కళాతాత్విక సృజన..!
- ఒక ప్రత్యామ్నాయ ప్రజాపక్ష అభివ్యక్తి
- రూపకం దగ్గరే ఆగి పోయిన భారతీయ నాటక రంగం
- పెద్దతరంలో కొద్ది మందికే పరిమితమైన జ్ఞాపకంగా తెలుగు నాటకం
- సగటు భారతీయ ప్రేక్షకుడికి తిరుగులేని దిక్సూచి... థియేటర్ ఆఫ్ ది అప్రెస్డ్
- వీక్షకులని మొట్టమొదటిసారిగా ప్రదర్శనలో భాగం చేసిన అపూర్వ ప్రయోగం
- ప్రత్యామ్నాయ వేదికగా పీడితుల రంగస్థలం
భారతీయ నాటక రంగం రూపకం దగ్గరే ఆగి పోయింది. వాహకంగా మారి ప్రజల జీవితాల్లో భాగం కాలేక పోయింది. ముఖ్యంగా,గ్రామీణ ప్రాంతాల్లో ఒకనాడు ఆబాలగోపాలాన్నీ అలరించిన ఈ ప్రక్రియ తేరుకోలేనంతగా మూగబోయింది. కళల్ని, అభిరుచుల్ని మానవ జీవన విధానాన్ని సుసంపన్నం చేసే సాధనంగా కాక, ఏదో కాలక్షేపం కోసం ఉద్దేశించిన వ్యర్థ కార్యక్రమాలుగా భావించే 'రాజకీయ' రంగానికి సంస్కృతి అంటే మొదట్నుంచీ చిన్నచూపు. అందుకే సామాన్య ప్రజల చైతన్యానికి చేయూత నిచ్చే నాటకం అంటే వాళ్ళ నాటకాలు ఎక్కడ బయట పెడుతుందో అనే భయం. దాన్నుండే అభద్రతా భావంతో కూడిన అంతర్గత ద్వేషం. లేక పోతే ప్రపంచంలోని అనేక దేశాలు పిల్లల విద్య మొదలు కొని పౌరసమాజం ఆరోగ్యం వరకూ సాంస్కృతిక రంగంలో విభిన్నమైన ప్రయోగాలు చేసి అమలు చేస్తూ ఉంటే, మనకి మాత్రం అసలు సంస్కృతి గురించిన చర్చే ఎన్నడూ జరగదు.
పురస్కారాల కోసం మాత్రమే నాటకాలు
ఆదివాసుల సంస్కృతిలో కళలు జీవితం నుండి పరాయీకరించబడి వేరుగా ఉండవు. వాళ్ళ దైనందిన బతుకుల్లో భాగంగానే ఏ కళనైనా సృజించుకుంటారు. మొదట్లో శ్రామిక జనాల పట్ల సహానుభూతితో వారి క్షేత్ర స్థాయి సమస్యలకి ప్రతిబింబంగా వర్ధిల్లిన అభ్యుదయ నాటకం మెల్లమెల్లగా ఒక దశకొచ్చి ఆగిపోయింది. యావత్ ప్రపంచాన్ని వెల్లువెత్తి ముంచేసిన ప్రపంచీకరణ ప్రభావానికి కకావికలై బేలగా మిగిలిపోయింది. ఆ క్రమంలో, ఒకపక్క ప్రజాపక్ష బుద్దిజీవులు నాటకాలపై అధ్యయనం చేయకపోగా, మరో పక్క కార్పోరేట్ మీడియా నాటకాన్ని ద్వితీయ శ్రేణి మాధ్యమంగా, చులకనగా, హేళనగా చూపించడం జరిగింది. నాటకాల కోసం బహుమతులనే సంస్కృతి పోయి, బహుమతులు, పురస్కారాల కోసం మాత్రమే నాటకాలన్నంత దుస్థితి దాపురించింది. ఈ మొత్తం క్రమంలో కొత్తతరాలకు అసలు నాటకం అంటేనే తెలీకుండా అయిపోగా, గతాన్ని పట్టుకు వేలాడే పెద్దతరంలో కొద్ది మందికి మాత్రమే పరిమితమైన జ్ఞాపకంగా తెలుగు నాటకం మిగిలి పోయింది.
వీక్షకులని భాగం చేసుకోగలిగేదే నిజమైన కళ
ఇలాంటప్పుడే వ్యవస్థల ఉన్నతిని సంపాదనలో మాత్రమే కొలుచుకునే యాంత్రికతకి విరుద్ధంగా, ప్రజల సంతోషానికి, ఆహ్లాదానికి కళలు అవసరమనే ఆలోచన అవసరం. బాల్యంలోనే నీతి కథలు, పొడుపు విరుపులు, సామెతలు నానుడుల్ని విరివిగా ఉపయోగించే ధారణకు నాటకం ఒక బలమైన ప్రోత్సాహం. అందుకే, రంగస్థలం సజీవ మాధ్యమం (Live The atre). అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సినిమా మన కళ్ళ ముందు ఎన్ని అద్భుతాలైనా సృష్టించగలదు. కానీ, అదంతా మరొకరి 'అభిరుచి'ని ప్రేక్షకులపై రుద్దేదే కానీ వీక్షకులని భాగం చేసుకోగలిగేది కాదు, కాబోదు. ఇందుకు విరుద్ధంగా బ్రెజిల్‌కి చెందిన ఆగస్టో బోల్ ప్రతి పాదించిన థియేటర్ ఆఫ్ ది అప్రెస్డ్ (Theatre of the Oppressed) ఒక నిత్య నూతన ప్రక్రియ. వీక్షకులని మొట్టమొదటిసారిగా ప్రదర్శనలో భాగం చేసిన అపూర్వ ప్రయోగం. సాంప్రదాయిక నాటకానికి, సాంకేతిక సినిమాకి మధ్యస్థంగా మిగిలిపోయిన సగటు భారతీయ ప్రేక్షకుడికి తిరుగులేని దిక్సూచి ఈ థియేటర్ .
'మనమంతా రంగస్థలం' ... అదే 'పీడితుల రంగస్థలం'
ఆధిపత్య సమాజంలో అనేక సమూహాల అస్తిత్వాన్ని గుర్తించడమే నవీన కళాభివ్యక్తి పురోగతి. ఐతే, తెలుగులో అది కేవలం వివిధ రకాల వామపక్ష పార్టీల సమావేశాలప్పుడు వచ్చిన కార్యకర్తలు వెళ్ళిపోకుండా ఉండటం కోసం వార్ని కూర్చోబెట్టేందుకు పాటలు పాడే కొద్దిపాటి కళాబృందాలుగానే మిగిలిపోవడం గొప్ప దౌర్భగ్యం. అందుకు వ్యతిరేకంగా కళని ఒక ప్రజా ఉద్యమ వాహకంగా, సమర్థవంతమైన పనిముట్టగా ప్రవేశ పెట్టడం జరగాలి. నాటకం అంటే డైలాగులు, రసజ్ఞత, రచయితలు, ప్రేక్షకులు, రససిద్ది.. .ఇలాంటి ఆధిక్యత కలిగిన భావజాల చట్రం నుండి బయటపడి 'మనమంతా రంగస్థలం' (We are Theatre) అనే ధోరణి ముందు ప్రగతిశీల సాంస్కృతిక సంస్థలకు కల్పించాలి. ప్రపంచంలో సుమారు 70 దేశాలు 'పీడితుల రంగ స్థలం' ( థియేటర్ ఆఫ్ ది అప్రస్డ్) విధానాన్ని అనేక రీతుల్లో అభివృద్ధి చేసి వాడుకుంటూ భిన్న ప్రత్యామ్నాయ క్షేత్రాల్ని సిద్ధం చేసుకున్న చరిత్ర మన కళ్ళ ముందే ఉంది. భారతదేశంలో కూడా దాదాపు 10 కి పైబడిన రాష్ట్రాలలో ఈ ప్రక్రియను ప్రచారం చేస్తున్నారు. కాగా, ఎంతో దార్శనికత వెల్లిబుచ్చే తెలుగు సాంస్కృతిక రంగంలో మాత్రం ఈ దిశగా ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క ప్రయత్నం జరగకపోవడం మన సాంస్కృతిక వెనుకబాటు తనానికి ప్రతీక.
వీక్షకులే నటులైతే...
నిత్య జీవితంలో ఆధిపత్యాన్ని గుర్తింప జేయటం ఈ పీడితుల రంగస్థలం ప్రత్యేకత. కులం, మతం, జండర్, భాష, సమూహం, సంస్కృతి ..ఇలా అన్ని క్షేత్రాల్లో ఈసరికే గూడు కట్టు కున్న తిరోగమన భావాల్ని శరీరం, మనసు ఉప యోగించి చేసే ఆటలతో, వ్యాయామంతో పటాపంచలు చేయడం ప్రత్యా మ్నాయ రంగస్థలం బలం. నటులకీ ,ప్రేక్షకులకీ మధ్య ఉన్న తెరని తొలగించి వీక్షకుల్ని కూడా నటులుగా 'spectactors' భాగస్వామ్యం చేసుకునే విశిష్టమైన కృషి థియేటర్ ఆఫ్ ది అప్రస్డ్. మనకి తెలీకుండానే, మన ప్రమేయం లేకుండానే మనం నిర్వహించే ఆధిపత్య 'పాత్ర'ను మనచేత గుర్తింపజేసి, దాని నుండి బయట పడడానికి ఉన్న అవకాశాల్ని మన ముందు ఆరోగ్యకరమైన చర్చగా ప్రవేశపెట్టడం ఈ థియేటర్ బలం. ప్రజలంతా ఒక్కటేననీ, వీరిలో ప్రత్యేకంగా 'నిపుణత కలిగిన నటులు' ఎవరూ ఉండరనీ, ఎవ్వరైనా జీవితం లోని అణిచివేతనీ, తద్వారా తలెత్తిన చేదు అనుభవాలకి ఒక సమూహంగా రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తే అది అందరికీ అర్ధమవుతుందని ప్రత్యామ్నాయ ప్రజా రంగ స్థలం భావిస్తుంది. ఆ దిశ గానే పని చేస్తుంది కూడా.
వినోదం పేరిట ఆకట్టుకుంటున్న సాంస్కృతిక వ్యర్ధాలు
ఇదంతా ఎందుకు? ఆధిపత్య వ్యవస్థలో ఎవరికివారు నిత్యం మానవీయ సున్నితత్వాన్ని ఏర్పర్చుకోవడం ఒక నిత్య వ్యాయామం కావాలి. అమానుషత్వాన్ని స్వచ్ఛందంగా విడనాడి మళ్ళీ మానవీకరించబడాలి. (Re - humanize). ఈ ప్రక్రియలో ఎవరూ ఎవరికీ గురు శిష్యులు కారు. ఇందులో మార్గదర్శకాలు (Guidelines) తప్ప నియమాలు (Rules) ఉండవు. ఆటపాటల్లో కూడా గెలుపోటములు ఉండవు. అసలు ఆ రకమైన భాషని ఉపయోగించడమే కనిపించదు. వృత్తి, ప్రవృత్తులతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఎవరైనా ఇందులో భాగం కావచ్చు. ఆసక్తి, అభిరుచి ఉంటే చాలు. రంగు, రూపు, భాష, భావం, ఎత్తు, పొడుగు ఇవన్నీ అర్ధరహితమని అని ప్రత్యా మ్నాయ రంగస్థలం భావిస్తుంది. నిబద్ధత కలిగిన వ్యక్తీకరణ నిజాన్ని మాత్రమే చూపిస్తుంది, నిజాయితీగా మాత్రమే వ్యవహరిస్తుంది. అలా కాకపోతే ఫలానా బృందానికి ఫలానా నాటకం మాత్రమే సరైందనే భావన నెలకొంటుంది. ముఖ్యంగా, పీడిత వర్గాలైన బహుజనులకి, మహిళలకి, ఇతర జండర్లకీ జీవితాన్ని అప్రయోజన దృష్టితో చూసే వెకిలి మాధ్యమంగా, సంపాదన, కీర్తిప్రతిష్ఠల కోసం పాకులాడే చట్రంగానే 'నటన' ని పరిచయం చేస్తుంది. వయసుతో సంబంధం లేకుండా వారందరినీ ఆ మృత సంస్కృతికి బానిసల్ని చేస్తుంది. ఈరోజు మొబైల్ మొదలుకొని సామాజిక మాధ్యమాల వరకూ పిల్లల్ని, మహిళల్ని 'వినోదం ' పేరిట ఆకట్టుకునేలా చేసే సాంస్కృతిక వ్యర్ధాలు అవే.
ఆధిపత్యాన్ని ఆచరిస్తున్న సమానతా సిద్దాంతాలు
ఇందుకు విరుద్ధంగా ఒక ప్రజాపక్ష భావజాల స్రవంతిని నిర్మించే బాధ్యతను సాంస్కృతిక రంగం స్వీకరించాలి. నూతన తరహా ప్రచార కార్యక్రమాన్ని నిర్మించు కోగలగాలి. కాలం చెల్లిన వ్యూహాల్ని పక్కన పెట్టి అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రత్యామ్నాయ ప్రజాపక్ష కళాతాత్విక చింతనల్ని లోతుగా అధ్యయనం చేయాలి. భావజాలం నిర్మించడం పదజాలాన్ని వల్లించినంత సులువు కాదు. కాబట్టి, ముఖ్యంగా, విద్యార్థులు, యువత సమాజ హిత కార్యాచరణలో భాగం అయ్యేలా చూసుకోవాలి. వ్యక్తిగత జీవితంలో ఏదో రకమైన ఆధిపత్యాన్ని ఆచరిస్తూ, ఎన్నిరకాల సమానతా సిద్దాంతాలు చెప్పినా ప్రజలు వినరు. ఏ కాలంలోనైనా ప్రజలు మాత్రమే విస్తృత చైతన్యానికి ప్రతినిధులు. బహుజనులు మాత్రమే బలమైన ప్రత్యామ్నాయ శోధనకి చోదక శక్తులు. కనుక, స్వీయలోపాల సవరణకి నిజాయితీగా సిద్ధపడకపోతే సాంస్కృతికంగా మరింత క్షీణదశకు చేరతామనడంలో సందేహం లేదు. అలా కాకుండా ఉండటానికి ఇప్పటికీ ప్రగతిశీల అభ్యుదయ శక్తుల ముందు ఉన్న మార్గం ఈ ప్రత్యామ్నాయ పీడితుల రంగస్థలం.
- గౌరవ్
థియేటర్ ఏక్టివిస్ట్
పిఠాపురం
90320 94492