చాట్ జీపీటీ వరమా? శాపమా?

చాట్ జీపీటీ వరమా? శాపమా?... The Risks and Benefits of Chat GPT

Update: 2023-03-01 18:45 GMT

టీవల కాలంలో ‘చాట్ జీపీటీ’ అనే సాంకేతిక విప్లవంపై ప్రపంచవ్యాప్తంగా, అన్ని వర్గాలలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు లక్షల సంఖ్యలో, భిన్నకోణాలలో, తమ సందేహాలను, భయాలను, అభిప్రాయాలను దీనిపై వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసలు చాట్ జీపీటీ అంటే ఏమిటో దాని వల్ల మనకు లాభమా! నష్టమా! అని తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా వ్యాపించింది. దీని గుణ, గణాలపై విశ్లేషణలు కొందరు ప్రారంభించారు. అయితే దీనివల్ల వచ్చే భవిష్యత్తు పరిణామాలపై సోషల్ మీడియాలో ఊహలు వైరల్ అవుతున్నాయి.

అయితే ‘కొత్తొక వింత, పాతొక రోత’ అనే పాత సామెత మన తెలుగు వాళ్ళకు తెలిసిందే. అందుకే అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాలలో సాంకేతిక రంగంలో ‘కృత్రిమ మేధస్సు’ అభివృద్ధిపై గత కొన్ని దశాబ్దాలుగా ఎడతెగని పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఫలితాలు ఇంత వేగంగా వస్తాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. దీంతో మొత్తం అయిపోయినట్టు అనుకోవడానికి వీలు లేదు. ఈ టెక్నాలజీపై ఇంకా అనేక లోపాలను, సమస్యలను పరిష్కరించవలసినవి, సవరణలు చేయాలసినవీ చాలానే వున్నాయి. భవిష్యత్తులో పలు రంగాలలో విభిన్న రూపాలలో మెరుగైన నూతన ఆవిష్కరణలు కూడా వస్తాయి. ఈ విజ్ఞాన సాగరానికి అంతులేదు. లోతు తెలియదు. ఎంత తెలిస్తే, అంత తెలియాల్సింది ఎంతో మిగిలే వుంటుంది.

ఇప్పటికే ఈ చాట్ జీపీటీ రంగంపై మైక్రోసాఫ్ట్, గూగుల్ మొదలైన అనేక సంస్థలు, వ్యక్తులు, పలు శాస్త్ర, సాంకేతిక నిపుణులతో కలిసి ఎడతెగని పరిశోధనలు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులపై లక్షల ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. చాట్ జీపీజీ అనగా ‘జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్’ ఇది కృత్రిమ మేథస్సును కలిగి ఉంటుంది. ఇది భాషా నమూనాలను రూపొందించడంలో అత్యంత ఉత్తేజకరమైన పురోగతి కలిగిన వాటిల్లో ఒకటిగా చెప్పుకోవాలి. దీని రూపాలు, నమూనాలు అనేక పరిశ్రమలను విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాగే అనేక మార్గాల్లో మానవ జీవితాలను మెరుగు పరుస్తాయి. ఏదేమైనప్పటికీ, మానవ జీవితంలో ఏదైనా కొత్త శాస్త్ర, సాంకేతికత ప్రవేశించిందంటే, పరిష్కరించాల్సిన సంబంధిత సమస్యలు, ఆందోళనలు తలెత్తడం సహజం. కత్తి, తుపాకీ, విద్యుత్తు, అణుశక్తి మొదలైన ఆవిష్కరణలను మనిషి తన వివేచనతో ఎంత లాభపడతాడో, వాటిని దుర్వినియోగం చేస్తే అంత నష్టం కూడా ఉంటుందని నిరూపించాయి. ఈ చాట్ జీపీటీ అనే కృత్రిమ మేథస్సు ఆవిష్కరణతో కూడా అంతే లాభం, నష్టం వుంటుంది. దీనిని వాడకంపై మానవ మేధస్సు విచక్షణపై మంచి, చెడు ఆధారపడి ఉంటుంది.

జీపీటీ వల్ల ప్రయోజనాలు

మెరుగైన కమ్యూనికేషన్‌ ఏర్పరచటంలో ఈ జీపీటీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మానవ భాషను అర్థం చేసుకోవడం, కొత్త భావాలు రూపొందించడం, విభిన్న భాషలు మాట్లాడే వ్యక్తుల మధ్య సమాచారం ఇచ్చి, పుచ్చుకోవటంలో అంతరాలను తొలగించటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే వైకల్యాలున్న వ్యక్తులకు సహాయం చేయడం వంటివి చేస్తుంది. అలాగే మానవ పరిణామ క్రమంలో ఇప్పటికే అర్థశాస్త్రం, సామాజిక శాస్త్రం, గణితం, విద్య, వైద్యం, ఇంజనీరింగ్, లాజిక్, కంప్యూటర్ భాషలు, కోడింగ్ మొదలైన రంగాలలో మానవుడు సంతరించుకున్న అపార జ్ఞానాన్ని వివిధ హై కెపాసిటీ సర్వర్లలో డేటా బ్యాంకులుగా భద్రపరుస్తారు. ఈ డేటాను అత్యంత వేగంగా ప్రాసెస్ చేసి మనం అడిగే ప్రశ్నలకు ఏ రూపంలో అడిగితే ఆ రూపంలో ఈ జీపీటీ సమాధానం ఇస్తుంది. సలహాలు, సూచనలు అందిస్తుంది. అలాగే సినిమా రంగంలోనూ కథలు, మాటలు, పాటలు, కవిత్వం రాయటం, చిత్రలేఖనం, నూతన డిజైన్లు రూపొందించటం, సంగీతం సమకూర్చటం, నొటేషన్ రాయడం, డైలాగులు, స్క్రిప్ట్ రైటింగ్ మొదలైన మానవ సృజనాత్మక (క్రియేటివ్) రంగాలలో కూడా తనదైన ప్రతిభను కనపరుస్తుంది. అలాగే హెల్త్‌కేర్ రంగంలో కూడా రోగుల డేటాను విశ్లేషంచి వైద్య నిపుణులకు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహయపడుతుంది. జీపీటీ డేటాను సమర్ధవంతంగా వినియోగించి రోబోలకు సరైన సూచనలు ఇచ్చి, క్లిష్టమైన ఆపరేషన్లు సైతం చేస్తాయి.

అలాగే కస్టమర్లు కోరిన విధంగా కొత్త డిజైన్లను రూపొందించడం, సేవలలో అనుకూలమైన సిఫార్సులను అందించడం. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం, కస్టమర్ సంతృప్తి, విధేయతను పెంచడం వంటివి చేస్తుంది. అలాగే విద్యార్థులకు హోంవర్క్ చేయడంలో, ఉపాధ్యాయులకు, ప్రొఫెసర్లకు, పరిశోధకులకు విద్యా సంబంధిత వ్యాసాలు రాయటంలో, ఖచ్చితమైన అనువాదాలు చేయటంలో, గణిత సమస్యలను పరిష్కరించటంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారులకు ముడిసరుకుల లభ్యత, స్టాకు వివరాలు, వ్యాపార లావాదేవీల ఎకౌంట్స్ నిర్వహణ, ఆడిటింగ్ మొదలైన విషయాల్లో సమయం, వనరులను ఆదా చేయడంలో సహాయపడుతుంది. దీంతో గతంలో కంటే తక్కువ సమయం, శ్రమ, పెట్టండి,కలిసివస్తాయి.ఎక్కువ సౌకర్యాలు, సౌలభ్యాలు,విశ్రాంతి పొందవచ్చు.

ఇలా జీపీటీని ఏ రంగంలో‌నైనా మెళుకువతో, విచక్షణతో, పలు రంగాలకు అన్వయించి, విభిన్న క్లిష్ట సమస్యలకు పరిష్కార మార్గాలు సులువుగా పొందవచ్చు.

జీపీటీతో వచ్చే సమస్యలు

ఈ సాంకేతికత రావడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దారుణంగా దెబ్బతింటాయి. బ్యాంకులు, పరిశ్రమలు, సేవారంగాలలో ఆటోమేషన్ వచ్చి తక్కువ సిబ్బందితో పెద్ద పరిశ్రమలను యంత్రాలను నియంత్రణ చేయవచ్చు. అలాగే మనిషిని జంతువుని వేరు చేసేదే బుద్ధి, జ్ఞానం, వివేకం, విచక్షణ, మేథస్సు ఈ టెక్నాలజీ కి అలవాటు పడితే మనిషి బద్ధకస్తుడవుతాడు. మనిషి సృజనాత్మక శక్తిని కోల్పోయి యాంత్రిక జీవిగా, పరాన్నజీవి గా మారే అవకాశం ఉంది. అలాగే జీపీటీ నిర్ణయాత్మక ప్రక్రియ అపారదర్శకంగా ఉంటుంది. దీనిని అర్థం చేసుకోవడం కష్టం. అలాగే జీపీటీ తప్పుడు సమాచారాన్ని సృష్టించగలదు , వ్యాప్తి చేయగలదు, తప్పుడు మార్గం సూచించగలదు. రాజకీయ తిరుగుబాటు లేదా ప్రజారోగ్య సంక్షోభాల వంటి తీవ్రమైన పరిణామాలు కలిగించవచ్చు.

అలాగే ఈ టెక్నాలజీ నేరస్థుల చేతిలో పడితే ఆర్థిక, రక్షణ రంగాలలో సమస్యలు వస్తాయి. అధునాతన ఫిషింగ్ దాడులు, సైబర్ నేరాలు, ఆడియో, వీడియో, ఫోటో మార్ఫింగులు ఇతర భద్రతా ఉల్లంఘనలను సృష్టించడానికి ఉపయోగించవచ్చు.

ఏది ఏమైనా, మానవ ప్రగతిని, మేథస్సును, శాస్త్ర సాంకేతిక రంగాలలో వచ్చే విప్లవాత్మక మార్పులను ఆపలేము. మనిషి శారీరకంగా, భౌతికంగా శ్రమ చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాడు. కానీ మనిషి తన జ్ఞానంతో వివిధ వాహనాలను, యంత్రాలను, పరికరాలను కనిపెట్టి శారీరక శ్రమను తగ్గించుకొని, సౌఖ్యానికి అలవాటుపడి, భోగలాలస పెరిగి రోగాలు కొనితెచ్చుకుంటున్నారు. గతంలో మనిషి మెదడు ఉపయోగించి ఎన్నో వేదాలు, శ్లోకాలు నోటికి చెప్పేవాడు కానీ సాంకేతిక జ్ఞానం పెరిగి సెల్‌ఫోన్లు వచ్చాక సుఖం మరిగి నలుగురి నెంబర్లను చెప్పలేకపోతున్నాడు.

ఇప్పటి జీపీటీ అనే సాంకేతిక విప్లవాన్ని మనిషే కనుగొన్నాడు. మనం ఆలోచించడం మానేసి ప్రతి మేథోమధనానికి దీనినే వాడితే కొంత కాలానికి మన మెదడు మొద్దుబారి మన మాట వినదు. అలాగే దీని ద్వారా మనిషి అనేక రంగాలలో అద్భుతాలు సృష్టించవచ్చు. మనిషి తన వివేచన, విచక్షణ కోల్పోయి స్వార్ధపరుడైతే మాత్రం అంతే కష్టాలు, నష్టాలు కూడా చవిచూడాల్సి వస్తుంది. అంతా మన చేతుల్లోనే ఉంది.

డా.కోలాహలం రామ్ కిశోర్

9849328496

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Tags:    

Similar News