ఆశలు కల్పిస్తే... ఆత్మహత్యలు తగ్గుతాయి!
The importance of hope in suicide prevention
కుటుంబ కలహాలతో కొందరు, అనారోగ్యంతో ఇంకొందరు, పేదరికం,అప్పులబాధతో మరికొందరు, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్.. ప్రేమలో విఫలం. ఇష్టంలేని పెళ్లితో ఇంకొందరు..వరకట్న వేధింపులు,.అవమానం, ఆవేశం ఇలా కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడిలో బలహీనమైన క్షణంలో, బలమైన నిర్ణయాలతో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్న వారి సంఖ్యా రోజు రోజుకీ పెరుగుతూన్నదే తప్ప తగ్గడం లేదు! చనిపోయే ముందు ఒక్క క్షణం వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది . ఆ క్షణంలో నింపాదిగా ఆలోచిస్తే వేలాది మంది బతికి బయటపడేవారు! ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కును కోల్పోయి చేతికాడికి అందివచ్చిన బిడ్డలు దూరమైన తల్లిదండ్రుల, కుటుంబ సభ్యులు దుర్భర జీవనం చూస్తే గుండె తరుక్కుపోతుంది, కానీ కాపాడాల్సిన ప్రభుత్వాలు, సమాజం ఇది తమ బాధ్యత కాదనుకుని బీమా పథకాల ద్వారా చేతులు దులుపుకుంటున్నాయి. అలా కాకుండా ఆత్మబలిదానాలు వద్దు చర్య ద్వారా ఆశను కల్పించండి తద్వారా చాలామందిని ఆత్మహత్యల నుంచి కాపాడవచ్చనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా నేడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
30 సెకండ్లకు ఒక ఆత్మహత్య!
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలో సంవత్సరానికి 8 లక్షల మంది పైగా, అంటే ప్రతి 30 సెకనులకు ఒకరు ఆత్మ బలిదానం చేసుకుంటున్నారు. ప్రపంచంలో జరిగే ప్రతీ 4 ఆత్మహత్యల్లో ఒకటి భారత్‌లోనే నమోదవుతోంది. ప్రపంచంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న వారిలో 15 నుంచి 30 ఏళ్లలోపు వారే ఎక్కువ కావడం, ముఖ్యంగా మహిళల కంటే పురుషులే ఎక్కువ ఉండడం గమనించాల్సిన విషయం.
దేశంలో.. నిమిషానికి ముగ్గురు!
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2021 భారతదేశంలో సగటున ప్రతి రోజూ 450 మంది, గంటకు 18.7 మంది, ప్రతి ఒక్క నిమిషానికి 3 కి పైగా అర్థాంతరంగా బలవుతున్నారు. ఇక పురుషులు సగటున రోజుకి 326 మంది, గంటకు 13.6 మంది, ప్రతి 4.4 నిమిషాలకు ఒకరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా, మహిళలు మాత్రం సగటున రోజుకి 124 మంది, ప్రతి గంటకు 5.1 మంది, అనగా ప్రతి 12 నిమిషాలకు ఒక మహిళ ఆత్మహత్యలకు బలవుతున్నారు. 2021లో పురుషులు 1,18,979 కాగా ఆత్మహత్య చేసుకున్న మహిళలు సంఖ్య 45.260.
అలాగే రైతులు, రోజువారీ కూలీ కార్మికులు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలోనే తెలంగాణ నాల్గవ స్థానంలో ఉంది, మొత్తం ఆత్మహత్యల రేటులో 2021లో 26% పెరుగుదలతో ఆత్మహత్యల మరణాలలో రాష్ట్రం ఆరవ స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో ఆత్మహత్యల శాతం ఎన్నడూ లేనంతగా 43% ఉండటం బాధాకరం!
చిన్న చిన్న సమస్యలకే!
చాలా చిన్న కారణాలకే కొందరు తమ ఉసురు తీసేసుకుంటున్నారు.గతంతో పోల్చితే నేటి ఆధునిక సమాజంలో కూడ ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పాశ్చాత్య ప్రభావం, మానవ సంబంధాలు - ఆర్థిక సంబంధాలుగా మారిపోవడం. గతంలో తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు మాత్రమే అఘాయిత్యానికి ఒడిగట్టేవారు. ఇప్పుడు చిన్న సమస్యకూ చావే పరిష్కారమని భావిస్తున్నారు.డబ్ల్యూహెచ్ ఓ ప్రకారం 15-19 సంవత్సరాల యువత చనిపోవడానికి ప్రధాన కారణం ఆత్మహత్యలే! ప్రపంచ ఆత్మహత్య కేసుల్లో 77% కేసులు అల్ప, మధ్య ఆదాయ వర్గాల నుంచే ఉంటున్నాయి.
ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులు ఎన్నో ఉన్నప్పటికీ.. వాటిని ముందుగా గుర్తిస్తే మంచిది. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఒంటరిగా , ఏకాంతంగా ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతారు. అలాగే తరచూ మరణం గురించి మాట్లాడే వారి సమస్యలను గుర్తించి ధైర్యాన్ని ఇవ్వాలి! అలాగే ఇదివరకు ఆత్మహత్యకు ప్రయత్నించిన వారి పట్ల జాగ్రత్తతో ఉండాలి. లక్ష్యసాధనలో విఫలం చెందిన వారిని గుర్తించి ఆత్మీయతతో పలకరించాలి. వారి పట్ల నిర్లక్ష్యంగా అవమానంగా అవహేళనగా ప్రవర్తించవద్దు. ఆవేశపరులపై ప్రత్యేకమైన దృష్టి సారించాలి. వారు ఆవేశంలో ఆత్మహత్య చేసుకునే అవకాశాలు అధికం! ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి అనుభవం ఉన్న మానసిక వైద్య నిపుణుల దగ్గరికి తీసుకువెళ్ళాలి! అలాగే ఆత్మహత్యలు చేసుకునేవారు ఏ సమస్యను కూడా తీవ్రంగా ఆలోచించకూడదు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మానసిక ప్రశాంతత కొరకు యోగా, మెడిటేషన్, వాకింగ్, జాగింగ్ లాంటివి రెగ్యులర్‌గా చేయడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.
చేయూతనిస్తే చేజారదు...
తెలంగాణ ముందు, తెలంగాణ వచ్చాకా ఆత్మహత్యలు మరింతగా పెరిగిపోతున్నాయి. నేటికి కూడా ఉద్యోగాల కోసం యువత, అప్పులు తాళలేక రైతుల ఆత్మహత్యలలో మార్పులేదు. రైతుబీమా, చేనేత బీమా అంటూ చనిపోతే పైసలు అంటున్నారే తప్ప చావకుండా ప్రభుత్వాలు కనీస చర్యలు, అవగాహన కార్యక్రమాలు తీసుకోకపోవడం ఆక్షేపణీయం. ఒక వ్యక్తి తీవ్రమైన మనోవేదనకు గురైనప్పుడు, సమస్యకు పరిష్కారం లభించనప్పుడు, ఏం చేయాలో అర్థం కాక ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక అగమాగమై. ఆఖరుకు ఏం చెయ్యాలో తెలియని అయోమయ స్థితికి చేరుకొని ఆ బలహీన క్షణంలో బలవన్మరణానికి బలవుతున్నారు. ప్రభుత్వాలు, సమాజం కూడా ఆత్మహత్యలపై కనీస అవగాహన లేకపోవడం, చేయూత నిచ్చే కనీస చర్యలను తీసుకోకపోవడం వల్ల కొన్నిసార్లు తీవ్ర నైరాశ్యంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు. మనోవ్యధ నుంచి బయట పడే ప్రయత్నాలు చేసినా కోలుకోలేని పరిస్థితుల్లో తమ జీవితాన్ని త్యాగం చేయాలనే ఆలోచన వస్తుంది. ఆలాంటి ఆలోచనలను ముందుగానే గుర్తిస్తే ... చాలావరకూ ఆత్మహత్య మరణాలను తగ్గించవచ్చు.
(నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం..)
- డా. బి.కేశవులు నేత, ఎండి.
ఛైర్మన్, తెలంగాణ ఆత్మహత్యల నిరోధక కమిటీ..
85010 61659