చేప మందుపై పునరాలోచించాలి

నేటి కాలమాన పరిస్థితుల్లో మానవ సమాజాన్ని అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. అనేక రోగాలకు ఆధునిక వైద్య విధానంతో నయం జరుగుతోంది. అయినా

Update: 2024-06-08 00:45 GMT

నేటి కాలమాన పరిస్థితుల్లో మానవ సమాజాన్ని అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. అనేక రోగాలకు ఆధునిక వైద్య విధానంతో నయం జరుగుతోంది. అయినా కొన్ని రోగాలు ఏలాంటి మందులకు లొంగవు. అవీ రోగనిరోధక శక్తిని దాటి దీర్ఘకాలిక జబ్బుగా మారి మానవ సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. అలాంటిదే ఆస్తమా. ఇది భయంకరమైన వ్యాధి కోవకు చెందినదే.

ఈ వ్యాధిని నయం చేయడానికి ఆయుర్వేద వైద్యం పేరుతో తెలంగాణలో చలామణి అవుతున్న చేప మందు ప్రసాదం విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీన్ని ప్రతి ఏటా బత్తిన సోదరులు మృగశిర కార్తె రోజు పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఉబ్బసం వ్యాధి గ్రస్తులకు ఇది దివ్య ఔషధంగా చెప్తారు. ఈ ఏడాది జూన్ 8,9 తేదీల్లో హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పంపిణీ జరగనుంది. ఈ మందు కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి జనాలు వస్తుంటారు. ఇందుకు ప్రభుత్వం సైతం అధికారికంగా ఏర్పాట్లు చేస్తుంది. అయితే, ఎన్ని ఏర్పాట్లు చేసినా రద్దీ ఎక్కువై విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుంది. తద్వారా వ్యాధి మరింత పెరగవచ్చని నిపుణులంటున్నారు.

ఉబ్బసాన్ని తగ్గించే మందు లేదన్నప్పటికీ..

వాస్తవంగా వర్షాకాలం ప్రారంభం కాగానే ఆస్తమా వ్యాధిగ్రస్తులు అనేక అవస్థలు పడుతుంటారు. ఈ సమయంలో ఉపశమనం కోసం వారిలో ఏ మందు ఇచ్చినా వేసుకునే బలహీనత ఏర్పడుతుంది. దీన్ని ఆసరాగా చేసుకుని చేప మందు ఆస్తమా వ్యాధిని తగ్గిస్తుందని బత్తిని సోదరులు ప్రచారం చేసుకుంటూ ఏళ్ళ తరబడి నుంచి పంపిణీ చేస్తున్నారు. ఈ చేప మందులో ఉబ్బసాన్ని తగ్గించే మందు ఏది లేదని ప్రయోగశాలలో ప్రయోగపూర్వకంగా నిర్ధారించబడింది. ఈ క్రమంలో జన విజ్ఞాన వేదిక గతంలో అనేక సార్లు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మందుపై సిటీ సివిల్‌ కోర్టు 2012లో దీనిని మందు అనొద్దని ఈ మిశ్రమాన్ని “చేప ప్రసాదం” గా వ్యవహరించాలని తీర్పును వెలువరించింది. అంతేకాకుండా చేప ప్రసాదం తయారీ, పంపిణీ పరిశుభ్రమైన వాతావరణంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో జరపాలని ఆదేశించింది. దీన్ని ఎక్కడ పాటించడం లేదు. చేప ప్రసాదాన్ని ఎక్కడా "చేప మందు"గా ప్రచారం చేయరాదని, వీటిని ఉల్లంఘించిన పక్షంలో సర్కారు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. సైంటిఫిక్‌ అథారిటీ లేని చేపమందు ప్రసాదం పంపిణీపై 2019లో మరోసారి హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలైంది.

గుడ్డిగా నమ్మకూడదు...

ఆస్తమా అనేది దీర్ఘకాలమైన జబ్బు దీనికి ఎప్పుడు చికిత్స జరుగుతూ ఉండాలి. ఆస్తమాను తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులువవుతుంది. ప్రతి ఆయాసం అస్తమా కాదు. ఆయాసం, దగ్గులకు అనేక కారణాలు ఉండవచ్చు. వాటిని తెలుసుకొని ఆధునిక చికిత్స పొందవలసిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్తమాకు ప్రస్తుతమున్న వైద్య విధానంలో ఉపశమనమే తప్ప పూర్తి నివారణ అంత తేలిక కాదు. అయినా ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో సరైన అవగాహనతో ఆధునిక చికిత్సా విధానంతో అస్తమాను జయించవచ్చని వైద్య నిపుణులంటున్నారు. కాబట్టి చేప ప్రసాదం పంపిణిపై ప్రభుత్వం పునరాలోచించాలి. ఏర్పాట్ల కోసం ప్రజాధనాన్ని వృధా చేయవద్దు. అంతేకాకుండా మత్స్య శాఖ చేప పిల్లల సరఫరాను నిలిపివేయాలి. ఇటీవల భారతదేశంలో సూడో సైన్స్ (అసత్య సైన్స్) ప్రచారం విస్తృతంగా పెరుగుతుంది. పతంజలి ఉత్పత్తులపై తప్పుదారి పట్టించే ప్రకటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఇలాంటివి ప్రజలను గందరగోళానికి గురి చేస్తాయి.

వ్యాధిపై అవగాహన కల్పించాలి.

ప్రపంచంలో ఎక్కడలేని చేప ప్రసాదం భారత్ లోనే ఎలా చలామణి అవుతోందో ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఆస్తమా వ్యాధికి అన్ని జిల్లా కేంద్ర, ఏరియా ఆసుపత్రిలో నిపుణులతో చికిత్స శిబిరాలను ఏర్పాటు చేయాలి. ఆస్తమా వ్యాధి నివారణకు, చికిత్సకు ఉన్న ఆధునిక వైద్య విధానాలను ప్రజలకు వివరించాలి. గుడ్డిగా నమ్మడం, మూఢ నమ్మకాలు ప్రోత్సహించడం ప్రభుత్వ విధానంగా ఉండకూడదు. అదేవిధంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 51A(H) ప్రకారం ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, పరిశోధన, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందింప చేయాలి. ఆస్తమా వ్యాధి లక్షణాలు, ఆస్తమా వ్యాధికి వ్యాప్తి గల కారణాలను ప్రజలకు అవగాహన కల్పించి, నివారణ మార్గాలను తెలియజేయాలి. అప్పుడు ఇలాంటి సైన్స్ లేని మందులకు ప్రజలు దూరంగా ఉంటారు.

సంపతి రమేష్ మహారాజ్

సామాజిక విశ్లేషకులు

79895 79428

Tags:    

Similar News