మట్టి మనుషుల ఆక్రందన 'కాలా'

కళ కేవలం కల కాదనీ ఒక స్వతంత్ర భావన అని అది సర్వస్వతంత్రంగా ఉంటేనే దానికి సార్థకత, స్వచ్ఛత అని నమ్మే బుద్ధిజీవులు ఉన్నారు ఈ లోకంలో

Update: 2024-07-02 01:00 GMT

కళ కేవలం కల కాదనీ ఒక స్వతంత్ర భావన అని అది సర్వస్వతంత్రంగా ఉంటేనే దానికి సార్థకత, స్వచ్ఛత అని నమ్మే బుద్ధిజీవులు ఉన్నారు ఈ లోకంలో. అది సంగీతానికి, సాహిత్యానికి, సినిమాకూ పూశారు. సకల కళలూ స్వతంత్రంగా ఉండాలి అని ఉద్యమాలు చేసిన కవులు ఉన్నారు. వాళ్లు కోరుకున్నది సాహిత్యం స్వతంత్రంగా ఉండడం కన్నా ఒక లక్ష్యం కోసం, సమాజ హితం కోరే క్రమంలో ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ వ్యక్తులు, శక్తుల మీదనే వాళ్ల దాడి. పాపం వాళ్ల అజ్ఞానానికి తెలుగు సమాజం ఎప్పుడో నివాళి ఇచ్చింది.

ఈ ప్రపంచంలో ఏ కళకయినా స్థలం, కాలం, కులం, వర్గం ఉంటాయని చరిత్ర నిరూపించింది. సినిమా దానికి అతీతం కాదు. సినిమా ఎంత ‘సినాలిది’ అంటే ఇద్దరు ప్రజాదరణ పొందిన నటీమణుల జీవితాలను ఒకటి డర్టీగా మరొకటి ‘మహానటి’గా మార్చగలదు. విలువలను తలకిందులు చేయగల 'సినాలిది' మన సినిమా.

సినిమాలు రాజకీయం చేయవట

ఇది రాజకీయం అంటే ఎవరూ ఒప్పుకోరు. ‘మహానటి’ కావాలి అన్నా ‘డర్టీ పిక్చర్’ కావాలి అన్నా దాని వెనుక కులం ప్రాంతం వర్గం ఉంటాయి. ఉండి తీరాలి కూడా. అసలు వందేళ్ల సినిమా తన ప్రాంతాన్ని, కులాన్ని, మతాన్ని, శీలాన్ని పెట్టుబడి పెట్టకుండా, రాజకీయం చేయకుండా ఎప్పుడు ఉంది? సినిమా పేరుతో వేలాది ఎకరాలు పచ్చని పొలాలు, కుంటలు, చెరువులు ఆక్రమించుకోవచ్చు. సినిమా పేరు చెప్పి వందేళ్లు ఎకరానికి రూపాయి పెట్టి ఆక్రమించుకొని మాల్స్ కట్టుకోవచ్చు. తెరమీద రాజకీయాల్లోనూ హీరోలు కావచ్చు. ఇవేవీ రాజకీయాలు కావు, కేవలం కళ ద్వారా మాత్రమే ప్రాప్తించిన వరం అని అనొచ్చు. అందరూ చేసారా... అది కేవలం అవతార పురుషులకు మాత్రమే లభించే ప్రాప్తం అని కూడా అనొచ్చు. ఇంత అజ్ఞాన పూరిత విషాద కాలంలో పా.రంజిత్ ‘కాలా’ సినిమా తీసాడు. త్రిబుల్ ఎక్స్ XXX అంత సంస్కారమైన, సబ్బు నురగ అంత స్వచ్చమైన సినిమా తెర మీద రంగుల హోళీ చేసాడు.

కొందరికి ఇంత అసహ్యమైన కంపు నచ్చక పోవచ్చు. జూబ్లీ, బంజారా హిల్స్ ఎంత అందమైనవో ఆ పక్కనే ఉన్న అద్దం లాంటి మురికి వాడల్లో, కృష్ణా నగర్ ఐశ్వర్యంలో చూడొచ్చు. పాపం పెద్ద మనిషి... పడితే లేస్తే హిమాలయాల చుట్టూ తిరిగే వాణ్ని ‘డర్టీ’ నీలి రంగులో ముంచి వెండితెరను బద్నాం చేసాడు రంజిత్. అది ముమ్మాటికీ తప్పే.

పొలిటికల్ సెటైర్ 'కాలా'

రజనీకాంత్ కాషాయం వదిలి నలుపు నీలి రంగుల్లో మునగడం ఆయన ఎంచుకున్న రాజకీయాలు తెర ముందు తెరవెనక ఒకటే అని చెప్పకనే చెప్పినట్టు. ఆ పని రంజిత్ చేసాడు. ఇంతకాలం హిమాలయాల ‘స్వచ్ఛమైన’ తెలుపును మాత్రమే చూసిన ఆయన ఆకాశం నీలం వర్ణంలో కూడా ఉందని తెలుసుకున్నాడు. కాలా లేదా కరికాలుడు ముంబై మురికివాడల్లో పెరిగిన ఒక నిరసన. ధారావిలో స్థిరపడిన వలస జీవుల మీద ఆధిపత్యం చేయాలనుకున్నవారి దాదాగిరి మీద, సూటిగా చెప్పాలి అంటే ముంబై శివసేన హిందుత్వ రాజకీయాల మీద ఒక పొలిటికల్ సెటైర్ 'కాలా' సినిమా.

రాజకీయం లేనిదెక్కడ

మద్రాస్ నుండి రెండు తరాల కింద వలస వచ్చిన ఈరయ్య కొడుకే కాలా. నలుగురిని బతికించడానికి సమాజం అంటున్న ‘తప్పు’ చేసినా తప్పు కాదు అన్నాడు ఇరవై ఎనిమిది ఏళ్ల కింద ఈరయ్య అలియాస్ ఈరినాయుడు. నాటి బొంబాయి నగరాన్ని ఉచ్చ పోయించినవాడు ఈరినాయుడు. ముంబై నగరాన్ని నవనిర్మాణ సేన పేరుతో ఉన్మాదపు అడ్డాగా మార్చింది రాజకీయం. ఇప్పుడు ముంబై నగరంలో ఈరినాయుడు కరికాలునిగా మారాడు. ముంబై చీకటి వికృతాన్ని దాదాగిరిని శాసించిన ఉదంతాలు కొత్త కాకున్నా ఈరినాయుడి తర్వాతి తరం తాము చేసే ఏ పనిలో అయినా రాజకీయాలు ఉంటాయి అని చూపించారు.

భూపోరాటాలపై సినీ రూపం

తండ్రిగా రజని పెరియార్ వారసుడు, తన కొడుకు లెనిన్ వారసుడు. నలుపు, నీలం రంగు మధ్య వైరుధ్యం ముఖ్యంగా భూమి ఇరుసుగా జరిగిన అనేక పోరాటాలకు ఒక ఆకృతి ఇస్తే అది ‘కాలా' సినిమా అవుతుంది. తన కాళ్లకింద కదులుతున్న నేల కాపాడుకోవడం కోసం ఒక మట్టి మనుషుల ఆక్రందన అది. ఉమ్మడి కుటుంబాల మధ్య సంపద తెస్తోన్న వికృతం, వ్యవస్థీకృతమైన ఆహార హింస, తిండి, బట్ట, ఆహార్యం మీద పెత్తనం చెలాయించే సంక్షుభిత కాలంలో దాని విరుగుడు ప్రత్యామ్నాయ రాజకీయాలలో ఉంది అని చెప్పగల దమ్మున్న పా. రంజిత్‌కు మాత్రమే కాలా వంటి సినిమా తీయడం సాధ్యం.

నేటి ముంబై నగరాన్ని “నేల నీకు అధికారం నేల నాకు జీవితం”, ‘డబ్బూ అధికారం వచ్చాక ప్రతి రౌడీ దాతే’ అన్న మాట అనడానికి నీకు ధైర్యం కావాలి. చావు నిన్ను తరుముకొని వచ్చినా ఈ కట్టే ఈ మట్టిలో మొలిచిన చెట్టు అనీ, అది ఇక్కడే కాలి ఈ మట్టిలోనే కలిసిపోవాలి అని ఈ భూమి పుత్రుడు మాత్రమే అనగలడు. వీరినాయుడు వారసుడు ‘కాలా’. వాడికేమి కావాలో స్పష్టత ఉంది. దాని వెనుక ద్రావిడ రాజకీయాలు తెచ్చిన స్ఫూర్తి ఉంది. పెరియార్ ప్రోది చేసిన ఒక పరంపర, ఒక కొనసాగింపు ఉంది.

కరికాలుడు ఈ కాలపు రాబిన్ హుడ్

ఇది దుష్ట శిక్షణ, శిష్ట పరిరక్షణ పేరుతో జరిగిన హింసపై జరిగిన తిరుగుబాటు. రామ-రావణ రాజకీయాల మధ్య జరిగిన వైరుధ్యాల ప్రతిఫలనం. శుచి శుభ్రత పేరుతో వచ్చిన అసమ విలువల మీద తిరుగుబాటు. ఈ కాలానికి ఏది అవసరమో అదే తెరమీద చూపించిన ‘కాలా’ అలియాస్ కరికాలుడు ఈ కాలపు రాబిన్ హుడ్. సినిమా ఎలా తీయాలో ఎందుకు చూడాలో చెప్పగలిగిన ఈ కాలపు నిజమైన హీరో పా.రంజిత్.

డా. గుఱ్ఱం సీతారాములు

99516 61001

Tags:    

Similar News