పెట్టుబడుల రాక హర్షణీయం
పెట్టుబడుల రాక హర్షణీయం...The arrival of investments is exciting in Andhra Pradesh
రాష్ట్ర ప్రభుత్వం విశాఖ పట్నంలో రెండ్రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రపంచ పారిశ్రామిక సదస్సు విజయవంతం కావడం హర్షణీయం. పలు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు సదస్సులో పాల్గొని పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపడం శుభకరం. ఈ సదస్సు ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 350 ఒప్పందాలు జరిగినట్లు గౌరవ ముఖ్యమంత్రి తెలియజేశారు. వాటి ద్వారా 20 రంగాల్లో ఆరు లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక ప్రగతి ద్వారా ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాకుండా ఆర్థిక స్థితి మెరుగై రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుంది. ఇక్కడున్న వనరులు పూర్తి స్థాయిలో వినియోగమౌతాయి. సంక్షేమం నుండి సాధికారికత దిశగా రాష్ట్రం పయనిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనుకూల విధానాల ద్వారా రాష్ట్రం వరుసగా మూడో సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమ స్థానం దక్కించుకుంది. పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం లో సఫలమైంది. ఇప్పుడు జరగనున్న ఒప్పందాలు అధిక భాగం త్వరగా రూపు దాల్చి ప్రజలకు మేలు చేయగలవని ఆశిద్దాం. 'మీరు పెట్టుబడులతో రండి.. మీ అనుమతులు ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉన్నాయి' అంటూ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని చెప్పకనే చెప్పారు. అధికారగణం అందుకు తగ్గట్టుగా వ్యవహరించాలి.
- డా. డి.వి.జి.శంకర రావు
94408 36931