రాష్ట్రానికి కావాల్సింది సంక్షేమం కాదు.. ఉపాధి!
Telangana state needs is not welfare.. Employment!
సెప్టెంబర్ 17న కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభ నిర్వహించింది. ఈ సభలో సోనియాగాంధీ చేత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలని ప్రకటింపజేయడం ఆశ్చర్యం కలిగించింది. మహాలక్ష్మి పథకం ఎందుకోసం ప్రకటించారో అర్థం కాలేదు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్‌ల పేరిట ఓటు బ్యాంకు పథకాల్ని ప్రకటిస్తూనే వస్తోంది. ఇలాంటి హామీల సునామీ వల్ల ఆయా రాజకీయ పార్టీలు గద్దె నెక్కుతాయేమో కానీ ప్రజలు మాత్రం నట్టేట్లో మునగడం ఖాయం. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ఆసరా, రైతు బంధు లాంటి అనవసర పథకాల వల్ల రాష్ట్రం అప్పుల కుప్పయింది. చేసిన అప్పుల వడ్డీలు కట్టడానికి ప్రభుత్వ భూముల్ని అమ్ముకునే దుస్థితిలో ఉన్నాం.
దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. ఇక్కడి ప్రజల్లో పనిచేసే సంస్కృతి కూడా ఉంది. రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలు వారి స్వలాభం కోసం ఉచిత పథకాల్ని ప్రవేశపెట్టి ప్రజల్ని సోమరిపోతులుగా తయారు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతాలివ్వడం చేతకాదు కానీ, అడక్కపోయినా వికలాంగులకు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచిన ఘనత మన ముఖ్యమంత్రిది. గ్రామాల్లో వెట్టిచాకిరీ చేసే అంగన్వాడీలు ఉద్యోగ భద్రత కోసం ఒకపక్క రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే, వారిని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కేవలం అధికారం కోసం అమలు సాధ్యం కాని పథకాల్ని ప్రకటించకుండా, ఉపాధి కల్పనపై దృష్టి సారించాలి. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిని భర్తీ చేసి, మిగిలిన యువత, మహిళల కోసం ప్రతి గ్రామంలో కుటీర పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రజలకు ఆసరా, దళిత బంధు, బీసీ బంధు లాంటి ఎలాంటి ఉచిత పథకాల్ని అమలు చేయాల్సిన అవసరం ఉండదు.
- పసునూరి శ్రీనివాస్
అడ్వకేట్, మెట్‌పల్లి
88018 00222