తెలంగాణకు మళ్లీ నిరాశే!
Telangana is again disappointed in the Union budget!
మధ్యంతర బడ్జెట్‌లో తెలంగాణకు మళ్లీ నిరాశే ఎదురైంది. రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ.19,760.59 కోట్లు వస్తాయి. ఇక మరో 3200 కోట్లు 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థల మంజూరు కింద రానున్నాయి. ఈ మూడు మాత్రమే పెద్ద పద్దులు. తప్ప రాష్ట్రానికి చెప్పుకోదగిన కేటాయింపులు పెద్దగా లేవు.
2023-24లో తెలంగాణకు పన్నుల వాటా కింద 23,400 కోట్లు కేటాయించగా. ఈ మధ్యంతర బడ్జెట్లో దీనికి మరో రూ.2,239 కోట్లు చేర్చారు. దీంతో బడ్జెట్ రూ. 25,639 కోట్లకు చేరింది. ఎన్నికల సంవత్సరం కావడంతో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 47,65,768 కోట్లతో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా తెలంగాణకు రూ. 25,639 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో కొత్త పథకాలు ఏవి లేవు. తెలంగాణకు కేటాయించిన బడ్జెట్ కూడా కేంద్ర పన్నుల వాటా కింద మాత్రమే ప్రకటించారు.
తెలంగాణకు హామీల్లేవు
ఈ బడ్జెట్లో తెలంగాణ కేంద్రం నుంచి ఎక్కువగానే ఆశించింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి - ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం స్టీల్ ప్లాంట్‌కు నిధులు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద మూడేళ్లకు రూ. 1800 కోట్లు విడుదల చేయాలని కోరింది కూడా. దీంతోపాటు హైదరాబాద్ - నాగపూర్ పారిశ్రామిక కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఒకవేళ దీనికి కనుక అనుమతులు ఇస్తే రాష్ట్రానికి 2,300 కోట్లు విడుదలవుతాయని అంచనా వేశారు. దీంతోపాటు అదనంగా రూ. 90 కోట్లు సైబర్ సెక్యూరిటీకి, మరో రూ.88 కోట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో పటిష్టతకు ఇవ్వాలని కోరారు. దీంతోపాటు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు మెట్రో రైలు రెండో దశకు నిధులు ఆశించారు. కానీ మధ్యంతర బడ్జెట్ లో వీటి మీద ఎలాంటి ప్రస్తావన లేదు. కేంద్రం ఎలాంటి హామీలు ఇవ్వలేదు.
పాత ప్రాజెక్టులకే నిధులు
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యధికంగా రూ.14 వేల 209 కోట్లు కేటాయించినట్లు. రైల్వే బడ్జెట్ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాలు భద్రతా ప్రాజెక్టులకు రూ.5071 కోట్లు ఈసారి కేటాయించినట్లుగా కేంద్ర రైల్వే మంత్రి తెలిపారు. రైల్వే శాఖకు కేటాయింపుల్లో తెలంగాణకు ఊరట కలిగించే అంశాలు లేవు. నూతన రైల్వే లైన్లు, రైల్వే టెర్మినల్, డబ్లింగ్, భారీ ప్రాజెక్టులేవీ ప్రకటించలేదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవి, పాత ప్రాజెక్టులకే నిధులు కేటాయించారు. గత సంవత్సరం రాష్ట్రానికి ఇచ్చిన రూ.4,418 కోట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 12.8 శాతం పెంచి రూ.5,071 కోట్లు కేటాయించారు. 2021- 22 బడ్జెట్లో రూ.2420 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు రెండు సార్లు పెంచామని గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం రెండు రాష్ట్రాలకు చాలా హామీలు ఇచ్చింది. పదేళ్లయినా ఇప్పటికీ హామీలు పూర్తిస్థాయి అమలు కాలేదు. ఎన్నికల వేళ ఇప్పటికైనా వాటికి మోక్షం లభించలేదు. విభజన ప్రక్రియ అమలు విషయంలో కేంద్రం తాత్సారం చేస్తోంది. ప్రత్యేక నిధులు, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులకు చోటు దక్కలేదు. ఇది రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
తీగల అశోక్ కుమార్
79891 14086