సంక్షేమం పేరిట మోసపు పథకాలు
Telangana implementing Fraud schemes in the name of welfare
నిధులు, నీళ్లు, నియామకాలు పేరుతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ తర్వాత వీటిని మరచి సంక్షేమ పథకాల పేరిట మోసపు పథకాలపై మాత్రమే దృష్టి సారించింది. ఓటు బ్యాంకు పథకాల రూపకల్పనతో ఉద్యమ పార్టీ కాస్త ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది. రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని పూర్తిగా సోమరిపోతులుగా మార్చేశారు. ఆసరా, రైతు బంధు పథకాల వల్ల రాష్ట్రం పూర్తిగా దివాళా తీసింది. హుజురాబాద్ గెలుపుకోసం ప్రవేశపెట్టిన దళితబందుతో దూరమైన బీసీల కోసం మరో బంధు తీసుకురావాల్సి వచ్చింది. వివిధ రకాల బంధు పథకాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతాలు బంద్ అయ్యాయి. పదేళ్ల కేసీఆర్ పాలనలో ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా కీర్తికెక్కింది. భవిష్యత్తు ఓటుబ్యాంక్‌కి పనికొచ్చే పథకాలు తప్ప ప్రజలకి ఉపయోగపడే పథకాల గూర్చి ముఖ్యమంత్రి ఆలోచించడం లేదు.
బాగుంటే పథకాలు ఎందుకు!
అన్ని రకాల సంక్షేమ పథకాల్లో అర్హుల కన్నా అనర్హులే ఎక్కువగా వున్నారు. సంక్షేమ పథకాల పేరిట అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు ఒకరినొకరు మోసం చేసుకుంటూనే వున్నారు. దళిత బంధు, బీసీ బంధు పథకాలు పార్టీ కార్యకర్తలకు తప్ప అర్హులైన సాధారణ ప్రజలకు ఇవ్వడం లేదు. గత పదేళ్లుగా ఇస్తున్న పెన్షన్లతో రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయో ఎవరికీ తెలియదు. లిక్కర్ సేల్స్, బెల్ట్ షాపులు ఎందుకు పెంచుతున్నారో కేసీఆర్ జవాబు చెప్పాలి. ఒక చేత్తో ఇస్తున్న డబ్బుల్ని మరో చేత్తో ప్రభుత్వం లాగేసుకుంటుందన్నా విషయాన్ని ప్రజలు గమనించక మోసపోతున్నారు. తెలంగాణ ప్రజల అదృష్టం కొద్దీ రాష్ట్రంలో కరవు లేదు, పంటలు బాగానే పండుతున్నాయి. జీడీపీ, తలసరి ఆదాయానికి కూడా లోటు లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతున్నారు. మరి ప్రజలు అన్ని రకాలుగా బాగున్నప్పుడు రోజుకో రకం సంక్షేమ పథకాన్ని తెరమీదికి ఎందుకు తెస్తున్నారో అర్థం కావడం లేదు. సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పని చేసే సంస్కృతి తగ్గిపోయింది. రోజురోజుకీ ప్రజల్లో సోమరితనం పెరిగిపోతోంది. అప్పుల్లో రాష్ట్రం రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అప్పులు చాలు. వాటిని వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి సంస్కరణలు తీసుకురావాలి. ప్రస్తుతం అమలవుతున్న ఉచిత పథకాల్ని తీసేయాలి. తెలంగాణ మరో వెనిజులా, శ్రీలంక ల కాకుండా జాగ్రత్త పడాలి. ప్రజలు సైతం ఉపాధి కావాలని ప్రభుత్వాన్ని కోరాలి. ప్రభుత్వం చేసే అప్పుల్ని ప్రజలే పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. మోసపు సంక్షేమ పథకాలు కాకుండా సంస్కరణలు కావాలని ప్రజలు డిమాండ్ చేసినప్పుడే భవిష్యత్తులో రాష్ట్రం దివాలా తీయకుండా ఉంటుంది.
పసునూరి శ్రీనివాస్
88018 00222