సెర్ప్ ఉద్యోగుల బదిలీలు చేపట్టండి!
గత పదేళ్ల నుంచి గ్రామీణాభివృద్ధి సంస్థ - (ఐకేపి)లో పనిచేస్తున్న ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో స్థానిక ప్రజలతో, అధికారులతో ఎక్కువగా సత్సంబంధాలు
గత పదేళ్ల నుంచి గ్రామీణాభివృద్ధి సంస్థ - (ఐకేపి)లో పనిచేస్తున్న ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో స్థానిక ప్రజలతో, అధికారులతో ఎక్కువగా సత్సంబంధాలు ఏర్పడ్డాయి. దశాబ్దం తర్వాత తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రాకుండా ఉండాలంటే ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి, 40 శాతానికి మించి ఉద్యోగులను బదిలీలు చేయొద్దనే నిబంధన నుంచి సెర్ప్ ఉద్యోగస్తులకు తప్పనిసరిగా మినహాయింపు ఇచ్చి సర్వీసుతో సంబంధం లేకుండా ఈ సంస్థలో పని చేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగస్తులకు పూర్తి స్థాయిలో బదిలీలు చేపట్టాలి. లేకపోతే అధికార పార్టీ స్థానిక ఎన్నికల్లో నష్టపోయే ప్రమాదముందని జనాభిప్రాయం.
దాదాపు ఆరేళ్ల తరువాత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగుల్లో స్థానచలనం కోసం హడావుడి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీ నుంచి బదిలీల ప్రక్రియను ప్రభుత్వ శాఖలు మొదలు పెట్టాయి.
బదిలీ ప్రక్రియ గందరగోళంగా మారడంతో..
ఇందులో భాగంగా జూలై 5 నుంచి 8వ తేదీ వరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఖాళీలు, ఖచ్చితంగా బదిలీ చేయాల్సిన ఉద్యోగుల వివరాలను వెల్లడించి 9 నుంచి 12వ తేదీ వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించి, జూలై 13 నుంచి 18వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీ దరఖాస్తులను పరిశీలించి 19 , 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తామని, 21 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం మళ్లీ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం తొలుత చెప్పింది. కానీ పలు శాఖల్లో బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారిందని, గైడ్ లైన్స్‌కు అనుగుణంగా ప్రక్రియ జరగడం లేదంటూ వివిధ విభాగాల ఉద్యోగులు ఆందోళనకు దిగారని మరికొందరు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు అక్రమంగా బదిలీల నుంచి తప్పించుకుంటున్నట్లు తెలిసింది. దీంతో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రి యను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉంటున్న రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేసినట్టు వివిధ దినపత్రికలలో ప్రచురితమైన విషయం విదితమే. అందులో భాగంగానే కొన్ని శాఖల్లో బదిలీలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఆగస్టు 1వ తేదీ నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని సవరించారు.
స్థానిక ఎన్నికలకు కసరత్తు
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీచేస్తూ గరిష్టంగా 40 శాతానికి మించి బదిలీలు చేయోద్దని ప్రత్యేక నిబంధనలు విధించడమే కాకుండా ఒకేచోట రెండేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న ఉద్యోగులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. మరోవైపు ఒకేచోట నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగి తప్పనిసరి బదిలీల జాబితాలోకి చేరుతారని ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీరియస్‌గా దృష్టిపెట్టడంతో పాటు వీలై నంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పంచాయతీ రాజ్ శాఖ ఉన్నత అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీని కాదని ప్రజలు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టినప్పటికీ త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సెర్ప్ ఉద్యోగుల రూపంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల ఫలితాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని చెప్పక తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ వివిధ పథకాలను ప్రకటించి వాటి అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకే అప్పజెప్తున్న విషయం తెలిసిందే. కానీ గత పదేళ్లుగా బదిలీలు లేని సెర్ప్ ఉద్యోగులు అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పక్షం వహించడమే కాకుండా, ఈ సంస్థలోని ఉద్యోగుల నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తీసుకునే అవకాశాలు ఉన్నందున ఇది రాజకీయంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగవచ్చు.
సెర్ప్ ఉద్యోగులే కీలకం!
సెర్ప్ ఉద్యోగస్తులు అనునిత్యం క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలను సమన్వయం చేస్తూ క్షేత్రస్థాయిలో తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో వారు అత్యంత కీలకంగా వ్యవహరించారని భావించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సెర్ప్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ నాడు హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే కొంత ఆలస్యం అయినప్పటికీ 2023 ఏప్రిల్‌లో సెర్ప్‌లో పని చేస్తున్న ఎం.ఎస్.సి.సి, సీసీ, ఏపీఎం, డీపీఎం, ఏపీడి స్థాయి ఉద్యోగులకి పే స్కేల్‌నీ ప్రకటించారు. దీంతో ఏళ్ల తరబడి చాలి చాలని జీతాలతో పనిచేస్తున్న తమను గుర్తించారని సెర్ప్ ఉద్యోగస్తులంతా బీఆర్ఎస్ పార్టీపై సానుభూతితో ఉన్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికల వేళ మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట రామిరెడ్డి తో సెర్ప్ ఉద్యోగులు సమావేశం అయ్యారన్న పక్కా సమాచారం మేరకు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు ఆందో ళన చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఈసీ, పోలీసు అధికారులు సీసీ కెమెరాలు పరిశీలించి 38 మంది సెర్ప్ ఉద్యోగులను సస్పెండ్ చేసిన ఘటన అందుకు నిదర్శనంగా చెప్పక తప్పదు.
పూర్తి స్థాయి బదిలీలు చేయాలి!
పదేళ్ల పాటు ప్రధాన ప్రతిపక్షంలో ఉండి దశాబ్ది తర్వాత తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రాకుండా ఉండాలంటే ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి 40 శాతానికి మించి ఉద్యోగులను బదిలీలు చేయొద్దనే నిబంధన నుంచి సెర్ప్ ఉద్యోగస్తులకు తప్పనిసరిగా మినహాయింపు ఇచ్చి సర్వీసుతో సంబంధం లేకుండా ఈ సంస్థలో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగస్తులందరికి పూర్తిస్థాయిలో బదిలీలు చేపట్టాలి. లేకపోతే అధికార పార్టీ స్థానిక ఎన్నికల్లో నష్టపోయే ప్రమాదముందని గ్రహించాలి.
-మాణిక్ డోంగ్రే
99515 87876