బాలికల సంరక్షణ అందరి బాధ్యత

Taking care of girls is everyone's responsibility

Update: 2024-01-24 00:45 GMT

ఆడపిల్ల పుట్టిందంటే తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని పూర్వం భావించేవారు. ఇప్పుడు ఆడ పిల్ల పుడితే భారంగా భావిస్తున్నారు. భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన నిమిషాల్లోనే ఆడబిడ్డలను అమ్మేస్తున్నారు. అలాగే పుట్టిన వెంటనేే చెట్ల పొదల్లో.. మురికి కాలువల్లో ఆడ శిశువులు దర్శనమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నేషనల్ గర్ల్స్ డెవలప్‌మెంట్ మిషన్ పేరుతో గతంలో ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగానే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 2008 నుంచి ప్రతి ఏడాది జనవరి 24న భారత జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సమాజంలో బాలికల సంరక్షణ పట్ల అవగాహన కల్పించడానికి, బాలికల హక్కులు, ఆరోగ్యం, విద్యా, సామాజికంగా ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతీ వెయ్యి మంది పురుషులకు 940 మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు తేలింది. అలాగే 6 సంవత్సరాల లోపు ఆడ పిల్లలైతే ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు 914 మంది మాత్రమే ఉన్నట్లు జనాభా లెక్కల్లో వెలుగు చూసింది. భారత్‌లో బాలికలకు బలవంతంగా వివాహాలు చేస్తున్నారు. బాలికల విద్యా ప్రమాణాలు ఎక్కడైతే పెరుగుతాయో ఆయా సమాజాలలో మహిళల హోదా, గౌరవం మెరుగుపడుతుంది. అయితే మన దేశంలో గర్భస్థ శిశువు నుంచే బాలికలకు కష్టాలు ప్రారంభమవుతున్నాయి. పిండ దశలోనే వారిని చిదిమేస్తున్నారు. చదువుకోవాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. వరకట్నం పేరుతో గృహ హింసలకు గురి చేస్తూ, హత్యలు సైతం చేస్తున్నారు. భారతీయ సమాజంలో వేళ్లూనికొని వున్న పురుషస్వామ్య సంస్కృతి మహిళల అణచివేతకు కారణం అవుతోంది. వీటన్నింటికి విద్య లేకపోవడం కీలక కారణం. బాలికలకు విద్య, వైద్య, పోషకాహారం, న్యాయం, సంరక్షణ వంటిి కనీస హక్కులు అందడం లేదు. కనీసం వాటి గురించి అవగాహనే ఉండటం లేదు.

దేశంలో ఇప్పటికీ పేద కుటుంబాల్లో తల్లిదండ్రుల వలసలు జరుగుతున్నాయి. దీంతో ఇంటి పని కారణంగా బాలికలు బడి మానేస్తున్నారు. ఇప్పటికీ ఆడపిల్ల చదువులకు పెట్టుబడి పెట్టడం అనవసరమైన ఖర్చు అనే ధోరణి ఉంటోంది. ఈ ధోరణే వారి చదువుకు, ఎదుగుదలకు ఆటంకంగా మారింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆడపిల్ల చదువు అంతంత మాత్రంగానే ఉంది. చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేయడం, తల్లిదండ్రులు తమ సంతానంలో ఆడ, మగ వివక్ష పాటించడం, బాల కార్మికులుగా మార్చడం, చదువుపై ఆసక్తి ఉన్నా పేదరికం వల్ల ఉన్నత విద్య పొందలేకపోవడం. విద్యాసంస్థలలో చదువు కొనసాగిస్తున్న వారికి భద్రత కరువు. ఆడపిల్లలపై అఘాయిత్యాలు, పైశాచిక దాడులు పెరిగిపోవడం వంటివన్నీ వారిని చదువులకు దూరం చేస్తున్నాయి.

వివక్ష రహిత సమాజం కోసం...

'ఆడపిల్లలకు రక్షణ కల్పించాలి. ఆత్మవిశ్వాసంతో పెరిగేలా చూడాలి. లింగ వివక్ష లేని సమాజం తీసుకురావాలి' వంటి లక్ష్యాలతో 2008లో భారత ప్రభుత్వం జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా బాలికల విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాల్య వివాహాల నియంత్రణ, అక్రమ రవాణా, మొదలైన అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. అయితే బాలికలకంటూ ఒకరోజు జరపడం కాదు, వారి నిజమైన అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అందుకుగాను బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి. ఆడపిల్లలకు అన్ని రంగాలలో సమాన అవకాశాలు కల్పించాలి. స్త్రీల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రాధాన్యత ఇచ్చి వారి భద్రతకు భరోసా ఇవ్వాలి. సమాజంలో మహిళల పట్ల గౌరవం, హోదా పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలి.

ప్రభుత్వాలు ఆడ పిల్లల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నప్పటికీ. సమాజంలో మనమూ బాద్యతగా బాలికల భవిష్యత్తుకు భరోసాగా ఇస్తూ వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా ఆగంతుకుల నుంచి ఎదురయ్యే ప్రమాదానికి మించి... సొంత కుటుంబ సభ్యుల చేత మోసానికి గురువుతున్నారు. మద్యం మత్తులోనో..మరే విధంగానో లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లోనూ కామాంధుల కోరల్లో బలవుతున్నారు. ఇటువంటి ఇంటి దొంగలకు కఠిన శిక్షలు విధించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో.. బేటి పడావో లాంటి పథకాలు ఉన్నా అవి ఫలితాలు ఆశించినంత స్థాయిలో రావడం లేదు. క్షేత్ర స్థాయి, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి పరిశీలనతో పరిశోధన విద్య పూర్తి చేసిన సోషల్ వర్కర్లకు ప్రాధాన్యత ఇస్తే మరింత అవగాహన సమాజంలో పెంచే అవకాశం ఉంటుంది.

(నేడు జాతీయ బాలికా దినోత్సవం)

సంపత్ గడ్డం

78933 03516

Tags:    

Similar News