నేటి భారతం..
మనం ఒక విచిత్రమైన దేశంలో బతుకుతున్నాం. ఇక్కడ విద్యాధికులు జ్యోతిష్యం మాట్లాడతారు. మోసగాళ్లు వాస్తు గురించి చెప్తారు
మనం ఒక విచిత్రమైన దేశంలో బతుకుతున్నాం. ఇక్కడ విద్యాధికులు జ్యోతిష్యం మాట్లాడతారు. మోసగాళ్లు వాస్తు గురించి చెప్తారు. దొంగలు, హంతకులు నీతులు బోధిస్తారు. బాబాలు, స్వామీజీలు కళ్లకు కనబడుతున్న ప్రపంచమే మాయ అంటారు. వారే ఈలోక సుఖాలు కాకుండా పరలోకం గురించి బోధిస్తారు. కనపడని దేవుడు, స్వర్గ నరకాలు పరలోకం ఉన్నాయి అంటారు. ఆశ వద్దంటారు. వాళ్లు మాత్రం భూములు కబ్జాలు చేస్తారు. భక్తుల డబ్బులు లాగేస్తుంటారు.
సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు. ప్రవాస భారతీయులు దేశాన్నెలా ప్రేమించాలో చెబుతారు. నేరగాళ్లు విలువలను బోధిస్తారు. ఇక్కడి సాహితీ పరిశోధకులు మత గ్రంథాలన్నీ చరిత్రలు అంటారు. అందులోని పాత్రలు చారిత్రక పురుషులు అంటారు. ఇక్కడ శాస్త్రవేత్తలు తాము తయారు చేసిన డిజైన్‌ను దేవుడి పాదాల మీద ఉంచి మొక్కుతుంటారు. ఇక్కడ అత్యున్నత న్యాయస్థానాధిపతి గుళ్లు, గోపురాలు తిరుగుతూ ఉంటారు. ఏమైనా అంటే మా నమ్మకం అని ఒక్క పదంతో దాటేస్తారు. ఈ దేశంలో ఆకలిగొన్న మనిషికి పిడికెడు అన్నం పెట్టరు. కానీ రాళ్లకు బంగారు కిరీటాలు, ఆభరణాలు చేయిస్తారు. చాలామంది రాళ్లలో ఉన్నాడనుకుంటున్న, దేవుడు మాత్రం కదలడు మెదలడు మాట్లాడడు.
కష్టపడనిదే ఏది రాదని..
ఈ దేశంలో ప్రపంచంలోని ఉన్న మతాలన్నీ ఉంటాయి. కానీ ఏ మతమూ సమానత్వం పాటించదు. ఈ దేశంలోని 90 శాతం మంది ప్రజలు తమ మెదళ్లను మతానికి, దేవునికి తాకట్టు పెట్టారు. దేశానికంతా అన్నం పెట్టే రైతన్నకు, ఈ దేశంలో అన్నమే దొరకని పరిస్థితి ఉంది. ఈ దేశంలో పక్షులు జంతువులు రాళ్లను పూజిస్తారు. మనుషులను చంపుతారు. ఈ దేశంలో కూతుర్ల పెళ్లిళ్లకు ఖర్చు ఎక్కువ. చదువుకు ఖర్చుతక్కువ. మన దేశంలో ఆలోచనాపరులు తక్కువ. అనులోచనాపరులు ఎక్కువ. మన దేశం జనాభాలో ప్రథమం. అన్నింటిలో అధమం. మనదేశంలో బడులను బాగుచేయరు. గుడులను బాగుచేస్తారు. కొత్త బడులు కట్టరు. కొత్త గుడులను కడతారు. ఈ దేశంలో పోషక విలువలు కలిగిన పాలను పెరుగును నెయ్యిని రాళ్లపై కుమ్మరించి మూత్రాన్ని, సేవిస్తారు. ఇక్కడ ప్రాథమిక అవసరాలు తీరకున్నా జాతరలకు, యాత్రలకు మాత్రం వెళ్తారు.
ఇక్కడ రాజకీయ నాయకులు రాజ్యాంగం ప్రకారం ఎన్నికవుతారు. ‘మను ధర్మం’ ప్రకారం పరిపాలన చేస్తారు. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు ముద్ధ కూడా పెట్టరు, అదే చచ్చాక పెద్ద ఖర్మ పేరుతో యాటలు, కోళ్లు కోసి జనాలను పిలిచి మరీ పెడతారు... అడుక్కునే వాణ్ణి చులకనగా చూస్తారు... కానీ వారు మాత్రం దేవుని దగ్గరకు వెళ్లి మరీ అడుక్కుంటారు. ఇక్కడి తల్లిదండ్రులు అక్షరాభ్యాసానికి గుడి పంతులు దగ్గరికి వెళ్తారు. కానీ విద్య మొత్తం నేర్పించడానికి బడిపంతుల్లను నమ్ముతారు. ఇదేమి నమ్మకమో అర్థం కాదు. అక్షరాభ్యాసానికి బడిపంతులు పనికిరాడా? చదువు రావడానికి ఒక దేవతను పూజిస్తారు. ధనం రావడానికి ఒక దేవతను పూజిస్తారు. కానీ కష్టపడనిదే ఏది రాదని, ప్రార్థనల వల్ల ఏది రాదని తెలుసుకోలేరు.
మన దొంగను మనమే ఎంచుకుంటూ..
నేరగాళ్లు, రాజకీయ నాయకుల విషయానికి వద్దాం! ఈ ఇరువురి మధ్య పెద్ద తేడా ఉండడం లేదు. తొండముదిరి ఊసరవెల్లి అయినట్టుగా నేరగాళ్లే రాజకీయ నాయకులుగా అవతరిస్తున్నారు. అయితే, ఒక తేడా ఉంది. సాధారణ దొంగ మన వ్యక్తిగత సొమ్మును మాత్రమే దోచుకుంటాడు. రాజకీయ దొంగ మాత్రం మన భవిష్యత్తును, జీవితాన్ని, వ్యాపారాన్ని కూడా దోచుకుంటాడు. విచిత్రం ఏమిటంటే, సాధారణ దొంగ ఎవరిని దోచుకోవాలో తానే నిర్ణయించుకుంటాడు. మనల్ని దోచుకొనే రాజకీయ దొంగను మాత్రం మనమే ఎంచుకుంటాం. సాధారణ దొంగను పోలీసులు తరిమి తరిమి పట్టుకుంటారు. రాజకీయ దొంగకు ఆ పోలీసులే రక్షణ కల్పిస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో తమాషా ఏమంటే సాధారణ దొంగను మనం అసహ్యించుకుంటాం! దొరికితే చావగొడతాం. రాజకీయ దొంగకు మాత్రం భజన చేస్తాం. వాడికోసం మనం పరస్పరం కొట్టుకు చస్తాం. ఇది మన సమాజంలో ఉన్న దౌర్భాగ్య పరిస్థితి. మంత్రాలకు చింతకాయలు రాలవు అని నిరక్షరాస్యులు కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వూతపదంగా వాడుతారు. కానీ పూజలప్పుడు మరల మంత్రాలు చదవడానికి పూజారిని పిలుస్తారు. అవకతవకలు కలిగిన ఈ దేశం, బాగుపడాలంటే.. సమాజం సమాజం లాగా ఉండాలంటే,.. హేతుబద్ధ ఆలోచనతో పాటు, వైజ్ఞానిక దృక్పథం అవసరం..
అడియాల శంకర్,
అధ్యక్షులు,తెలంగాణ హేతువాద సంఘం.
70930 62745