విద్యార్థులకు భరోసా అవసరం!
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో అనేక డిమాండ్లతో పాటు, తెలంగాణలో విద్యాభివృద్ధికి తోడ్పడే ముఖ్య అంశం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో అనేక డిమాండ్లతో పాటు, తెలంగాణలో విద్యాభివృద్ధికి తోడ్పడే ముఖ్య అంశం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా విద్యార్థులు ఇందులో ప్రత్యేక పాత్ర పోషించారు. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన తర్వాత కూడా తెలంగాణలో విద్యా నాణ్యతకు పెద్దగా చర్యలు తీసుకుంటున్న సందర్భాలు ఎక్కడా కనిపించడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చివరిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ (2023-24 ఆర్థిక సంవత్సరానికి) తో పోలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం జూలై నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో, విద్యాశాఖకు కేటాయించిన బడ్జెట్ 6.57 శాతం కంటే సుమారుగా నాలుగు శాతం ఎక్కువ. ఇది ఇప్పటికైతే చాలా మంచి విషయమైనప్పటికీ, చేయాల్సిన పనులు ఇంకా చాలానే ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అందజేస్తామని చెప్పారు. అయితే ఒక్క విద్యార్థికి ఇన్ని డబ్బులు ఇవ్వడం ఆచరణాత్మకంగా సాధ్యమేనా అనే సమస్య ఎదురవుతుంది. ఉదాహరణకి, తెలంగాణలో గత ఐదు సంవత్సరాలలో కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహించే ఆల్ ఇండియా హయ్యర్ ఎడ్యుకేషన్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం, తెలంగాణలో గత ఐదు సంవత్సరాలలో సగటు 1,123,560 విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ 5 లక్షలను విద్యా భరోసా కింద ప్రభుత్వం ఇస్తే, మొత్తం రూ.56,178 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది ఆచరణకు సాధ్యం కాని విషయం, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం మొత్తం విద్య రంగానికి బడ్జెట్ కేటాయిస్తున్నది రూ.21,292 కోట్లు మాత్రమే. అంతేకాదు, ఈ బడ్జెట్‌లోనే కనీసం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులకు కూడా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది.
ఆలోచన మంచిదైనప్పటికీ..
పైన చెప్పిన విధంగా రెండు నివేదికల ప్రకారం, తెలంగాణలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థుల సంఖ్య ఐదు సంవత్సరాల సగటు 1,90,969 విద్యార్థులు. వీరికి ఐదు లక్షలు ఇస్తే రూ. 9,548.45 కోట్ల ఖర్చు ప్రభుత్వానికి వస్తుంది. ఉదాహరణకి, మనం ప్రభుత్వం విద్యా రంగానికి కేటాయించిన బడ్జెట్‌లో ఈ నిధులను వాడుకుందాం అని అనుకుంటే, సుమారు 45% కేటాయించిన బడ్జెట్, పీజీ విద్యార్థులకు ఐదు లక్షలు విద్యా భరోసా కార్డు స్కీమ్‌కు ఇవ్వడానికే సరిపోతుంది. ఇంతేకాకుండా, పీహెచ్‌డీ విద్యార్థులు, ఈ నివేదిక ప్రకారం సగటున ఐదేళ్లలో (2016-17 నుంచి 2021-22 విడుదల చేసిన నివేదిక) ప్రకారం ఏడాదికి 4,839 విద్యార్థులు విశ్వవిద్యాలయాలలో పేర్లు నమోదు చేసుకున్నారు. కావున వీరికి ఐదు లక్షల చొప్పున ఇస్తే కనీసం 250 కోట్లు ఖర్చవుతుంది. ఇలా విద్యా భరోసా పథకం కింద కేవలం పీజీ, పీహెచ్‌డీ స్టూడెంట్స్‌కి ఐదు లక్షల చెప్పిన ప్రతి ఏడాది ఇస్తే కనీసం ప్రభుత్వానికి 10వేల కోట్లు కావాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆలోచన మంచిదైనప్పటికీ, ప్రస్తుత బడ్జెట్లను చూసినప్పుడు, ఇవి ప్రభుత్వాలు వాస్తవానికి అమలు చేసే ఆలోచనలో ఉండవని కనబడుతుంది.
ఇటువంటి పథకాలు ప్రవేశపెడితే..
ఇది కాకుండా, ప్రభుత్వం కనీసం పీజీ విద్యార్థులకు పీహెచ్‌డీ విద్యార్థులకు (పీజీ విద్యార్థులు కనీసం రూ. 5,000 చొప్పున ఇచ్చినా, పీహెచ్‌డీ స్టూడెంట్స్‌కి రూ. 25,000 చొప్పున ఇస్తే), ప్రతి నెల ప్రభుత్వానికి సుమారు రూ. 110 కోట్లు వెచ్చించవలసిన అవసరం ఉంటుంది. ఇది ఏడాదికి కనీసం రూ. 1,300 కోట్లను ఈ విద్యార్థులకు చెల్లించవలసి ఉంటుంది. ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం చూస్తే, ఇది పెద్ద ఖర్చు కాదు. కాబట్టి, ఐదు లక్షల ఆశల కంటే వాస్తవ దృష్టితో, కనీసం నెలకు రూ 5,000 చొప్పున ఉపకార వేతనంగా పీజీ చేసే విద్యార్థులకు ఇవ్వడమే బాగుంటుంది. దానితోపాటు, పీహెచ్‌డీ విద్యార్థులకు రూ. 25,000 రూపాయలు ఫెలోషిప్ సదుపాయాన్ని కల్పిస్తే బాగుంటుంది. ఇవే కాకుండా, పీజీ, పీహెచ్‌డీ స్టూడెంట్స్‌కి కాన్ఫరెన్స్‌లు, ఇతర ఫీల్డ్ విజిట్లకు అవసరమైన ఏడాదికి కొంత మటుకు అన్యువల్ కంటిన్యూజెన్సీ అలవెన్స్ సుమారు రూ. 10,000 నుంచి రూ 25,000 ఇవ్వడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటే మంచిది. ఇప్పటికైనా పార్టీల అతీతంగా ప్రభుత్వాలు ఇటువంటి పథకాలను ప్రవేశ పెట్టకపోతే, ఇదివరకే కుదేలైన ఉన్నత విద్యారంగం, ఇంకా కిందికి దిగజారి, తెలంగాణలో వచ్చే తరం విద్యావంతులు కరువయ్యే పరిస్థితి కూడా మరికొన్ని సంవత్సరాల్లో మనం చూడగలం. దీనికి పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
అశోక్ ధనావత్
98490 00628