ప్రతిభ దేశం దాటడం..దేశ ప్రగతికి విఘాతం!
students crossing the country is a disruption to the progress of the country
భారత్ గత చరిత్ర ఘనం! నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు భారత్ కీర్తి పతాకను జగద్విదితం చేశాయి. కానీ ప్రస్తుత పరిస్థితి వేరు..భారత్ విశ్వ గురు అని చెప్పుకుంటున్నాం కానీ ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయం లేదు ఒక్కటి కూడా లేదు! అందుకు సిగ్గుపడాలి. ఒకప్పుడు విదేశీయులు విద్య కోసం భారత్‌కి వచ్చేవారు. ప్రస్తుతం భారతీయ విద్యార్థులు విద్యా ఉపాధి అవకాశాల కోసం విదేశాల బాట పడుతున్నారు. గ్రాడ్యుయేషన్ వరకు ఇండియాలో మమ అనిపించి ఉన్నత చదువుల కోసం అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలకు క్యూ కడుతున్నారు. మరి దీనికి కారణం విద్య ఇండియాలో దొరకకనేనా? అంటే జవాబు అవును, కాదు అనాల్సి వస్తుంది.
వందలోపు ఒక్కటి లేదు!
ప్రస్తుతం దేశంలో నాణ్యమైన విద్య భారత్‌లో కరువయ్యింది. విద్యాలయాలు కేవలం నిరుద్యోగ తయారీ కర్మాగారాలుగా మారిపోయాయి. వారి చదువులు పూర్తయ్యాక ఉపాధి అవకాశాలు లభించడం లేదు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడం మాని తమ అభున్నతి లేదా పటిష్టత, తిరిగి అధికారంలోకి రావడం కోసం ఉచిత తాయిలాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు విదేశీ విద్యను అభ్యసించడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విద్యార్థుల కోసం ఖర్చు పెడుతుంది. కానీ విశ్వ విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందించడానికి, ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి మొగ్గు చూపడం లేదు. దేశంలోని టాప్ టెన్ యూనివర్సిటీలు ప్రపంచ ర్యాంకింగ్ చూస్తే నివ్వెర పోవాల్సిందే. ప్రపంచ ర్యాంకింగ్‌లో వందలోపు ర్యాంక్ కలిగిన ఒక్క విశ్వ విద్యాలయం మనకు లేదు.
Quacquarelli Symonds (QS) ప్రపంచ విశ్వ విద్యాలయ ర్యాంకింగ్ ప్రకారం, దేశంలోని మొదటి పది అత్యున్నత విద్యాసంస్థల ర్యాంకులు గమనిస్తే మన భారత విశ్వ విద్యాలయాల డొల్లతనం మనకు బోధపడుతుంది. ఈ ర్యాంకింగ్స్ ప్రకారం ఐఐటిబి 149, ఐఐటిడి 197, ఐఐఎస్‌సీ 225, ఐఐటి ఖరగ్‌పూర్ 271, ఐఐటి కాన్పూర్ 278, ఐఐటి మద్రాస్ 285, ఐఐటి గౌహతి 364, ఐఐటి రూర్కి 369, ఇలా వెయ్యిలోపు కేవలం 33 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. దీనిని బట్టి మన విద్యా సంస్థలలో నాణ్యతా ప్రమాణాలు ఏ మేరకు ఉన్నాయో అవగతమౌతుంది.
ఇక్కడ ప్రతిఫలం లభించక..
దేశంలోని యూనివర్సిటీల పరిస్థితి ఇలా ఉంటే, మనవారు మాత్రం విదేశాలకు వెళ్ళి తమ ప్రతిభ చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రముఖ కంపెనీల సిఈఓలందరూ భారతీయులు లేదా భారత సంతతి వారే! కానీ వారంతా అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లో వారి వారి కంపెనీలను నిర్వహిస్తూ ఆయా దేశాల ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడుతున్నారు. మరి వారంతా ఎందుకు ఇండియాలో సెటిల్ కాలేక పోయారు? ఇంకా ప్రతిరోజు వేలాది మంది ప్రతిభావంతులు చదువు, ఉద్యోగం పేరుతో విదేశాల బాట ఎందుకు పడుతున్నారు? చదువు పూర్తి అయ్యాక ఇండియాకి రావడం ఎందుకు మానేశారు? ఎక్కడ లోపం ఉంది! దానికి కారణం దేశంలో ఉపాధి అవకాశాలు లేకపోవడమే, వారి ప్రతిభకు తగ్గ ప్రతిఫలం లభించక పోవడమే. అందుకే వారు విదేశాల్లోనే ఉండి పోతూ ఆయా దేశాల సభ్యత్వం పొంది అక్కడే స్థిరపడి పోవడమే కాకుండా పేరున్న సంస్థల్లో మెరుగైన స్థానంలో, అత్యున్నత స్థాయిల్లో ఇంకా రాజకీయ రంగంలో కూడా ఎందరో భారత సంతతికి చెందిన వారు నిలదొక్కుకుంటున్నారు. ఎందరో విదేశాల్లో చక్రం తిప్పే స్థాయిలో ఉన్నారు.
ప్రభుత్వాలు..మౌనంగా ఉండొద్దు!
ప్రభుత్వాలు సంక్షేమ పథకాలపై పెట్టే శ్రద్ధ, వెచ్చించే ఖర్చు విద్య, వైద్యం మీద పెట్టాలి. విద్యార్థులకు కేజీ నుండి పీజీ దాకా నిర్బంధ ఉచిత నాణ్యమైన విద్యను అందించాలి. ప్రభుత్వ రంగ విద్యాలయాలను బలోపేతం చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం క్రింద వాటికి ఇచ్చే మొత్తం ప్రభుత్వ విద్యాలయాల పోషణకు ఖర్చు చేయాలి. పాఠశాల మొదలుకొని విశ్వ విద్యాలయాల వరకు బోధనా సిబ్బందిని నియమించాలి. విద్య మీద పెట్టుబడి రేపటి రాబడిగా భావించి ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలి. ఆర్థికంగా సామాజికంగా వెనక బడిన వర్గాలకు ఇతోధిక సాయం అందించి చదువుకునేలా ప్రోత్సహించాలి. అయితే ప్రతిభకు కొలమానం అందరికీ ఒకేలా ఉండాలి. కులం మతం ప్రతిభకు అడ్డు గోడలు కాకూడదు. చదువు అందరికీ అందుబాటులో ఉండాలి. ప్రతిభ గల విద్యార్థులు ఎవరైనా సమాన అవకాశాలు కల్పించాలి. ప్రతిభ సరిహద్దులు దాటకుండా చేయాలి! అరకొర వసతులతో చదువుకున్న మన విద్యార్థులు ఎంతో ప్రతిభను ప్రదర్శించడం ద్వారా విదేశీ కంపెనీలు పెద్ద పెద్ద మొత్తాల్లో వేతనాలు ఇవ్వ జూపుతున్నయి, ఇస్తున్నాయి. తద్వారా వారు విదేశాల్లో స్థిరపడుతున్నారు.
ఈ విధంగా ప్రతిభ దేశాలు దాటి పోతుంటే మౌనంగా చూడడం, విదేశీ మారకం వస్తుంది గదా అని సరిపెట్టుకోవడంతో దీర్ఘ కాలంలో భారతదేశ సామాజిక, రాజకీయ మనుగడపై పెను ప్రమాదం పొంచి ఉంది. అటు విద్యార్థులు కూడా కేవలం ఆర్థిక స్వావలంబన కోసం ఆలోచించకుండా మాతృదేశ ఔన్నత్యాని కాపాడాలి, దేశం కోసం తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించాలి. స్వంత లాభం కొంత మానుకొని దేశ ప్రగతికి పాటు పడాలి. అప్పుడే మాతృ దేశం ఋణం తీర్చుకున్న వారు అవుతారు. అలాగే రాజకీయ నాయకులు యువత భవిత కోసం బాటలు పరువాలి!
శిరందాస్ శ్రీనివాస్
నిజాం వైద్య విజ్ఞాన సంస్థ
94416 73339