నిజ చిత్రాల నిర్దేశకుడు బీఎస్

నిజ చిత్రాల నిర్దేశకుడు బీఎస్... special editorial on director bs narayana

Update: 2022-11-18 18:45 GMT

ఆయన 1977లో ప్రముఖ సీఎస్ రావు నవల ఆధారంగా తీసిన 'ఊరుమ్మడి బతుకులు' పీడిత జనాల జీవితాలకు అద్దం పట్టింది. మాధవి, సతేంద్రకుమార్ తదితరులు నటించారు. ఇది జాతీయ స్థాయిలో ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా బహుమతి గెలుచుకొంది. రాష్ట్ర స్థాయిలో నంది అవార్డును అందుకుంది. సినిమాలో శ్రీశ్రీ రాసిన 'శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయి' గేయాన్ని బీఎస్ వాడుకున్నారు. ఎస్‌పీ బాలసుబ్రమణ్యం గానం చేశాడు. గొప్ప ఉత్తేజకరంగా సాగుతుంది ఈ పాట. 1979 లో బీఎస్ నారాయణ తీసిన మరో గొప్ప సినిమా 'నిమజ్జనం'. ఇందులోని నటనకు నటి శారదకు జాతీయస్థాయిలో ఉత్తమ నటి అవార్డు వచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కూడా వచ్చింది. ప్రతిష్టాత్మక ఇండియన్ పనోరమాకు కూడా ఎంపికైంది.

సినిమాలలో తెర మీద మీ భావాలు చూపించడం కాదు, అసలైన జీవితాలను ఆవిష్కరించాలి. అప్పుడే ప్రేక్షకులు తమకు తామే వాస్తవాలను అర్థం చేసుకుంటారు. అభినందిస్తారు.' అంటారు ప్రపంచ ప్రసిద్ధ దర్శకుడు ఆండ్రీ తార్కొవిస్కీ. అలా వాస్తవిక జీవితాలను, సమాజాన్ని నిజాయితీగా తెరపైన ఆవిష్కరించినప్పుడే ఆ సినిమాకు లేదా మరే కళాత్మక వ్యక్తీకరణకు అయినా సార్థకత ఉంటుంది. శాశ్వతత్వమూ ఉంటుంది. అందుకే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడైనా అర్థవంత సృజనకే గౌరవమూ, ప్రజలపై దాని ప్రభావమూ వుంటాయి. సంఖ్యాపరంగా తక్కువగా వెలువడినప్పటికీ మంచి సినిమా దర్శకులకు, వారి సినిమాలకు దశాబ్దాలపాటు అన్వయముంటుంది.

ఆ కోవలో తెలుగు సినిమా రంగంలో తాను తన కెరీర్‌లో 31 సినిమాలకు పైగా తీసినప్పటికీ, రెండు మూడు వాస్తవ వాద సినిమాల ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపునూ, కీర్తినీ పొందినవారు బీఎస్ నారాయణ. తెలుగు సినిమాకు ఒక గుర్తింపునూ, గౌరవాన్ని తెచ్చిపెట్టారు. అప్పటికి అత్యంత వెనుకబడి ఉన్న తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో 1929 ఫిబ్రవరి 17న బీఎస్ నారాయణ జన్మించారు. తన మీద తనకున్న విశ్వాసామూ, సినిమా మీద ఉన్న మమకారం తో 23 యేళ్ల వయసులోనే 1952లో సినీ రంగ ప్రవేశం చేశారు. అకుంఠిత దీక్షతో అనేక కష్టాలకోర్చి నిలదొక్కుకున్నారు.

సాహసంతో మద్రాసుకు

అప్పటికి భారతదేశంలో సినిమా పరిశ్రమకు బాంబే (ముంబాయి), మద్రాస్ (చెన్నయి) ప్రధాన నిర్మాణ కేంద్రాలుగా ఉండేవి. దక్షిణాది భాషా చిత్రాలన్నింటికీ మద్రాసే కేంద్రం. దశాబ్దాల క్రితం కనీసం రైలు వసతి కూడా లేని ప్రాంతం నుండి సినిమాల కోసం మద్రాస్ వెళ్లే సాహసం చేసిన బీఎస్ నారాయణ దీక్షా పట్టుదలతో దర్శకుడిగా పెద్ద నటులతో సినిమాలు తీయగలిగారు. భారీ విజయాలను, అపజయాలనూ చవిచూశారు. సినిమా జిలుగు వెలుగుల ఛాయలో వుంటూనే సినీ కార్మికుల గురించి కృషి చేశారు. తనలాంటి దర్శకుల గురించీ తపన పడ్డారు. తన సినిమాల గురించి తనకే ఎక్కడో ఒక అసంతృప్తి ఉండేది.

ఎంతగా సామాజిక కుటుంబ ఇతివృత్తాలతో సినిమాలు నిర్మించినప్పటికీ, తన దారి ఇది కాదు, మరింకేదో చేయాలనే తపన వెంటాడింది. దీంతో ఊరుమ్మడి బతుకులు, నిమజ్జనం లాంటి సినిమాలతో తనని తాను నిరూపించుకున్నారు. అనారోగ్యంతో దృష్టిని కోల్పోయినా, మొక్కవోని దీక్షతో డాక్యుమెంటరీలు, ఒక పూర్తి నిడివి సినిమా తన ఊరిలోనే, తన‌వారి మధ్యనే నిర్మించి రికార్డులు నెలకొల్పారు. తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ఇదంతా ఆషామాషీగా జరగ లేదు. తెలంగాణ అంటేనే అత్యంత వివక్షకు, నిరాదరణకూ నెలవైన సినిమారంగంలో నిలదొక్కుకోవడం సాధారణ విషయం కాదు. సహనంతో ప్రతిభతో బీఎస్ నారాయణ అది సాధించారు.

రాజకీయాలలో ఇమడలేక

మొదట ఆయన నిజాంకు వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో చేరారు. జమలాపురం కేశవరావు, హయగ్రీవాచారి లాంటి వారితో కలిసి పనిచేశారు. రాజకీయాలలో ఇమడలేక తనకు గల సినిమా ఆసక్తి మేరకు మద్రాస్ పయనమయ్యారు. మొదట హనుమప్ప విశ్వనాథ్ బాబు (హెచ్‌వీ బాబు) వద్ద అసిస్టెంట్‌గా 'ఆదర్శం' సినిమాకు పని చేశారు. అందులో ప్రధాన పాత్రను కొంగర జగ్గయ్య పోషించారు. తర్వాత కేఎస్ ప్రకాశ్‌రావు, కేబీ తిలక్ వద్ద అసిస్టెంట్‌గాను, అసోసియేట్‌గాను పని చేశారు. 1960 తర్వాత తాను స్వంతంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. మొట్ట మొదట తీసిన సినిమా 'మాంగల్యం' రెండో సినిమా 1963లో 'ఎదురీత' 1963లోనే తన మూడవ సినిమా 'తిరుపతమ్మ కథ'కు దర్శకత్వం వహించారు.

విశాల హృదయాలు, ఆమె ఎవరు? ఆనంద నిలయం, శ్రీవారు మావారు, 'ఆడవాళ్లు అపనిందలు, ఆడది గడప దాటితే! సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎన్‌టీ.ఆర్, కృష్ణ, కాంతారావు లాంటి స్టార్ హీరోలతో విజయవంతమైన సినిమాలు తీసారు. తమిళంలోనూ ఉల్లాస పయనం, యార్నీ, తేదివంద, తిరుమగల్, దైవీగరవు తదితర సినిమాలను తీశాడు. కన్నడంలో మమథేయ భందన, జాణర జాణ, కానికే చిత్రాలు తీశారు. హిందీలో 20 సూత్రాల పథకం ఆధారంగా హేమామాలిని, వినోద్ మెహ్రా తదితరులతో ' ఏక్ నయీ ఇతిహాస్' సినిమా తీశారు.

ఆర్ట్ చిత్రాలతో ముందుకు

అప్పటికే దేశవ్యాప్తంగా ప్రధాన స్రవంతి సినిమా రంగానికి సమాంతరంగా ఆర్ట్ సినిమా వేళ్లూనుకుంటున్నది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో అవార్డులూ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రదర్శనలతో ఆ నవ్య సినిమా విచ్చుకుంటున్నది, ముఖ్యంగా బెంగాల్, కేరళ, కన్నడ సినిమా రంగంలో ఆ ఒరవడి ఎక్కువగా సాగింది. తెలుగులో కూడా ప్రయత్నాలు మొదలయ్యాయి. మృణాల్‌సేన్ (ఒకవూరి కథ), శ్యామ్ బెనెగల్ (అనుగ్రహం) లాంటి చిత్రాల వెలుగులో బీఎస్.నారాయణ తెలుగులో తీసిన నిమజ్జనం, ఊరుమ్మడి బతుకులు జాతీయ స్థాయిలో ఆర్ట్ సినిమా ప్రతినిధులుగా నిలిచాయి. అనంతరం అదే దారిలో కళాత్మకత, వాస్తవిక చిత్రాలు తీశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గుర్తింపును అందుకున్నారు. తెలుగు సినిమాకు పేరు తెచ్చిపెట్టారు.

అతి తక్కువ బడ్జెట్‌తో ఆయన 1977లో ప్రముఖ సీఎస్ రావు నవల ఆధారంగా తీసిన 'ఊరుమ్మడి బతుకులు' పీడిత జనాల జీవితాలకు అద్దం పట్టింది. మాధవి, సతేంద్రకుమార్ తదితరులు నటించారు. ఇది జాతీయ స్థాయిలో ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా బహుమతి గెలుచుకొంది. రాష్ట్ర స్థాయిలో నంది అవార్డును అందుకుంది. సినిమాలో శ్రీశ్రీ రాసిన 'శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయి' గేయాన్ని బీఎస్ వాడుకున్నారు. ఎస్‌పీ బాలసుబ్రమణ్యం గానం చేశాడు. గొప్ప ఉత్తేజకరంగా సాగుతుంది ఈ పాట. 1979 లో బీఎస్ నారాయణ తీసిన మరో గొప్ప సినిమా 'నిమజ్జనం'. ఇందులోని నటనకు నటి శారదకు జాతీయస్థాయిలో ఉత్తమ నటి అవార్డు వచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు కూడా వచ్చింది. ప్రతిష్టాత్మక ఇండియన్ పనోరమాకు కూడా ఎంపికైంది. 1994 నవంబర్ 23న బీఎస్ నారాయణ ఈ లోకం నుంచి నిష్క్రమించారు.

(నవంబర్ 23 బీఎస్ నారాయణ వర్ధంతి)


వారాల ఆనంద్

94405 01281

Tags:    

Similar News