విద్యార్థి నాయకుడి నుంచి ఉప రాష్ట్రపతి దాకా వెంకయ్య ప్రస్థానం

ఆయన అసలు సిసలైన ఆంధ్రుల వేషధారణలో ఉంటారు. తెల్లటి పంచె కట్టుతో చూస్తేనే తెలుగు తేజం ఉట్టి పడుతుంది. మోముపై చెరగని చిరునవ్వు.

Update: 2022-08-09 18:45 GMT

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా 2002 నుండి 2004 వరకు పని చేశారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికలలో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహించి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీలో ఎక్కడ అంతర్గత సంక్షోభం సంభవించినా పార్టీ దూతగా వెళ్లి సమస్య సమసిపోయేలా చేసేవారు. జాతీయ నేతలతో ఆప్యాయంగా 'వెంకయ్యాజీ' అని పిలిపించుకున్న నాయకుడు. వెంకయ్య సేవలు దేశానికి అవసరం ఉందని ,ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం బీజేపి పార్టీలో తనకున్న ప్రత్యేకతను చాటి చెబుతుంది. రాజ్యసభ చైర్మన్‌గా సభను నడిపించడంలో అతనికి అతడే సాటి. కీలక బిల్లులైన 370 ఆర్టికల్ రద్దు, జమ్ము కాశ్మీర్ విభజన లాంటి బిల్లుల విషయంలో, రాజ్యసభలో గట్టెక్కించి ప్రభుత్వానికి ఉపశమనం కలిగించారు.

యన అసలు సిసలైన ఆంధ్రుల వేషధారణలో ఉంటారు. తెల్లటి పంచె కట్టుతో చూస్తేనే తెలుగు తేజం ఉట్టి పడుతుంది. మోముపై చెరగని చిరునవ్వు. అన్ని భాషలతో పరిచయం ఉన్న మేధావి. ఆయన ప్రసంగం ఆద్యంతం అంత్య ప్రాసలతో, పండిత పామర జనరంజకం. భారతీయ జనతా పార్టీకి పట్టుగొమ్మ. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, విశేష అనుభవం. ఉపరాష్ట్రపతిగా ఆ పదవికే వన్నె తెచ్చిన జనహృదయనేత. పరాయి భాష కంటే మాతృభాషను బాగా గౌరవించే మనిషి. 'మాతృభాష కళ్ల వంటిది. పరాయి భాష కళ్లద్దాల వంటిది' అని చెబుతుంటారు. కళ్లు ఉంటేనే కళ్లద్దాలు. అలాగే మాతృభాష వస్తేనే వేరే భాషలు నేర్చుకోవాలంటారు ముప్పవరపు వెంకయ్యనాయుడు. దేశ ప్రథమ పౌరుడి పదవి తర్వాత రెండవ అతిపెద్ద పదవి అయినా ఉపరాష్ట్ర పదవి అలంకరించిన నేత.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని సాధారణ మధ్యతరగతి కుటుంబంలో 01 జూలై 1949 న రంగయ్య నాయుడు, రమణమ్మ దంపతులకు జన్మించారు. నెల్లూరులో డిగ్రీ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. విద్యార్థిగా ఉన్నప్పటినుండే వెంకయ్య నాయుడు ప్రజా సంక్షేమానికి పాటుపడ్డారు. 1973-74 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడే అతనిలో రాజకీయ లక్షణాలు కనిపించాయి. మూడు సంవత్సరాలు జనతా పార్టీ యువ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978లో తొలిసారి ఉదయగిరి శాసనసభ నియోజకవర్గము నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు 1980లో బీజేపీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. 1985లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1988లో అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1998లో రాజ్యసభకు మొదటిసారిగా ఎన్నికయ్యారు.

అనేక పదవులు అలంకరించి

దాదాపు 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో రెండుమార్లు శాసనసభ్యుడిగా, జాతీయ రాజకీయాలలో చేరిన తర్వాత సుదీర్ఘకాలం రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో తన వాక్ చాతుర్యంతో దేశవ్యాప్తంగా విశేష ప్రజాభిమానాన్ని కూడగట్టుకున్న రాజకీయ విజ్ఞుడు వెంకయ్య. నూనూగు మీసాల వయసులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరి క్రమశిక్షణకు మారుపేరుగా ఎదిగారు. ఆనాటి జనసంఘ్ నాయకుడైన అటల్ బిహారీ వాజ్‌పాయ్ ఉపన్యాసానికి ఆకర్షితుడై అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా, ప్రజాసేవకై రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, విలక్షణమైన నాయకుడిగా అచిరకాలంలోనే ఎదిగారు. జేపీగా పేరుగాంచిన జయప్రకాష్ నారాయణ మొదలుపెట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా వెంకయ్యది ముఖ్య భూమిక. జన‌సంఘ్ నుంచా బీజేపీ ఆవిర్భవించిన తర్వాత అందులో చేరి విశేష సేవలు అందించారు. ఆనాటి అగ్రనేతలైన వాజ్‌పాయ్, అద్వానీ ప్రసంగాలను తెలుగులోకి అనువదించారు. బీజేపీకి రథయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా వైభవం తీసుకొచ్చిన లాల్ కిషన్ అద్వానీకి అత్యంత సన్నిహితుడు. అగ్ర నేతల అభిమానాన్ని చూరగొన్న తెలుగు బిడ్డ. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు నరేంద్ర మోడీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా గట్టిగా సమర్ధించారు. కేంద్ర పట్టణాభివృద్ధి గ్రామీణ శాఖ అభివృద్ధి మంత్రిగా పనిచేసి ఆ శాఖలకే వన్నె తెచ్చారు.

నేర్పుతో, ఓర్పుతో

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా 2002 నుండి 2004 వరకు పని చేశారు. అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికలలో పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహించి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీలో ఎక్కడ అంతర్గత సంక్షోభం సంభవించినా పార్టీ దూతగా వెళ్లి సమస్య సమసిపోయేలా చేసేవారు. జాతీయ నేతలతో ఆప్యాయంగా 'వెంకయ్యాజీ' అని పిలిపించుకున్న నాయకుడు. వెంకయ్య సేవలు దేశానికి అవసరం ఉందని ,ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం బీజేపి పార్టీలో తనకున్న ప్రత్యేకతను చాటి చెబుతుంది.

రాజ్యసభ చైర్మన్‌గా సభను నడిపించడంలో అతనికి అతడే సాటి. కీలక బిల్లులైన 370 ఆర్టికల్ రద్దు, జమ్ము కాశ్మీర్ విభజన లాంటి బిల్లుల విషయంలో, రాజ్యసభలో గట్టెక్కించి ప్రభుత్వానికి ఉపశమనం కలిగించారు. తన నేర్పుతో, ఓపికతో ఎలాంటి సమస్యనైనా వేగంగా పరిష్కరించడంలో ఆయన దిట్ట. పెద్దరికంతో, హుందాగా వ్యవహరిస్తూ, కఠిన చర్యలు కూడా వెనుకాడని నాయకుడు వెంకయ్యనాయుడు. ఆయన సేవలు అజరామరం. 2022 ఆగస్టు పదిన ఆయన పదవీ కాలం ముగియనుంది.

యాడవరం చంద్రకాంత్ గౌడ్

సిద్దిపేట, 94417 62105

Tags:    

Similar News