లాల్ సింగ్ చద్దా సినిమా ఎందుకు వివాదమైంది? సినిమాలో ఏముంది?

లాల్ సింగ్ చద్దా' వివాదాల దుమారం రేపుతున్న ఈ బాలీవుడ్ సినిమాలో ఒక సున్నితమైన డైలాగు ఉంటుంది. హీరో అమీర్‌ఖాన్ (లాల్‌సింగ్) కార్గిల్‌లో

Update: 2022-08-17 18:45 GMT

లాల్ సింగ్ చద్దా' వివాదాల దుమారం రేపుతున్న ఈ బాలీవుడ్ సినిమాలో ఒక సున్నితమైన డైలాగు ఉంటుంది. హీరో అమీర్‌ఖాన్ (లాల్‌సింగ్) కార్గిల్‌లో వీరోచిత పోరాటం చేస్తాడు. యుద్ధభూమిలో గాయపడిన భారత సైనికులతోపాటు, పొరపాటుగా శత్రుదేశం పాకిస్తాన్‌కు చెందిన సైనికుడిని కూడా కాపాడుతాడు. ఆ విషయం శత్రువు చెప్పేవరకు లాల్‌సింగ్‌కు తెలవదు. యుద్ధానంతరం చాలా రోజుల నుంచి లాల్‌సింగ్‌ను దగ్గరగా గమనించిన మహమ్మద్ పాజి 'ఒక మంచి మనసున్న నీవు అసలు పూజలు, ప్రార్థనలు చేయగా నేనింతవరకూ చూడలేదు. ఎందుకని?' అడుగుతాడు.

'ఏమో వాటి వల్ల మలేరియా ప్రబలుతుందని మా అమ్మ చెప్పిందని' అమాయకంగా చెబుతాడు లాల్‌సింగ్. పాకిస్తాన్ సైనికుడు ఆ జవాబుతో ఆశ్చర్యంతో, ఆలోచనలో పడతాడు. 'ఓహో మతం అనేది ఒక మలేరియా లాంటిదా? నిజమే మా దేశంలో మత చాందసం మనుషులను నాశనం చేస్తుంది. పాకిస్తాన్‌కు వెళ్లి ఒక మంచి పాఠశాలను ఏర్పాటు చేసి మతం లేని సమాజాన్ని సృష్టిస్తానని, మానవత్వాన్ని చాటి చెబుతానని' అంటాడు.

ఆ దాఖలాలేమీ లేవు

గతంలో పీకే సినిమాలో మాదిరిగా అమీర్‌ఖాన్ హిందువులు, సిక్కుల పూజాపాట్‌ను కూడా మలేరియాతో పోల్చారని, సినిమా చూడని చాలామంది సోషల్ మీడియా కేంద్రంగా ప్రచారం చేస్తున్నారు. కానీ, సినిమా చూస్తే ఒక మతాన్ని కానీ, కులాన్ని కానీ కించపరిచిన దాఖలాలు కనిపించవు. మూడు దశాబ్దాల క్రితం కొత్త ట్రెండుకు తెర తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న హాలీవుడ్ సినిమా 'ఫారెస్ట్ గంప్' రీమేక్‌గా ఈ చిత్ర నిర్మాణానికి అమీర్ ఖాన్ సాహసమే చేశారని చెప్పాలి. 1994లో విడుదలైన 'ఫారెస్ట్ గంప్' సినిమాలో కొన్ని మార్పులు చేసి భారతదేశానికి అనుకూలంగా మలిచి దేశభక్తిని, త్యాగం, మమతానురాగాల సెంటిమెంటును జోడించి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విడుదల కాకముందు నుంచే 'సోషల్ బైకాట్' అనే పదం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది.

పీకేలో మాదిరిగా 'లాల్ సింగ్ చద్దా' లో కూడా భారత సైనికుల వీరత్వాన్ని పరిహసించే విధంగా, హిందువులు, సిక్కుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దృశ్యాలు, డైలాగులు ఉన్నాయని ప్రచారం జరిగింది. అమీర్‌ఖాన్ నిర్మించిన 'లాల్ సింగ్ చద్ధా'ను బహిష్కరించాలని, సినిమా చూడకపోవడం వలన మిగిలిన డబ్బులతో పేదలకు దానం చేయాలని కొన్ని సంఘాలు బలమైన ప్రచారం చేశాయి. 'లాల్ సింగ్ చద్దా' కు మద్దతుగా మాట్లాడిన వారి సినిమాలను కూడా బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే 'బాలీవుడ్ బాయికాట్' అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతున్నది. 'లాల్ సింగ్ చద్దా' సినిమా మంచిగా ఉందని ట్వీట్ చేసిన బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌కు కూడా ఈ సెగ తగిలింది.

అసలు కథ ఇది

అసలు ఇంతగా దుమారం రేపుతున్న 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో ఏముంది? ఇదే ఆసక్తితో థియేటర్‌లో సినిమా చూడడానికి మిత్రులతో కలిసి వెళ్లాను. 'బాలీవుడ్ బాయ్ కాట్' ప్రభావం చాలానే ఉన్నట్టు స్పష్టమైంది. దాదాపు 300 సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్‌లో 60 మందే కనిపించారు. హీరో రైలులో తన చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ తోటి ప్రయాణికురాలికి తన జీవిత కథ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. పంజాబ్‌లోని ఒక సిక్కు కుటుంబం కథ నేపథ్యంలో కొనసాగుతుంది. అంగవైకల్యంతో బాధపడుతున్న లాల్ సింగ్ చద్దాకు అతని తల్లి వెన్నుదన్నుగా నిలిచి ధైర్యం నూరిపోస్తుంది. బాల్య స్నేహితురాలు రూప(మోనికా బేడీ) సహాయంతో లాల్ తక్కువ కాలంలోనే అంగవైకల్యాన్ని జయించి రన్నింగ్‌లో విన్నరుగా నిలుస్తాడు.

ఎమర్జెన్సీ, స్వర్ణ మందిరంలో బ్లూ స్టార్ ఆపరేషన్, ఇందిరాగాంధీ హత్య, సిక్కుల ఊచకోత, బాబ్రీ మజీద్ ధ్వంసం అనంతరం చోటుచేసుకున్న అల్లర్లను దర్శకుడు సినిమాలో సున్నితంగా చిత్రీకరించారు. దేశంలో ఎప్పుడూ అల్లర్లు జరిగినా లాల్‌సింగ్ తల్లి 'మలేరియా ప్రబలుతోంది. వారం రోజుల పాటు గదిలోనే ఉండాలని' ఆదేశిస్తుంటుంది. దీంతో అల్లర్లను హీరో మలేరియా అనే భ్రమలో ఉంటాడు. హీరోయిన్ కరీనా కపూర్ సినిమా రంగంలోకి వచ్చి మాఫియా డాన్ అబ్బాస్ హాజీ చేతిలో చిక్కడం, లాల్‌సింగ్ ఆమెను ఆదరించడం, క్యాన్సర్ వ్యాధితో రూపా చనిపోవడం వంటి దృశ్యాలు కంటతడి పెట్టిస్తాయి. వాస్తవానికి అమీర్‌ఖాన్ ఈ సినిమాలో ఏ మాత్రం పొరపాటు జరగకుండా, ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కార్గిల్ యుద్ధంలో నేలకొరిగిన బాలాజీ (నాగచైతన్య)ని లాల్‌సింగ్ విపరీతంగా ప్రేమిస్తాడు. ఎక్కడ కూడా కుల మతాలను కించపరిచే విధంగా సన్నివేశాలు లేవు. దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ చిత్రం ఉందని చెప్పవచ్చు.

మ్యాడమ్ మధుసూదన్

99497 74458

Tags:    

Similar News