'చిత్ర' పదబంధాల మోళి…పింగళి

special article about screenwriter and lyricist pingali nagendra rao

Update: 2023-05-27 00:15 GMT

‘తీర్చని అప్పుకి ఎంత వడ్డీ అయితేంటి..’ ఈ డైలాగ్ 1959 నాటిది. నేటికీ ‘రుణానందలహరి’ అప్పారావులకు వేద వాక్యమే. అప్పులు ఎలా చేయాలి.. ఎందుకు చేయాలి.. వాటి అవసరం.. ఆవశ్యకతలను గూర్చి సి.ఎస్.ఆర్.చే అద్భుతమైన హాస్య సంభాషణలను చెప్పించిన మాటల మాంత్రికుడు పింగళి నాగేంద్రరావు. అంతేనా.. గిడి.. గిడి, “సాహసం చేయరా డింభకా, రాజకుమారి దక్కును’ ‘నరుడా! ఏమి నీ కోరిక’ (ఈ పేరు మీద ఒక సినిమా కూడా వచ్చింది) ‘హై హై నాయకా’ ‘అహ నా పెళ్ళంట’ ‘ఓహో నా పెళ్ళంట’ ‘నిజం చెప్పమంటారా.. అబద్ధం చెప్పమంటారా మహరాజా’ ఇలా కొత్త కొత్త మాటలను పింగళి వారు అలవోకగా రాసేసారనిపిస్తుంది.

ఇవన్నీ నేటికీ ఎక్కడపడితే’ అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. ‘మాయాబజార్’ చిత్రంలో గింబలి, వీరతాళ్ళు, ఎవరూ కనిపెట్టకపోతే భాష ఎలా పుడుతుంది. ‘దుష్ట చతుష్టయం’ పింగళి వారి ‘చిత్రమైన పదబంధాల మోళిలే. ఆయన కలం ఓ ఇంద్రజాలం. ఆయనో మాటల యంత్రం. 1935 నుండి 1971 వరకు అనేక చిత్రాల్లో కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం చేసి కొత్త రికార్డు ఏర్పాటు చేసుకున్న సంభాషణల రచయితాయన. ఆయన పాటలు అజరామరం. మాటలు భాషా సుగంధాల పూదోటలు, ఆయన సృష్టించిన పాత్రలు నిత్య నూతనాలు. ఆయన పాళి… నేపాలి మాంత్రికుడి మంత్రదండం. 'విజయ'వంతమైన చలనచిత్ర ప్రస్థానం ఆయన చరితం.

జనం కోరేవి చే(రా)స్తూ!

పింగళి నాగేంద్రరావు 1901 డిసెంబర్ 29న శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి( ప్రస్తుతం విజయనగరం జిల్లా) రాజాంలో జన్మించారు. ఆరున్నర పదుల వయసు వరకు అవిశ్రాంతంగా రచయిత, పత్రికా ఉపసంపాదకుడుగా రచనలు చేశారు. తండ్రి గోపాలకృష్ణయ్య. తల్లి మహాలక్ష్మమ్మ. ఈయన అన్న శ్రీరాములు 1913 లోనే ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. పంచదార ఎగుమతి వ్యాపారం చేసేవారు. చిన్నతనం అంతా తల్లి గారి ఊరైన కృష్ణా జిల్లా దివి పరిసరాలలో గడిచింది. ఆంధ్ర జాతీయ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కళాశాలలో చదివే సమయంలోనే మంగినపూడి పురుషోత్తమ శర్మ, మాధవపెద్ది వెంకట్రామయ్య, కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు తదితరుల పరిచయం కలిగింది. 1918 తర్వాత రైల్వేలో ఉద్యోగిగా చేరారు. ప్రసిద్ధ వ్యాయామ వేత్త రామ జోగారావు గారి దేశభక్తి ఉపన్యాసాలు వలన పింగళి వారిలో జాతీయోత్సాహం కలిగింది. 1920లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఉత్తర దేశ యాత్ర చేశారు. దివ్యజ్ఞాన సమాజం సభ్యులుగా చేరారు. కాంగ్రెసులో చేరి దేశ సేవ చేయాలనుకున్నారు. కాంగ్రెస్ ఆర్గనైజర్‌గా ఉద్యోగం చేశారు. అక్కడనే దేశభక్తి పద్యాలు రచించి ‘జన్మభూమి’ అనే పుస్తకంగా ముద్రించారు. పట్టాభి సీతారామయ్య గారి మాటల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

పింగళి నాగేంద్ర రావు తన రచన వ్యాసంగాన్ని శారద పత్రికతో ప్రారంభించారు. అది కేతు శ్రీరామ శాస్త్రి 1923లో మొదలెట్టిన పత్రిక. సీతారామయ్య సలహా మేరకు పింగళి ఆ పత్రికలో చేరి శ్రీరామశాస్త్రికి సహాయకుడిగా పత్రికను నడపసాగారు. పత్రికలో పని చేస్తున్న సమయంలోనే ఆయన ద్విజేంద్ర లాల్ రాయ్ బెంగాలీ నాటకాలు మేవాడ్ పతన్, పాషాణి తర్జుమా చేసి ‘కృష్ణా పత్రిక’లో ప్రచురించారు. ‘నా రాజు’ భారతిలో ప్రచురితమైంది. ‘జేబున్నీసా’ నాటకాన్ని మద్రాసు ప్రభుత్వం ‘హిందూ ముస్లిం’ గొడవలకు కారణమవుతుందని 1923లో ప్రదర్శనను నిషేధించింది. నాటక రచన, ప్రదర్శన సమయంలోనే ఆయనకు ప్రేక్షకుల నాడి తెలిసింది. ‘జనం కోరింది మనం సేయాలా... మనం చేసింది జనం సూడాలా’ అనే ప్రశ్నకు ఆయనకు సమాధానం దొరికింది. ‘జనం కోరిందే ఆయన చే(రా)శారు’. ‘వింధ్య రాణి’ నాటకం విజయం కొంతమంది మిత్రులతో సినిమాగా తీసే నిర్ణయం జరిగింది. వీరికి ఆరు రీళ్ళ సినిమా ‘తారుమారు’ తీసిన ఎస్. జగన్నాథ్ కలిశారు. ఈ జగన్నాథ్ తీసిన సినిమా మోలియర్ నాటకానికి అనుకరణ ‘భలే పెళ్లి’. ఈ సినిమాకి రచయిత పింగళి నాగేంద్రరావు.

రచనా వైదుష్యం తెలిసి..

‘భలే పెళ్లి’ ఆయన మొదటి సినిమా. ఈ చిత్రం ఆయనను చిత్రరంగంలో నిలదొక్కుకునేటట్లు చేయలేదు. రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. ఫిల్మ్ కరువవడం చేత మద్రాసు చిత్ర పరిశ్రమ చతికిలపడింది. నాటకాలాడుకోవడం కోసం పింగళి బందరు వెళ్లిపోయారు. ‘వింధ్యరాణి’ చిత్రానికి 1946 కలిసి వచ్చింది. జెమినీ స్టూడియో సహకారం వైజయంతి ఫిలింస్ సంస్థకు లభించింది. సి.పుల్లయ్యను దర్శకుడిగా ఎన్నుకున్నారు. డి.వి. సుబ్బారావు, పుష్పవల్లి (నటి రేఖ తల్లి), రేలంగి, జీ. వరలక్ష్మి ప్రభృతులు పాత్రధారులు. పింగళి నాగేంద్రరావుకు పిలుపు వెళ్ళింది. ఆయన సి. పుల్లయ్యతో కలిసి స్క్రిప్ట్ తయారు చేశారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే కే.వి.రెడ్డితో పరిచయం జరిగింది. ‘వాహిని’ తీస్తున్న ‘యోగి వేమన’కు ఆయన దగ్గర సహాయ దర్శకులుగా పనిచేస్తున్న కమలాకర కామేశ్వరరావు పరిచయం పింగళి వారికి దొరికింది. కామేశ్వరరావు కూడా బందరువాసే..! పింగళి వారి ‘రచనా వైదుష్యం’ తెలిసిన కె.వి.రెడ్డి తాను తీయబోయే ‘గుణసుందరి కథ’కు నాగేంద్రరావును రచయితగా తీసుకున్నారు. వీరిద్దరి కలయిక తెలుగు చలనచిత్ర స్వర్ణయుగపు చిత్రాలకు శ్రీకారం చుట్టిందని చెప్పాలి. కే.వి.రెడ్డి దర్శకత్వం పింగళి రచనలో హయతి, కాలమతి వంటి హాస్య పాత్రలు తెలుగు ప్రేక్షకులను నవ్వించాయి. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గుణసుందరి కథ’ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిన చరిత్ర. కస్తూరి శివరావు ప్రధాన పాత్రగా వచ్చిన ఈ చిత్రంలో ‘గిడి గిడి’ వంటి సంభాషణలు ఎంతగానో అలరించాయి.

‘గుణసుందరి కథ’ విజయం పింగళి నాగేంద్రరావుని ‘విజయ’వంతమైన రచయితగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది. ‘వాహిని’ విజయ వారి నిర్వహణలోకి వచ్చింది. ‘గుణసుందరి’ నిర్మాణం జరుగుతున్న సమయంలోనే విజయవారు తదుపరి చిత్రాలపై దృష్టి పెట్టారు. ఈ కారణంగా కమలాకర కామేశ్వరరావు పింగళి వారిని తమ సంస్థలోకి తీసుకున్నారు. కే.వి.రెడ్డి, పింగళి ద్వయంలో తయారైన ద్వితీయ చిత్రం ‘పాతాళభైరవి’. ఈ చిత్ర విజయం కూడా చరిత్రగా మారింది. చిత్ర నిర్మాణంలో ‘విజయ’ గొప్ప ప్రమాణాలు పాటించింది. ఇండియాలో జరిగిన ‘అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’లో దీనిని ప్రదర్శించారు. ‘పాతాళభైరవి’లో, అంజి, డింగరి, తోటరాముడు, నేపాళీ మాంత్రికుడు వంటి పాత్రల యొక్క రూపకల్పన పింగళి వారి ప్రతిభకు తార్కాణం. ‘జగదేకవీరుని కథ’లో ‘హే రాజన్’ అనే పదం ఆనాటి కుర్రకారు ఊతపదమైంది. ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’, ‘మిస్సమ్మ’, ‘అప్పుచేసి పప్పుకూడు’, ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘సి.ఐ.డి.’, ‘గుండమ్మ కథ’ ఇలా 18 సినిమాలు పింగళి వారి కలం బలం వలన నేటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దిగ్విజయంగా వివిధ ఛానల్స్ లో ప్రదర్శితమవుతున్నాయి. ఆయన చిత్రాలలోని పాటలను ఒక్కసారి మననం చేసుకుంటే ‘మనస్సు’లో వెన్నెల రాత్రులు విరబూస్తాయి. ‘మాయాబజార్’ ‘గుండమ్మ కథ’ ‘మిస్సమ్మ’ ‘పెళ్లినాటి ప్రమాణాలు’ ‘అప్పుచేసి పప్పుకూడు’ తదితర చిత్రాలలోని వెన్నెలలో చిత్రించిన పాటలు వినండి... ‘పగలే వెన్నెల జగమే ఊయల’ అనే సి.నా.రే. వ్యాఖ్యానం నిజమనిపిస్తుంది. సాహిత్యానికి తగిన సంగీతం, సంగీతానికి తగిన సాహిత్యం అందించడమే పింగళి వారి ‘పాళీ’ మహత్తు.

ఆయన కథలందించిన చిత్రాలు ‘అగ్గి మీద గుగ్గిలం’ ‘పెళ్లినాటి ప్రమాణాలు’ ‘పాతాళభైరవి’ ‘వింధ్యారాణి’ వీటిలో ఒక రకమైన వర్గస్వామ్యం కనిపిస్తుంది. పేదలు, పెద్దలు (సంపన్నులు)మధ్య సఖ్యత సమసమాజ నిర్మాణానికి అవసరమని చెప్తుంది. ‘అగ్గిమీద..’ సినిమాలో చిత్ర విచిత్రమైన సన్నివేశాల రూపకల్పనలో పింగళి వారి ముద్ర బలంగా కనిపిస్తుంది. ఆయన ‘ఎదిగిన’ ఎరిగిన దేశభక్తి నేపథ్యం ఆయన కథ అందించిన చిత్రాలలో అంతర్లీనంగా చిత్రించడమైనదని చెప్పాలి. ‘రచయిత జీవించడానికి, రాయడానికి డబ్బు సంపాదించాలి. కానీ అతను ఏ విధంగానూ డబ్బు సంపాదించడం కోసం జీవించకూడదు, రాయకూడద’నే మార్క్స్ వ్యాఖ్యానంను జీవిత సూత్రంగా నమ్మిన రచయిత, పత్రికా సంపాదకుడు పింగళి నాగేంద్రరావు.

భమిడిపాటి గౌరీ శంకర్

9492858395

Tags:    

Similar News