దొరను ఎదిరించిన దీర వనిత ఐలమ్మ గురించి తెలుసా

చిట్యాల ఐలమ్మ' ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ 'చాకలి ఐలమ్మ' అంటే తెలియనివారుండరు. తెలంగాణలో పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా, ఆత్మగౌరవ

Update: 2022-09-09 18:30 GMT

చిట్యాల ఐలమ్మ' ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ 'చాకలి ఐలమ్మ' అంటే తెలియనివారుండరు. తెలంగాణలో పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా, ఆత్మగౌరవ పోరాట రణ నినాదాన్ని వినిపించి, దొరలను గడీల నుంచి ఉరికించిన వీరవనిత. తెలంగాణ పౌరుషాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని భావి తరాలకు అందించి ఉద్యమస్ఫూర్తిని రగిల్చిన పోరాట యోధురాలు. అన్యాయాన్ని నిలదీసిన సివంగి. 26 సెప్టెంబరు 1895 న వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో పేద రజక కుటుంబంలో జన్మించింది ఐలమ్మ. చిన్న చితక కులాలు, చేతి వృత్తుల వారు అరిగోస పడుతున్న కాలమది. పటేల్, పట్వారీలు, భూస్వాముల పదఘట్టనల కింద అణగారుతున్న రోజులవి. తెలంగాణలో ఆనాటి సామాజిక పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉండేవి.

అణగారిన వర్గాల ప్రజలు దొరలు, భూస్వాములకు, పటేల్, పట్వారీలకు భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ దయనీయంగా బతకాల్సిన పరిస్థితి. శ్రామిక మహిళల మాన, ప్రాణాలకు రక్షణ అసలు ఉండేది కాదు. అలాంటి తరుణంలో వెలుగు రేఖలా దూసుకొచ్చింది ఐలమ్మ. ఆమెకు చిన్నవయసులోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో పెళ్లి అయింది. ఐదుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. పెద్ద కుటుంబం కావడంతో పూట గడవడం కష్టంగా ఉండేది. వృత్తి పని చేసినా సరైన భుక్తి కలిగేది కాదు. దీంతో పాలకుర్తి పరిసరాలలో మల్లంపల్లి దొర వద్ద రెండు ఎకరాల భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకొని సాగు చేసేది. ఇది పాలకుర్తి పొరుగునే ఉన్న విస్నూరు దొర రామచంద్రారెడ్డికి కోపం తెప్పించింది. ఐలమ్మ కుటుంబం సొంతంగా భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకోవడం సహించలేకపోయాడు. నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం జిల్లాల పెద్ద దేశ్‌ముఖ్‌లలో విస్నూరు రామచంద్రారెడ్డి ఒకరు. జనగామ తాలూకాలోని 40 గ్రామాలలో 40 వేల ఎకరాల భూమి ఉన్న దేశ్‌ముఖ్‌ ఆయన. విస్నూరు దొరకు నరరూప రాక్షసుడనే పేరు ఉండేది.

ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా

ఆ రోజులలో బువ్వకు లేనోళ్లు భూమి గురించి ఆరాటపడటమంటే తలెత్తుకొని సగర్వంగా నిలబడటం కిందే లెక్క. అది దొర ఆధిపత్యానికి సవాల్‌ అన్నమాటే. ఐలమ్మ దొరను ఎదిరించి పంట పండించింది. దీంతో విస్నూరు రామచంద్రారెడ్డి ఐలమ్మ భర్తను, కొడుకును జైలుపాలు చేశాడు. ఐలమ్మ పంటలను గూండాలతో కొల్లగొట్టించాలని చూశాడు. ఐలమ్మ ధీరోదాత్తం గా నిలబడి, కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేతబట్టి సివంగి వలే గర్జించి ఎదిరించింది. కమ్యూనిస్టు కార్యకర్తల సహాయంతో గూండాలను తరిమికొట్టింది. ఒడుపుగా పంటను ఇంటికి చేర్చింది. దీంతో ఐలమ్మపై దొర మరింత కక్ష పెంచుకుని ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు. అయినా ఆమె ఏ మాత్రం జంకకుండా ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా చేసుకొని ఎదిరించేది. 'నీ గడీల గడ్డి మొల్తది' అని తూటాలలాంటి మాటలతో దొరను గదిమేది.

ఇది భరించలేని దొర ఆమెతో పాటు కమ్యూనిస్టు నాయకులపై పాలకుర్తి దొమ్మీ కేసు పెట్టించాడు. ఖూనీకోరులను వారి మీదకు ఉసిగొలిపాడు. ఐలమ్మ తదితరులు కోర్టుకు విన్నవించుకుందామని వెళ్తుంటే భువనగిరి సమీపంలో దాడి చేయించాడు. వారు తీవ్రగాయాలతోనే హైదరాబాద్‌ వచ్చారు. కోర్టులో తీర్పు ఆమెకు అనుగుణంగా వచ్చింది. అప్పట్లో ఈ సంఘటనను 'మీజాన్‌' ఉర్దూ, తెలుగు దినపత్రికలో సంపాదకులు అడివి బాపిరాజు ప్రముఖంగా ప్రచురించారు. విస్నూరు దొర ఆగడాలకు ఆమె కుటుంబం ఛిద్రమైంది. పోరాటంలోనే కొడుకు, భర్త ప్రాణాలు వదిలారు. అయినా వెరవలేదు. అగ్నికణం వలె నిత్యం ఉద్యమనెగళ్లను కాపాడేది. ఆమె తెగువ ఎన్నో భూపోరాటాలకు దారి చూపి నైజాం రాజ్యం పతనానికి పునాదులు వేసింది. 10 సెప్టెంబరు 1985న ఐలమ్మ కన్ను మూసింది. వీరనారి చాకలి ఐలమ్మ. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయం.

(నేడు చాకలి ఐలమ్మ వర్ధంతి)

ఆలేటి రమేశ్

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

రజక విద్యార్థి సంఘం

99487 98982

రైతుల ఆత్మహత్యలకు కారకులెవరు

Tags:    

Similar News