దేశ సమగ్రతను కాపాడే యాత్ర

దేశ సమగ్రతను కాపాడే యాత్ర...SEIL trip to protect the integrity of the country

Update: 2023-02-15 18:30 GMT
భారతదేశం యొక్క ఔన్నత్యం మాటల్లో వర్ణించలేనిది. భారతదేశం అనేక మతాలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పరిచయం చేసిన నేలలో ఏదో మహత్యం ఉందని విదేశీయులు సైతం మెచ్చుకుంటారు. ఈ దేశంపై ఎన్నో యుద్ధాలు, దాడులు జరిగినా ఎక్కడా తన ఉనికిని కోల్పోకుండా ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారు. మతాలు వేరైనా మేమంతా ఒకటే అనే దృఢ సంకల్పంతో 'వసుదైక కుటుంబం' అనే భావన ఇక్కడి ప్రజల్లో నరనరాన జీర్ణించుకుపోయింది.

అయితే మన దేశంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజల జీవన విధానానికి ఇక్కడి జీవన విధానానికి తేడా ఉండటంతో వారిలో ఏదో తెలియని భావం వెంటాడుతుంది. అందుకే దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో వారిని విదేశీయులని పొరబడుతుంటారు. దీంతో వారిలో అభద్రతా భావం కలుగుతోంది. అందుకే ఈ అభద్రతా భావాన్ని పోగొట్టేందుకు ప్రతి సంవత్సరం 'భారత్ గౌరవ్ యాత్ర' నిర్వహిస్తుంది ఏబీవీపీ. ఈ యాత్రలో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి 30 మందిని ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించి మూడు రోజుల పాటు ఇక్కడి ఆచార వ్యవహారాల్లో నిమగ్నమై దేశమంతా ఒక్కటే మనమందరం భారతీయులమనే భావన కలిగిస్తుంది ఈ యాత్ర.

ఈ యాత్రను 1965వ సంవత్సరంలో ప్రారంభించింది ఏబీవీపీ. అయితే మొదటిసారి అరుణాచల్ ప్రదేశ్‌ని దర్శించిన వారు వారి ఆచార వ్యవహారాల్లో మమేకం కావడానికి ఇబ్బంది పడటంతో దీనిని పరిష్కరించాలని ఏబీవీపీ అంతర్జాతీయ ఛాత్ర జీవన్ దర్శన్ (సేయిల్ టూర్) ను ప్రారంభించారు. ఇందులో భాగంగా 1966 నుండి విద్యార్థులు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ సాంస్కృతిక ఐక్యతను అనుభవిస్తూ భావనాత్మకంగా కలిసిపోతున్నారు. అప్పుడు ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రేరణతో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అక్కడి విద్యార్థులు గళమెత్త లేదు. ఇంతటి ప్రాముఖ్యత ఈ యాత్రలో ఉంది. ఈ యాత్ర దేశ సమగ్రతను కాపాడటంలో ముఖ్య భూమిక పోషిస్తోంది.

హర్షవర్ధన్

ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్

98480 82629

Tags:    

Similar News