సేవ్ ఎడ్యుకేషన్, సేవ్ ఇండియా

Save Education, Save India

Update: 2024-02-07 00:30 GMT

జాతీయ విద్యా విధానం 2020లో లౌకిక, సామ్యవాద అంశాల ప్రస్తావన ఎక్కడా లేదు. ఇది సామాజిక న్యాయాన్ని విస్మరించింది. రిజర్వేషన్ల ప్రస్తావనను ఎక్కడ పేర్కొనలేదు. ఈ విద్యా విధానం విద్యార్థులను పెద్ద పెద్ద కంపెనీలలో గుమస్తాలుగా తయారు చేసేలా ఉంది. ఉన్నత విద్యలో అణచివేతలు, రిజర్వేషన్లపై ఆక్రమణలు ప్రబలంగా ఉన్నాయి.

గత పదేళ్ల మోడీ పరిపాలనలో ప్రభుత్వ విద్య పతన స్థితికి చేరింది. సైంటిఫిక్ టెంపర్ దెబ్బతిన్నది. తరగతి నాలుగు గోడలలో దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందని విద్యా వేత్తలు చెబితే, మోడీ పాలనలో అదే నాలుగు గోడల మధ్య విద్యార్థులను మతాల పేరు మీద విభజించారు. భాష, సంస్కృతి మీద వివక్షతను చూపించారు. కర్ణాటకలో హిజాబ్ పేరుతో విద్యార్థినులను వేధించారు. ఎన్అర్ఎఫ్ పేరుతో పరిశోధనలు నియంత్రించనున్నది. కులవృత్తులను పెంచి పోషించి మనువాద ఎజెండాను అమలుపరచడమే కాదు ఫెడరల్ వ్యవస్థను కూడా బలహీనపరుస్తుంది. అందుకే బీజేపీయేతర రాష్ట్రాలు ఈ విద్యా విధానం అమలును వ్యతిరేకిస్తున్నాయి.

కోర్సుల రద్దు.. ఫెలోషిప్‌ల రద్దు

ఎన్‌డీఏ ప్రభుత్వం ద్వారా భారత చరిత్రను తిరగరాయాలని ఆర్‌ఎస్‌ఎస్ చూస్తోంది. గాంధీని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించగా, సావర్కర్‌ను జాతీయ హీరోగా కీర్తించారు. పాఠ్యాంశాలలో యూనివర్శిటీల అకడమిక్ టెంపర్‌ను దెబ్బతీస్తుంది. అవకతవకలను ప్రోత్సహిస్తుంది. పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ భావజాలాలు తుడిచిపెట్టి కర్మ, జ్యోతిష్యం, యోగా, భూత వైద్య శాస్త్రాలను కోర్సులుగా పెడుతున్నారు. సంఘ్ పరివార్ మిత్రులను వైస్ ఛాన్సలర్లుగా నియమిస్తున్నారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ రిక్రూమెంట్‌లో వాళ్ల అనుకూలమైన వారితో భర్తీ చేస్తున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, మరియు విద్యకు బడ్జెట్ కేటాయింపులు క్షీణించడం వలన జాతీయ స్థాయి ఫెలోషిప్‌లను పూర్తిగా కుదించారు. వచ్చే అతికొద్ది ఫెలోషిప్‌లకు కూడా వాళ్ళకు అనుకూలమైన వారినే సెలెక్ట్ చేస్తున్నారు. దీంతో పేద వర్గాలు పరిశోధన నుండి దూరం అవుతున్నారు. ఎం.ఫిల్ లాంటి కోర్సుల రద్దు కూడా దీనిలో భాగమే. ఉన్నత విద్యలో అణచివేతలు, రిజర్వేషన్లపై ఆక్రమణలు ప్రబలంగా ఉన్నాయి. వీటితోపాటు విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య పెరిగినది.

విద్యార్థుల లక్ష్యం ఇదే..!

దీనిని వ్యతిరేకంగానే.. యునైటెడ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా పేరుతో పదహారు విద్యార్థి సంఘాలు ఐక్యంగా ఏర్పడినాయి. విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణను ఎదుర్కోవడమే ఈ విద్యార్థి సంఘాల పోరాట లక్ష్యం. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ భవిష్యత్తు ప్రమాదంలో పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. విభజన రాజకీయాలను ప్రతిఘటించడం ప్రధాన కర్తవ్యంగా భావించాలి. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల మనువాదపు ఆలోచనలను, మహనీయుల పోరాట స్ఫూర్తితో ఎదుర్కోవాలి.

ఆర్.ఎల్ మూర్తి

ఓయూ రీసెర్చ్ స్కాలర్

82476 72658

Tags:    

Similar News