సనాతన ధర్మం మతాలకతీతమా !

sanatana dharma...is it secular

Update: 2023-09-20 00:15 GMT

భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ప్రజాస్వామ్యంలో మత కల్లోలాలు సృష్టించనేల! అధికారం కొరకు మనుషుల మధ్య అగ్ని రాజేసి రక్తపాతం చిందించ నేల! నేటి రాజకీయం కొత్త పుంతలు తొక్కింది . డీఎంకే పార్టీ నాయకుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ గురించి అన్న మాటలు అగ్గి మీద గుగ్గిలమై దేశములో ఆందోళన కలిగిస్తుంది. ఆయన సనాతన ధర్మంపై తన భావజాలాన్ని వ్యక్తీకరించారు. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

ధర్మంపై వివరణ ఇచ్చుకోరా?

సనాతన ధర్మం అంటే అంటరానితనం, కుల వ్యవస్థ, సాంఘిక దురాచారం అని కూడా భావిస్తున్నారు’. ఆత్మ పునర్జన్మను విశ్వసించేది మతం అని కూడా అనుకుంటున్నారు. మూఢ నమ్మకాలతో సనాతన ధర్మం ముడిపడి ఉన్నదని కూడా అనుకోవచ్చు. ఆయన తీసుకునే అర్థం బట్టి మాట్లాడినాడు. రాజ్యాంగ విరుద్దమైతే కుల మతాలకు చిచ్చు పెట్టేది అయితే తప్పనిసరి తప్పుపట్టాలి. ఖండించాలి కూడా. సనాతన ధర్మం అంటే శాశ్వతమైనదని మతం కాదని మన జీవితం ఉత్తమంగా నడవడానికి అంతర్లీనంగా ఉన్న నియమాలకు కట్టుబడి ఉంటే జీవితం సంపూర్ణం అన్న భావన కూడా ఉంది. అలాగే అయితే వివాదాలకు అతీతంగా ఉంటుంది. వేషధారణ బట్టలు కట్టు బొట్టు కాలాన్ని బట్టి మారుతుంది. హిందువులను రెచ్చగొట్టినట్లు భావించిన స్వామీజీ గారు హింసను ప్రేరేపించే మాటలు మాట్లాడటం ఏమిటి? హింసను ప్రేరేపించే మాటలు ఇరువురికి తగదు దీనితో మరో ప్రశ్న కూడా ఉద్భవించింది. ఇంతకూ వీరికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? అక్రమ సంపాదన అయితే ప్రభుత్వం ఎందుకు చేతులు కట్టుకొని ఎందుకు కూర్చుంది? దీనికి లెక్కలతో సహా వివరణ ఇచ్చుకోవాలి.

సనాతన ధర్మం అంటే తాము అర్థం చేసుకున్నది ఏమిటో చెప్పాలి. అలా కాకుండా మొండిగా సవాలు విసరడం చిక్కుల్లో పడగొడుతుంది. మేధావులు రాజకీయ విశ్లేషకులు చర్చలలో పాల్గొని భిన్న అభిప్రాయాలు చెప్పినప్పటికీ విషయాలు మానవతా విలువలకు మానవ వాదానికి వ్యతిరేకంగా ఉంటే అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది. ఇది ప్రజాస్వామ్య దేశానికి చాలా ప్రమాదకరం. అసలు విషయాన్ని వదిలి పెట్టీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం సరైంది కాదు. సనాతన ధర్మం అంటే ఏమిటి దానికి వివరణ ఇవ్వరా? అర్థాలు తెలియకుండా మాట్లాడి ఛాలెంజ్ విసరడం ఖండించదగిన విషయం. ఒకే మతానికి కంకణం కట్టుకున్న ఏ పార్టీకీ చెందిన ప్రభుత్వమైనా పేక మేడల్లా కుప్పకూలిపోక తప్పదు.

ధర్మం ఉంటే ఇన్ని అనర్థాలు ఎలా?

గతంలో శతాబ్దాల పాటు మత యుద్ధాలతో రక్త పాతమైన భూమిని మరచి పోవద్దు.. మనుషులంతా ఒక్కటే మతాలు సంప్రదాయాలు, సంస్కృతులు అంతా మనుషులు సృష్టించుకున్నదే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. అసలే చిన్నది జీవితం ఇంకా చిన్నదిగా చేసుకోవడం, చికాకులు కొని తెచ్చి కోవడం విజ్ఞత అనిపించుకోదు. మణిపూర్‌లో జరిగిన హత్యలు స్త్రీలను నగ్నంగా ఊరేగించిన సంఘటనలు సనాతన ధర్మం ఆపగలిగిందా! గుజరాత్‌లో జరిగిన మారణ హోమానికి కళ్లెం ఎందుకు వేయలేక పోయింది? సనాతన ధర్మం నర బలులు చేతబడులు హత్యలు మానభంగాలను ఎందుకు కట్టడి చేయలేకపోతోంది? మూఢ నమ్మకాలు పెంచి పోషించే ప్రభుత్వాలు ఉండడమే అసలు కారణం. ఇంత జరుగుతున్న పాలకులు మౌనం వహించడం దేనికి దారి తీస్తుంది? ఇప్పటి పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు కావాలి. సమాజంలో కుళ్లును దులిపే సంఘసంస్కర్తలు రావాలి. మానవీయ కోణంలో పనిచేసే ప్రభుత్వాలు ఉండాలి.

ప్రార్థనా మందిరాల్లో ఆధ్యాత్మిక ఆశ్రమాలలో సనాతన ధర్మం ఆచరణలో పెట్టే స్వామీజీలు, పీఠాధిపతులు, పూజారులు స్త్రీలపై హత్యాచారాలు మానభంగాలు ఎందుకు చేస్తున్నారు? సనాతన ధర్మం ప్రకారం సముద్రాలు దాటకూడదు అని అంటారు. మూరెడంత గడ్డాలు పెంచి కాషాయ వస్త్రాలు ధరించి ఖండాంతరాలు దాటి విలాసాలు అనుభవించే పెద్ద మనుషులు కోకొల్లలు లేరా ! అసలే భారతదేశం మూఢ నమ్మకాలకు పుట్టినిల్లు. దీనిని నిర్మూలించుటకు 17వ శతాబ్దంలోనే రాజారామ్ మోహన్ రాయ్ సతీసహగమన దురాచారానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించాడు. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ , కందుకూరి వీరేశలింగం, బి.ఆర్ అంబేడ్కర్,పెరియార్ ఈ వి రామస్వామి, జ్యోతిరావు పూలే, మొదలైన వారు వారి జీవితాలను త్యాగం చేసి సాంఘిక దురాచారాలను నిర్మూలించడంలో కీలక పాత్ర వహించారు. నేటికీ అలాంటి దురాచారాలను పోషించే పాలకులున్నారు. కాబట్టి తెగించి పోరాటం చేయాలి భరతమాత కన్నీరు తుడవాలి. పట్టు చీర కట్టించి పూర్ణకుంభంతో ఎదురేగి తీసుకొని వచ్చి మానవత్వం సింహాసనంపై కూర్చుండ బెట్టాలి. భారత రాజ్యాంగం చేతిలో పెట్టి దానిని ‘రక్షించే బాధ్యత మాదే అని’ మువ్వన్నెల జెండా సాక్షిగా ప్రతిజ్ఞ చేసి ముక్త కంఠంతో ఐక్యతా గీతం ఆలపించాలి. మానవీయ విలువలకు పెద్ద పీట వేద్దాం. ప్రజాస్వామ్యం చిగురించి పరిమళించే దిశగా అందరం కలిసి అడుగులు వేద్దాం.

- పూసాల సత్యనారాయణ

90007 92400

Tags:    

Similar News