ఈ అసందర్భ చర్చ అవసరమా?

Sanatana Dharma is an absurd debate

Update: 2023-09-22 00:45 GMT

టీవల తమిళనాట స్టాలిన్ కుమారుడు, కరుణానిధి మనుమడు ఉదయనిధి మారన్ చేసిన అపరిపక్వ మాటలు హిందూ సమాజాన్ని రెచ్చగొట్టాయి. పత్రికల్లో, టీవీల్లో చర్చోపచర్చలకు దారి తీసింది. మతాల పట్ల విభజన రేఖను సృష్టించి విద్వేష భావాన్ని పాదుకొల్పాయి. సమాజంలో ఓ స్థాయిలో ఉండే వ్యక్తులు, రాజకీయ నాయకులు, సినిమా నటులు ఇతరులని ప్రభావితం చేయగల దశలో ఉన్నప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. భారతదేశంలో విభిన్న మతాలు, కులాలు, తెగలు, జాతులు, భాషలు, ప్రాంతాలు లేదా రాష్ట్రాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం ప్రదర్శించే ఓ గొప్ప సాంస్కృతిక దేశం. కులం, మతం వారి వారి వ్యక్తిగతంగా భావించాలి. కులాన్ని, మతాన్ని కించపరిచే చర్యలు సమాజానికి హితం కాదు.

సమాజాన్ని పద్ధతిలో ఉంచేందుకు..

ప్రతి మతంలోనూ మంచి చెడూ ఉన్నాయి. ఆనాటి కాలమానం ప్రకారం ఆయా మత పెద్దలు పెట్టుకున్న నియమాలు, పద్దతులు, కాలక్రమేణా వాటిల్లో ఎన్నో మార్పులు, చేర్పులు వస్తుంటాయి. మంచిని గ్రహించాలి, చెడుని విస్మరించాలి. కొంత మంది వితండవాదులు సనాతన ధర్మాన్ని పాటించడం అంటే సతీ సహగమనం, వర్ణ వివక్ష, మనుధర్మం పాటించడం అని మట్టి గరచిన సంప్రదాయాలను మళ్లీ కెలికి హిందూ ధర్మంపై బురద జల్లే పని పెట్టుకున్నారు.. కానీ ప్రతి మతంలోనూ కొన్ని ఆనాటి కాలమానం, పరిస్థితులు కొన్ని నియమాలను సృష్టించాయి. కొన్ని ఆనాడు మంచిగా కన్పించినవి ఈరోజు మనకు వింతగా, చెడుగా కనిపించవచ్చు. వాటిని ఏ మతం అయినా మార్చుకుంటూ రావాలి. మార్పు సహజం. ఇతర మతాల్లో కూడా అవివేకమైన షరతులు ఉన్నాయిగా!

కుహనా నాస్తిక వాదం చేసే వారు ప్రసంగాలు బాగా ఇస్తారు.. దేవుడూ లేడు.. దెయ్యం లేదు అని సెలవిస్తూ కేవలం హిందుత్వంపై మాత్రమే విషం చిమ్ముతారు. అదేమి గమ్మత్తో కానీ వారూ ఒకనాటి హిందువులే, ఆపద వచ్చినప్పుడు గుళ్ళు, గోపురాలు తిరుగుతారు. ఇతర మతాల్లో వేలు బెట్ట సాహసించరు.. నాస్తిక వాదం ప్రకారమే కాసేపటికి.. దేవుడు లేడు, ధర్మం లేదు అనుకుందాం అప్పుడు సమాజానికి ఏమౌతుంది? పాప భీతి పోతుంది. అవినీతి, అన్యాయం, ఆక్రమణ, విచ్చలవిడితనం పేట్రేగిపోతాయి. గుత్ప ఎవడిదో గేదె వాడిది అవుతుంది. బలవంతుడు బలహీనుడిని దోచుకుంటాడు. దోపిడీలు, దురాక్రమణలు, అరాచకాలు, మానభంగాలు ఇవన్నీ సంభవిస్తాయి. అందుకే ఆనాటి పెద్దలు సమాజాన్ని ఓ క్రమ పద్ధతిలో ఉంచడానికి దేవుడు, దెయ్యం, పాపం, పుణ్యం మొదలైన పదాలను సృష్టించారు. ఇవన్నీ సమాజాన్ని ఓ క్రమ పద్ధతిలో పెంచడానికే సుమా..

ఒకప్పుడు అందరూ హిందువులే!

ఒక సారి తరగతిలో ఉపాధ్యాయుడు లేకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి.. ఆ తరగతి గది, ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకుంటే ట్రాఫిక్, రాజు లేకుంటే రాజ్యం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అన్నీ క్రమం తప్పేస్తాయి. అందుకే పూర్వీకులు ఎంతో ముందు చూపుతో సిద్దాంతీకరించినదే మతం, ధర్మం. ఎవరు ఏ మతంలో పుడితే ఆ ధర్మాన్ని పాటిస్తారు. అది వారి వ్యక్తిగతంగా చూడాలి. అంతేగాని కించపరచడం, తూలనాడడం మానాలి.

భారతీయ సమాజం సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఓ గొప్ప సాంస్కృతిక పరంపర, వారసత్వం ఉన్న దేశం. ఎవరు రాశారో తెలియని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, ఎవరు నిర్మించారో తెలియని గుడులు, గోపురాలు ఇవన్నీ సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనం. ఒకప్పడు భారత్ హిందూ దేశం. ఒకనాడు భారతీయులందరూ హిందువులే. ఎవరు అంగీకరించినా, లేకున్నా. ఇటీవల గులాం నబీ ఆజాద్ ఈ మాటలే అన్నారు.. అవే మాటలు ఏ హిందువో అంటే ఇప్పుడు జరుగుతున్న రచ్చ కన్న ఎక్కువే జరిగేది. దేవుడిని నమ్ముతూ పాపభీతి కలిగి పుణ్యకార్యాలు చేసే హిందువులు ఇతర మతాల పట్ల గౌరవ భావం కలిగి ఉంటారు. గుడికి మాత్రమే కాదు చర్చిని, మసీదును దర్శిస్తారు. సబ్ కా మాలిక్ ఏక్ హై అన్న సాయిబాబాను దైవంగా కొలిచే సమాజం.

భిన్నత్వంలో ఏకత్వమని చాటుదాం!

భారతదేశంలో ఉన్న మతాలన్నీ దేవుడు ఉన్నాయి అనే చెబుతాయి.. యేసు క్రీస్తు దేవుడు అని క్రిస్టియానిటీ చెబితే, అల్లాయే దేవుడు అని ఇస్లాం చెబితే హిందూ సనాతన ధర్మం ఎవరు ఏ రూపంలో కొలిస్తే దైవం ఆ రూపంలో కనిపిస్తాడు! దేశంలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు. ఇక్కడ రాయిలో రప్పలో, మనిషిలో దేవుడ్ని చూడమని చెబుతుంది. ఇతర అన్య మతాలను గౌరవిస్తుంది. పరమత సహనం పాటిస్తుంది. సర్వే జనాః సుఖినోభవంతు అని బోధిస్తుంది. ఇవన్నీ సహేతుకం కాదా.. మత సామరస్యానికి ఇంకేం కావాలి. అలాంటప్పుడు ఒక మతంపై ఎందుకు అంత అక్కసు, విషం చిమ్మడం? నీ మతం నీవు పాటించే స్వేచ్చ నీకు ఉన్నప్పుడు ఇతరుల హక్కులను భంగం కలిగించే హక్కు ఎవరు ఇచ్చారు?

అధికారం, అవివేకం కొన్ని సార్లు అనవసర ప్రేలాపనలు చేయిస్తుంది. కులాన్ని, మతాన్ని బహిరంగ సభల్లో ప్రస్తావించరాదు, కించపరచరాదు. భారతదేశం మత ప్రమేయం లేని లౌకిక రాజ్యం అన్నపుడు, రాజ్యాంగం బోధించినప్పుడు ఈ మత ప్రసక్తి ఎందుకు చేస్తారు? మతాన్ని తన మానాన తనను వదిలెయ్యండి. మనమంతా భారతీయులం అని చెప్పండి. ఓ పూలమాలలో రంగు రంగుల పూలెన్నో ఉంటాయి, దారం వాటిని కట్టి పడేస్తుంది. అలాగే భారతీయత అన్ని మతస్తులను కట్టిపడేస్తుంది. అదే భిన్నత్వంలో ఏకత్వం అని చాటుదాం. అపరిపక్వ వాదానికి చెల్లు చీటీ చెబుదాం. ప్రపంచం మన వైపు చూస్తుంది. అలాంటప్పుడు ఈ పేచీలతో మనని మనం అగౌరవ పరచుకోవడం మన దేశాన్ని మనం కించపరచుకోవడమే. విశాల హృదయంతో ఆలోచిద్దాం... సారే జహాసే ఆచ్చా హిందూ సితా హమారా అని చాటుదాం...!

శిరందాస్ శ్రీనివాస్

94416 73339

Tags:    

Similar News