తెలంగాణ సినిమాపై 'సక్కని ముచ్చట్లు'
'Sakkani muchatlu' on Telangana cinema
స్వరాష్ట్ర కల సాకారం అయ్యాక ఎన్నో ఫలాలను తెచ్చిపెట్టింది. వాటిలో ఒకటి ఈ నేలకు చెందిన సొంత సినిమా నిర్మాణ ప్రయత్నం. ఈ పదేళ్ల కాలంలో ఈ దిశగా తెలంగాణ సినిమా క్రమంగా వికసిస్తోంది. సొంత ముద్ర కోసం పురుటి నొప్పులు పడుతోంది. రొటీన్ తెలుగు సినిమా ట్రాక్ నుంచి సొంత నడకకు దారులు వెతుక్కుంటోంది. 'మన సినిమా' కోసం ఒక పంథాను రూపొందించుకోవాలని ఇప్పుడు తెలంగాణ కళాకారులు సమిష్టిగా చింతన చేస్తున్నారు.
హైదరాబాద్‌లో తెలుగు సినిమా తయారైనా తెలంగాణకు ఇంత కాలం పరాయిదే అయింది. ఇక్కడి కళాకారులకు అవకాశాలు లేకుండేది. ఈ భాషకు గౌరవం దక్కక పోయేది. స్వరాష్ట్ర కల సాకారం అయ్యాక ఎన్నో ఫలాలను తెచ్చిపెట్టింది. వాటిలో ఒకటి ఈ నేలకు చెందిన సొంత సినిమా నిర్మాణ ప్రయత్నం. ఈ పదేళ్ల కాలంలో ఈ దిశగా తెలంగాణ సినిమా క్రమంగా వికసిస్తోంది. సొంత ముద్ర కోసం పురుటి నొప్పులు పడుతోంది. రొటీన్ తెలుగు సినిమా ట్రాక్ నుంచి సొంత నడకకు దారులు వెతుక్కుంటోంది. 'మన సినిమా' కోసం ఒక పంథాను రూపొందించుకోవాలని ఇప్పుడు తెలంగాణ కళాకారులు సమిష్టిగా చింతన చేస్తున్నారు. అందులో భాగంగానే డిసెంబర్ 24 నాడు గాంధారి ఖిల్లా కాడ 'మా సక్కని సినిమా ముచ్చట్లు' అనే స్థానిక సినీ జీవుల ఆలోచనల కలబోత కార్యక్రమం జరిగింది. మంచిర్యాల జిల్లా మందమర్రి సమీపంలోని బొక్కల గుట్ట గ్రామానికి అనుకోని ఉన్న అటవీ ప్రాంతంలో గాంధారి ఖిల్లా ఉంటుంది. 12 వ శతాబ్దంలో గోండు రాజులు దీనిని నిర్మించారని చరిత్ర చెబుతోంది.
ఒక వినూత్న ఆలోచనతో మంచిర్యాలకు చెందిన సినీ గీత రచయిత అక్కల చంద్రమౌళి వర్మ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన వచ్చింది. గత దశాబ్దకాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించి వివిధ శాఖల్లో పనిచేస్తున్న తెలంగాణ బిడ్డలు ఈ ముచ్చట్లలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 50 మంది ఒక్క చోట కూడి పరిశ్రమలో తమ సాధకబాధకాలు పంచుకున్నారు. సినిమాల్లో ప్రస్తుతం మనమెక్కడున్నాం, ఎక్కడుండాలి, ముందుకు సాగడానికి కలిసికట్టుగా ఏం చేయాలి అనే అంశాలపై అర్థవంతమైన చర్చకు ఈ కలయిక వేదిక అయింది. సినీ దర్శకత్వం, రచన, గీతరచన, స్వర కల్పన, నటన, ఛాయాగ్రహణం, ఎడిటింగ్ ఇలా భిన్న శాఖల్లో ఇప్పటికే పనిచేస్తున్న లేదా సహాయకులుగా ఉన్నవారు ఇందులో పాల్గొన్నారు. సినిమా రంగంలోకి రావాలనుకునే ఔత్సాహికులు కూడా వచ్చి పరిశ్రమ ప్రాథమిక అంశాలను తెలుసుకోగలిగారు.
కోల్ బెల్ట్ మొదటి నుంచీ కళల కాణాచి. బొగ్గుబాయిల్లో పనిచేసేందుకు చుట్టూ ప్రాంతాల్లోంచి వచ్చిన వందలాది కుటుంబాలను కళారంగం ఒక్కటి చేసింది. ప్రతిభ కలవారికి ప్రోత్సాహం లభించింది. అలా సింగరేణి కార్మికుల బిడ్డలు కళాకారులుగా ఎదిగారు. పాటలు రాయగలరు, స్వరాలు కూర్చగలరు, చక్కగా పాడగలరు, పాటకు తగ్గట్టుగా ఆడగలరు. తమ సత్తాను నిరూపించుకునేందుకు వారు ఇప్పుడు చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ పయనాల మజిలీగా 'మా సక్కని సినిమా ముచ్చట్లు'ను పేర్కొనవచ్చు.
మంచిర్యాలలో ఉండే ప్రముఖ రచయిత అల్లం రాజయ్య ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు. ప్రపంచ సినిమాను, చిత్రరాజాలుగా నిలిచిన సినిమాలను నిశితంగా పరిశీలించాలన్నారు. సినిమాకు తగిన కథలెన్నో తెలంగాణ జీవితాల్లో ఉన్నాయి, ఈ జీవితాల వెనుక ఉండే రాజకీయ, ఆర్థిక, సామాజిక, తాత్వికతను అర్థం చేసుకోవాలని అన్నారు. సెన్సార్ బోర్డు ప్రాంతీయ ప్యానల్ మెంబర్, సినిమా దర్శకుడు అయిన కుమార స్వామి (అక్షర) ఇందులో పాల్గొని తోటి సినిమా వాళ్లలో సీనియర్‌గా తన అనుభవాలను పంచారు. ఇప్పటికే పరిశ్రమలో ఉన్నవారు తమ సినిమాల్లో కొత్తవారికి అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తామని హామీలు ఇచ్చారు. వర్ధమాన దర్శకులు కల్యాణరావు, తిరుపతి వర్మ, గోవిందరాజు, సిరిపురం రాజేశం, రచయిత ఇట్యాల కిషన్, నటులు మహేష్, సాగర్, వెంకటేష్, జాకిర్.. ఇంకా షార్ట్ ఫిలిం మేకర్స్, యూట్యూబర్స్ ఇందులో పాల్గొన్నారు.
మొత్తానికి ఈ కలయిక తెలంగాణ సినిమా రూపకల్పనకు ఒక ముందడుగు. ఈ 'ముచ్చట్లు' మళ్ళీ మళ్ళీ సాగాలి. కార్యశాలగా మారాలి. 'దుఃఖపడ్డవాళ్ల దగ్గరే కథలుంటాయి. కథల కోసం భారతీయ సినిమా దక్షిణాది వైపు చూస్తోంది' అని అల్లం రాజయ్య అన్నారు. ఈ పరిణామాన్ని కాపాడుకొనేందుకు తెలంగాణ నుండి కూడా పరిశ్రమ నైపుణ్యం పెరగాల్సి ఉంది. ఇలా రామసక్కని ముచ్చట్లు మరిన్ని ఫలవంతం కావాలి. ఈ రంగంలో ఉపాధితో పాటు తెలంగాణ జెండా ఇప్పటికైనా రెపరెపలాడాలి.
- బి.నర్సన్
94401 28169