నీ పాటతో తెలంగాణ ఉద్యమ సమయంలో నిద్ర లేచాం. అమరవీరుల గానమా.. అంటూ అమరుల త్యాగాలను చాటావు, నీ పాటల పదాలతో తెలంగాణ రాష్ట్రం వద్దు అన్న వారితోనే చెయ్యెత్తి జై కొట్టేలా చేశావ్.. నీ పాటకు వందనం, నీ మాటకు వందనం, నువ్వు చూపిన తెలంగాణ ఉద్యమ బాటకు శతకోటి వందనాలు... నీవు పండించిన విప్లవాల పూదోటలో నేను ఒక పసిమొగ్గను.. నా లాంటి ఎందరినో నీ మాటలతో, నీ పాటలతో సమ సమాజ స్థాపన కోసం పోరాడే శక్తిని, పోరాడే బాధ్యతను మాకు తెలీకుండానే మాకు అప్పజెప్పి తూటాతో కాపురం చేస్తూ, ఆ తూటాను కూడా నీతో పాటే తీసుకెళ్తున్న మా గద్దరన్న నీకు నా వినమ్ర ఉద్యమ నివాళి..!
ఉద్యమ ఓనమాలు నేర్పి..
బండెనుక బండి కట్టి.. నట్టనడుమ నల్లగొండ.. నువ్వుండేది హైద్రబాదు.. దాని పక్క గోలుకొండ.. గోలుకొండ ఖిల్లా కింద నీ గోరి కడుతం కొడుకో నైజాము సర్కరోడా.. అంటూ నైజాం పాలన వ్యతిరేకించి మాలో ఉద్యమ స్ఫూర్తి నింపావు... అమ్మా తెలంగాణామా.. ఆకలి కేకల గానమా అంటూ మన తెలంగాణ ప్రజల పస్తులను ప్రపంచానికి చాటి చెప్పినావ్...
శ్రమ జీవుల గొంతుక ... ప్రజల నిట్టూర్పును పాటగా మలిచిన మరణంలేని పాటను అందించిన వ్యక్తి గద్దర్. శ్రమ జీవుల శ్రమ నాశనం అవుతున్న సమయంలో, వారి కష్టాన్ని దోచుకుంటున్న ఈ వ్యవస్థలో ఒక గొంతుక మూగబోయింది. నీ పాటే తూటా, నీ మాట విప్లవాల బాట.. తొలి మలి దశ ఉద్యమంలో నువ్వు తయారు చేసిన ఉద్యమ వీరులు ఎందరో... నువ్వు పాటతో రాజేసిన ఆ ఉద్యమ అహుతిలో కనపడకుండా పోయిన ఉద్యమ ద్రోహులు ఎందరో... టపాసులు కాల్చి విసిరేసిన నీ పాట మాట తూటాలకు తెలంగాణ విడిచి పారిపోయిన కల్తీ నాయకులు ఎందరో... ప్రపంచానికే ఉద్యమ పాటలు నేర్పిన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఉద్యమ ఓనమాలు నీ పాటతోనే తెల్లారింది అంటే మాటలా... నమ్ముకున్న సిద్ధాంతం కోసం తోటి కమ్యూనిస్టులనే ఎదిరించినా, ముష్కరులు నీకు ప్రాణహని తలపెట్టినా ఎత్తిన జెండా విడువలే, పట్టిన సిద్దాంతం మరువలే... అందుకే నువ్వుంటే తెలంగాణ ప్రజలకు చిరకాల మిత్రుడవు, అమరుడవు, ఆత్మ బంధువు ...
స్వరాష్ట్రమే ఎజెండాగా, తెలంగాణ ప్రజల దీన స్థితిని మర్చటమే ధ్యేయంగా ముందుకు కదిలి, ప్రతి గల్లీ తిరిగి జన జాగృతి చేసుకుంటూ.. ఇటు ప్రజలు అటు పాలకులకు తెలంగాణ ఆవశ్యకతను చాటుతూ నువ్వు చేసిన విప్లవ ఉద్యమానికి తెలంగాణ అనే పదం ఈ సృష్టిలో ఉన్నంత వరకు గద్దర్ అనే పేరు ప్రతి గుండెలో ఉంటుంది ... త్యాగాల వారసత్వం మోసే ఈ తెలంగాణ ప్రజలు తప్పకుండా నువ్వు చూపిన బాటను, నువ్వు చూపిన మార్గాన్ని తప్పకుండా భావి తరం ముందుకు తీసుకెళ్తుంది. జనగర్జనల ముందుకు సాగుతుంది.
సుర్యుడిలా అస్తమించి..
ఆనాడు బూర్జువా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ధిక్కార పతాకం ఎగరవేసి పీడిత వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచావ్...ఆంధ్ర దొరల పాలనలో దగాపడ్డ తెలంగాణ సమాజం కోసం మా భూములు మాకేనని మర్ల పడ్డ గానమా- పోరు తెలంగాణమా అంటూ తెలంగాణ ప్రజల కన్నీటి బాధ చెపుతూ రాగాలు తీశావ్... అమరవీరుల త్యాగాల మంటలు మీద చలి కాచుకుంటు కళ్ళు నెత్తికి ఎక్కిన తెలంగాణ దొర మీద దండు ఎత్తి దండోరా మోగించావ్ ... ఇలా ప్రజలకు కష్టం వచ్చిన ప్రతి సారి పెద్ద కొడుకుగా ముందు వుండి ప్రజలకు ఉద్యమ తోవ చూపించావ్ ... తెలంగాణలో పోరు విత్తనాలు వెదజల్లి ప్రతి గూడెంలో పోరు బిడ్డలను తయారు చేసినవ్.. తెలంగాణ సమాజాన్ని ప్రపంచ ఉద్యమాలకు చిరునామా చేసిన నీకు వందనం .. నీ పాటకు వందనం.
బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా.. అడక్క తింటే మన ఆకలి తీరదు, గుద్ది .... గుంజుకుందాంరో అంటూ నువ్వు కలలు కన్న తెలంగాణ కోసం పోరు చేస్తాం, అందరినీ పోగు చేస్తాం ... కోరుకున్న రాష్ట్రం వచ్చింది కానీ ప్రజలు కలలు కన్న తెలంగాణ రాలేదు అని బాధపడుతూ అధికార పక్షం ఆశలు చూపిన, బేరానికి వచ్చిన ప్రజలు కొరకు, ప్రజలు ఆశయాలు కొరకు, అమరవీరుల త్యాగాల కొరకు ప్రతిపక్షంతో ఉంటు ప్రజలు కొరకు పోరాడి వచ్చే ఎన్నికలో నువ్వు కలలు కన్న సామాజిక తెలంగాణ సిద్ధించే సమయానికి సూర్యుడిలా అస్తమించి మమ్మల్ని చీకటిలోకి నెట్టినప్పటికీ, నీ పాటలు పాడుకుంటూ మళ్ళీ పాట రూపంలో నువ్వు పుడుతావ్ అనీ ఎదురుచూస్తూ...
అన్వేష్ బిచ్చాల
ఖమ్మం, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
96669 17596