మానవతామూర్తి మన గురజాడ

Remembering poet Gurajada Apparao

Update: 2023-09-20 23:30 GMT

మనిషిని ప్రేమించడమే తన మతంగా చెప్పుకున్న మానవతామూర్తి గురజాడ అప్పారావు. ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం స్త్రీ కన్నీటి గాధలకు హేతువులు అంటూ 140 ఏళ్ల క్రితమే స్త్రీ స్వేచ్ఛ గురించి ఆలోచించిన దార్శనికుడు గురజాడ అప్పారావు. బ్రతికి చచ్చియు ప్రజలకెవ్వడు ప్రీతి కూర్చునో - వాడె ధన్యుడు అంటూ మానవత్వాన్ని వినిపించినా, కలిసి మెసగిన యంత మాత్రనె, కలుగబోదీ యైకమత్యము; మాల మాదిగ కన్నె నెవతెనొ మరులుకొన రాదో అంటూ కులాంతర సమాజాన్ని ఆకాంక్షించినా, మతములన్నియు మాసిపోవును, జ్ఞానమొక్కటె నిలిచి వెలుగును అంటూ అభ్యుదయాన్ని కలగన్నా, మలిన దేహుల మాలలనుచును, మలిన చిత్తుల కధిక కులముల అంటూ వర్ణ ధర్మాన్ని నిరసించినా, అవన్నీ గురజాడ అప్పారావు అభ్యుదయ దృక్పథానికి, తాత్విక ధోరణికి నిదర్శనాలు. కుల వివక్ష, మత వైషమ్యాలు, మూఢ నమ్మకాలు, స్త్రీ విద్య, బాల్య వివాహాలు, వితంతు వివాహాలు, వేశ్యా వృత్తి... ఒకటేమిటి, నాటి సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలన్నిటినీ పారద్రోలేందుకు విప్లవాత్మక భావాలతో, సమాజ పునర్నిర్మాణాన్ని ఆకాంక్షిస్తూ కవిత్వాన్ని వినిపించిన గురజాడ.. మహాకవి, ప్రజాకవి.

సుమారు 180 ఏళ్ల క్రితం.. మద్రాసు ప్రెసిడెన్సీ పరిపాలనలో తెలుగు ప్రాంతం కొనసాగుతున్న రోజులవి. నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతలు, బాల్యవివాహాలు, వర్ణవివక్ష, మూఢనమ్మకాల వంటి సామాజిక రుగ్మతలు సమాజాన్ని పీడిస్తున్న కాలం అది. సమాజ పునర్నిర్మాణాన్ని ఆకాంక్షించిన ఆనాటి తెలుగు మేధావులు కొందరు సంఘ సంస్కరణోద్యమాన్ని చేపట్టారు. కందుకూరి వీరేశలింగం పంతులు, సామినేని ముద్దు నరసింహనాయుడు వంటి తొలితరం ఆధునిక సాహిత్య వైతాళికులు సమాజ హితాన్ని కోరుతూ రచనలు చేశారు. బ్రిటిష్ పరిపాలన కారణంగా ఇంగ్లీషు చదువుకు అవకాశం కలగడంతో నాటి మేధావులు పాశ్చాత్య తత్వాన్ని, సంస్కృతిని, సాహిత్యాన్ని అధ్యయనం చేసి ముందడుగు వేశారు. ఇలాంటి నేపథ్యంలో 1862 సెప్టెంబర్ 21న విశాఖ జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో గురజాడ అప్పారావు జన్మించారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామముర్తి పంతులు గురజాడకు సహ విద్యార్థి, మంచి మిత్రుడు.1882 - 84లో గురజాడ యఫ్. ఏ. పూర్తి చేసారు. అదే ఏడాది విజయనగరం మహారాజా కాలేజీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ తరువాత ఉపాధ్యాయ వృత్తి నుంచి ఇంగ్లీషు లెక్చరర్‌గా చేరి కొద్ది కాలంలోనే విజయనగర సంస్థానంలో ఎన్నో బాధ్యతలు చేపట్టారు.

1913లో మద్రాసు విశ్వవిద్యాలయంలో ఫెలో పదవిని చేపట్టి విశ్వవిద్యాలయాలు - సంస్కృత మాతృభాషలు అనే నివేదిక సమర్పించారు. 1883లోనే గురజాడ సారంగధర అనే ఇంగ్లీషు కావ్యాన్ని రచించాడు. 1897లో కన్యాశుల్కం నాటకం ముద్రించి ఆనందగజపతికి అంకితమిచ్చారు. 1906లో కొండుభట్టీయం నాటకం, 1907లో నీలగిరి పాటలు,1909 లో కన్యాశుల్కం రెండవ కూర్పు,1910లో ముత్యాలసరాలు,1911లో లవణరాజుకల,1912లో కన్యక రచించి ప్రచురించారు.

ఆయన ఒక్కొ రచన.. ఒక సమస్య

ఆకులందున అణిగిమణిగీ కవిత కోయిల పలకవలెనోయ్ అంటూ ప్రజల కోసం, ప్రజల భాషలోనే రాయాలని తలచిన సామాజిక విప్లవమూర్తి గురజాడ అప్పారావు. వ్యాకరణ యుక్తమైన భాషలో ఉండాలని చెప్పిన విజ్ఞాన చంద్రిక సంపాదక వర్గానికి, నాది ప్రజల ఉద్యమం దాన్ని ఎవర్ని సంతోష పెట్టడానికి వదులుకోను అని ఖండితంగా చెప్పిన ధీరుడు గురజాడ. ఆయన రచనలన్నీ వేటికవే ఆణిముత్యాలు. గురజాడ రచనలన్నీ నష్టమైపోయి ఒక్క దేశభక్తి గీతం మిగిలినా చాలు, అతడు ప్రపంచ కవులలో ఒక్కడుగా లెక్కించదగిన మహాకవి అని రుజువు కావడానికి అన్నారు శ్రీశ్రీ. ఒక్కో రచన ఒక్కో సమస్యను చర్చిస్తుంది. ముత్యాలసరాల ఛందస్సులో ఉన్న లవణరాజుకల వర్ణవ్యవస్థను ప్రశ్నిస్తుంది. లవణుడు అనే రాజు స్వప్నలోకంలో విహరిస్తూ ఓ అడవిలోకి వెళ్తాడు. ఆ చిట్టడవిలో నల్లగా ఉండే మాల యువతి ఎదురు పడుతుంది. అనుకోకుండా వారి వివాహం జరిగి రాజు కూడా తన కులాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తరువాత జరిగిన సంఘటనలు ఎంతో హృద్యంగా లవణరాజు కల రచన కొనసాగుతుంది. కాసులు, కన్యక, పూర్ణమ్మ, దేశభక్తి మొదలైన గేయాలు చిరస్మరణీయాలు. ప్రాచీన కవుల్లో వేమన అటువంటివారు.. మళ్లీ ఈనాడు గురజాడ అప్పారావు అలాంటివారు అన్నారు శ్రీశ్రీ.. తెలుగు ప్రజల స్ఫూర్తి పథంలో అప్పారావు ఎల్లప్పుడూ జీవిస్తాడు. చనిపోయినప్పటికీ అతను జీవిస్తున్నాడు అని గిడుగు రామమూర్తి అన్నట్టుగా ప్రజల నాలుకలపై గురజాడ సదా జీవిస్తూనే ఉంటాడు.

( నేడు మహాకవి గురజాడ అప్పారావు జయంతి)

- వి. పద్మ,

తెలుగు ఉపాధ్యాయురాలు,

98666 23380

Tags:    

Similar News