క్యావేతిహాస స్రష్ట శేషేంద్ర

కాలాన్ని నా కాగితం చేసుకుంటా దానిమీద లోకానికి ఒక స్వప్నం రాసి ఇస్తా దానికింద నా ఊరితో సంతకం చేస్తా'' - శేషేంద్ర శర్మ

Update: 2024-10-20 01:15 GMT

''కాలాన్ని నా కాగితం చేసుకుంటా

దానిమీద లోకానికి ఒక స్వప్నం రాసి ఇస్తా

దానికింద నా ఊరితో సంతకం చేస్తా'' -

ఈ కవిత్వ పాదాలు తెలుగు కవిత్వంపై చెరగని సంతకం చేసిన కవి శేషేంద్రవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆధునిక తెలుగు కవిత్వంతో పరిచయమున్న పాఠకులు శేషేంద్ర కవిత్వాన్ని ఇట్టే గుర్తించగలరు. కవిత్వంపై శేషేంద్ర వేసిన సాధికార ముద్ర అది. శైలిలోను శిల్పంలోను, కవిత్వ నిర్మాణంలోనూ ఓ విలక్షణ మార్గంలో నడచిన శేషేంద్ర తమ అజరామర రచనలతో సాహిత్వాన్ని సుసంపన్నం చేశారు.

''ఓ నా ప్రజలారా! రండి మీకో కొత్త పద్యం ఇస్తా ఆ పద్యం మీకో కొత్త ప్రాణం ఇస్తుంది

కొత్త ప్రయాణం ఇస్తుంది'' ‌మహాకవి శేషేంద్ర తమ కవిత్వం ద్వారా ప్రపంచానికి చేసిన ప్రమాణం ఇది. కవిగా ప్రజలకిచ్చిన నైతిక మద్దతు ఇది. కాలం ఏదైనా, కలాన్ని పదునెక్కించి, కాలం వెంట నడవడమే కవి ప్రధాన కర్తవ్యం. ఈ కర్తవ్య పాలనలో కృతకృత్యుడైన కవిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. పూజిస్తారు. గౌరవిస్తారు. ఆరాధిస్తారు. కవిత్వాన్ని కాలాతీత కాంతిరేఖగా మార్చి, అన్ని వర్గాల వారిని ప్రభావితం చేసిన కవి శేషేంద్ర.

మూసభావాలకు స్వస్తి పలికి..

డా.శేషేంద్ర శర్మ అనన్య సామాన్యమైన తమ భావ సృష్టితో, అనితర సాధ్యమైన శబ్ద ప్రపంచంతో ఈ శతాబ్దాన్ని వెలిగించారు. మండేసూర్యుడిగా కవిత్వాకాశంలో ప్రకాశించారు. యుగ స్వభావాన్ని తమ కవిత్వంలో ప్రతిఫలింపచేసి ''యుగకవి''గా నిలిచారు. మూసభావాలకు స్వస్తి పలికారు. పాత వాసన గొట్టే పదాల్ని వదిలేశారు. సజీవమైన ప్రజల భాషలో కవిత్వానికి ప్రాణప్రతిష్ట చేశారు. సమకాలీన మహాకవులు సైతం ''శెభాష్ శేషేంద్ర'' అనేలా కవిత్వం రాశారు. వర్తమాన వచనకవుల్లో వచనమే తప్ప కవిత్వం లేదని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. ''సామాజిక స్పృహ'' అనే చవుకబారు నినాదంతో సాహిత్య స్పృహను సజీవ సమాధి చేస్తున్న కవులను నిరసించారు. భాషంటే యాభై ఆరు అక్షరాలు కాదని, అక్షరానికున్న శక్తిని గుర్తించి, చైతన్యాత్మకమైన భావాన్ని ఫిరంగిలా పేల్చడమే కవిత్వమన్నారు.

సమస్త మానవజాతికి కవే మార్గదర్శకుడన్నారు. లోకంలో కవులు ఎంతమంది వున్నా, మహాకవి మార్గమే భావితరాలకు మార్గదర్శకమన్నారు. నన్నయ్య, తిక్కన్న, శ్రీనాధుడు వంటి కవులను పద్య విద్యా పట్టభద్రులుగా అభివర్ణించారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యాన్ని సమగ్రంగా చదివిన శేషేంద్ర సంస్కృతాంధ్ర భాషలో పారం ముట్టిన పండితుడు, సంస్కృత, పాశ్చాత్య ఆలంకారిక గ్రంథాలను, విమర్శ విధానాలను ఆకళింపు చేసుకున్న ప్రతిభామూర్తి. షోడశి, స్వర్ణహంస, సాహిత్య కౌముది, కవిసేన మేనిఫెస్టో వంటి రచనలు శేషేంద్ర పాండితీ ప్రకర్షకు విమర్శనా దృష్టికి నిదర్శనాలు.

'కవితా దృక్పథం కవికే సొంతం' అనే నిశ్చితాభిప్రాయమున్న శేషేంద్ర 'కవిత్వం జీవన మధూళితో తడవాలి, సుమధూళిలా పరిమళించాలి' అంటారు. 'ఋతుఘోష' కావ్యం శేషేంద్ర అనితర సాధ్యమైన పద్యనిర్మాణ కౌశలానికి నిదర్శనం. ''కవి సమ్రాట్‌'', ''విశ్వనాథ'', ''సరస్వతీపుత్ర'' పుట్టపర్తి వంటి మహాకవులచేత ఆహ్వా! అనిపించిన కావ్యమిది.

''ఒక అందమైన పోయెం అంటే

దానికి ఒక గుండె ఉండాలి 

అది కన్నీళ్లు కార్చాలి

క్రోధాగ్నులు పుక్కిలించాలి

పీడితుల పక్షం వహించి మనిషి ఋణం తీర్చుకోవాలి''

రాసేది పద్యమైనా, గేయమైనా, వచన కవితయినా, కవి పీడిత ప్రజల గొంతుకగా ఉండాలన్న శేషేంద్ర అభిప్రాయంతో మనమూ ఏకీభవించాల్సిందే! పోయెంకు గుండె ఉండటమంటే పాఠకుణ్ణి కదలించే చైతన్య స్పృహ వుండటం. కవిత్వం కన్నీళ్లు కార్చడం అంటే కరుణ రసాత్మకం కావడం. క్రోధాగ్నులు పుక్కిలించడమంటే లోకం లోని అన్యాయాలు అక్రమాలు, హింస, దోపిడీపై కవి ధర్మాగ్రహం వ్యక్తం చేయ డం. మహాకవి శేషేంద్ర రాసిన ''ఆధునిక మహాభారతం'' సమకాలీన సమాజ స్థితికి అద్దం పట్టే సామాజిక కావ్యం శేషేంద్రను సామాజిక భావ విప్లవ కవిగా పరిచయం చేసే ఐతిహాసిక కావ్యం. విప్లవాన్ని కవిత్వీకరించడంకంటే, కవిత్వాన్ని విప్లవీకరించడం ముఖ్యమంటారు శేషేంద్ర. విప్లవమంటే కత్తులు దూయడం, తుపాకులు పేల్చడం, మనుషుల్ని చంపడం కాదం టారు. సగటు మనిషి జీవనంలో రావా ల్సిన సమూలమైన మార్పే విప్లవమంటారు శేషేంద్ర.

ఖడ్గం శక్తి ఖడ్గంలో లేదు. అది ఉపయోగించే చేతుల్లో ఉంటుంది. అలాగే కలం శక్తి కలంలో లేదు. రాసే కవి ఆలోచనల్లో, అవలోకనలో అభివ్యక్తిలో వుంటుంది. భావం, శబ్దం, అర్థం మూడూ కలసినపుడే కవిత్వం మాట్లాడుతుంది. సమాజంపై పోట్లాడుతుంది. జాతిని మేల్కొలిపే జీవనాడిగా నిలుస్తుంది.

“రైతులారా!

రాజకీయ వర్షం పడుతోంది

మోసపోయి విత్తనాలు చల్లకండి” శేషేంద్ర కళ్ళల్లోంచి జారిన మాటలివి. ఇక్కడ ''రాజకీయ వర్షం'' అంటే ఏమిటో తెలియకపోతే పాఠకుడికి కవి భావం అర్థం కాదు. అదును, పదును, సమయం సందర్భం లేకుండా కురిసేది వాగ్దానాల వర్షం. కోయిల కూయాలంటే వసంతం కావాలి. కాకులు అరవడానికి ఋతువులతో పనిలేదు. రైతుకు, రాజకీయ వర్షానికీ వున్న సంబంధంలోని అంతర్యం తెలియకపోతే కవిపై వాక్యాలు రాయలేడు. దీన్నే కవిత్వంలో 'ధ్వని' అంటారు. దీన్ని పాఠకుడు గ్రహించాలి. ఆధునిక మహాభారతంలో కర్షకుడే కథానాయకుడు. 'నాగలి మోస్తున్న రైతు శిలువను మోస్తున్న క్రీస్తులా వున్నాడు' అంటారు శేషేంద్ర.

'పిల్లల్లారా!

పుస్తకాలవతల పారేయండి

నాగలి భుజాన వేసుకొని

ఆ పొలాలలో కలవండి

పొలాలు, మీకు స్వేచ్ఛను దానం చేస్తాయ్‌' - అంటారు కవి.

'నేనింతా పిడికేడు

మట్టే కావచ్చు

కానీ కలమెత్తితే

నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంటుంది'

'ధరిత్రిని హలం దున్నితే

అపుడవతుంది

అది ఒక దేశం

ధరిత్రిని కలందున్నితే

అపుడవుతుందది ఒక్క ఇతిహాసం' ఇలాంటి విలక్షణ కవిత్వానికి పురుడు పోసిన శేషేంద్రను ఆధునిక విమర్శకులు పాక్షికంగా తప్ప, పరిపూర్ణంగా అంచనా వేయలేకపోయారు. శేషేంద్ర విప్లవ భావాలు, వినూత్న సిద్ధాంతా లు విమర్శకులకు అర్థం కాకపోవడమే ప్రధాన కారణం. శేషేంద్ర ప్రచార కవి కాదు. ప్రాపంచిక కవి. అవార్డుల కోసం అర్రులు చాచలేదు. వరించి విచ్చన వాటిని కాదనలేదు. ''జ్ఞానపీఠం'' శేషేంద్రకు దక్క లేదు. కాని, కోట్లాది మంది పాఠకుల ''హృదయపీఠం'' పై వారి స్థానం సుస్థిరం. శేషేంద్ర పేరు నోబెల్‌ పురస్కారానికి వెళ్లడం ద్వారా, కవి ప్రతిభకు ఎల్లలు లేవని చెప్పవచ్చు.

''నేను చెమటబిందువుని కండలకొండల్లో ఉద యించే లోక బంధువుని'' - అంటున్న శేషేంద్ర నిస్సందేహంగా ప్రజల కవి. నిజమైన రైతు కవి. సామాజిక చైతన్యాన్ని సాహిత్య చైతన్యంగా మార్చిన కవి. ఆలోచన, ఆవేశం, ఆధునికత, సమకాలీనత, సార్వకాలికత కలసిన కావ్యేతిహాస స్రష్ట శేషేంద్ర.

లోకంలో మూడు రకాల కవులుంటారు. రాసిందాంతో తృప్తి పడి, సంపాదించిన కీర్తిని తింటూ బతికేవాళ్లు. కవి సమ్మేళనాలకో, సన్మాన సభల కోసం రెడీమేడ్‌ కవిత్వం రాసేవాళ్లు. కాలం వెంట నడుస్తూ, కాలాన్ని తమ వెంట నడిపించుకపోయేవాళ్లు. శేషేంద్ర శర్మ కాలం వెంట నడిచిన కవి కలాన్ని కవిత్వానికి అంకితం చేసిన కవి. కవిత్వాన్ని కాలాతీత కాంతిరేఖగా నిలిపిన కవి. వచన కవిత్వాన్ని పరిపూర్ణత నిచ్చి విప్లవ భాషా విధాతగా నిలిచిన కవి. పాఠకుల హృదయాలను గెలిచిన కవి. కవికి వ్యక్తిత్వం ముఖ్యమని, కవులు జెండాలా గర్వంగా నిలబడాలని నినదించిన కవి. ఆధునిక కవిత్వంపై శేషేంద్ర సంతకం చెరగనిది - చెదరనిది.

ఆ మహాకవికి అక్షర నివాళి…

(నేడు శేషేంద్రశర్మ జయంతి)

బీరం సుందరరావు

కవి, విమర్శకులు, తెలుగు ఆచార్యులు

63034 43302

Tags:    

Similar News